పాకిస్తాన్ కు ఇండియా దెబ్బ చీనాబ్ నది నీరు నీ నిలిపివేత …

పాకిస్థాన్ పై యుద్ధం మొదలు పెట్టకుండానే భారత్ అప్పుడే విజయాన్ని చూస్తోందా..? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కపట బుద్ధిని ఎండగట్టేందుకు తీసుకున్న నిర్ణయం.. నిజంగా ఆ దేశాన్ని ఎడారిలా మారుస్తోందా..? 1960 నుంచి అమల్లో ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం ద్వారా పాకిస్థాన్ కు భారీ దెబ్బకొట్టిన భారత్ ఆ విషయంలో ఫలితాన్ని చూస్తోందా..? ఇంతకీ పాకిస్థాన్ కు జరిగిన నష్టం ఏంటి..? దాయాదిపై మనం కొట్టిన మొదటి దెబ్బ ఏంటి..?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్ కు నష్టం ప్రభావం కనిపిస్తోంది. పాకిస్థాన్‌లోని చీనాబ్ నదిపై ఉన్న మరాలా హెడ్‌వర్క్స్ వద్ద నీటి ప్రవాహం గణనీయంగా తగ్గినట్లు సాటిలైట్ ఇమేజెస్ చూపిస్తున్నాయి. ఏప్రిల్ 21, ఏప్రిల్ 26 తేదీల సాటిలైట్ చిత్రాలను పోల్చి చూస్తే, నీటి కాలువలు మాయమైయాయి, ఒక కాలువ పూర్తిగా ఎండిపోయింది. ఈ మార్పు కేవలం ఐదు రోజుల్లో జరిగింది. భారత సైన్యం మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కల్నల్ వినాయక్ భట్ ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐదు రోజులకే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ఏడారిగా మారడం ఖాయమంటున్నారు.

మరాలా హెడ్‌వర్క్స్ పాకిస్తాన్‌లోని చీనాబ్ నదిపై ఒక ముఖ్యమైన నీటి ప్రాజెక్ట్. ఇది భారత్-పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, సియాల్‌కోట్ సమీపంలో ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ హెడ్‌వర్క్స్ ద్వారా పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలో ఖరీఫ్, రబీ పంటలకు నీరు అందుతుంది. మరాలా వద్ద కనిపించిన మార్పులు కేవలం జలవనరుల సమస్య కాదు, ఇవి వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు రాబోయే రోజుల్లో వచ్చే పెద్ద విపత్తు అంటున్నారు.

ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య సంతకం అయింది. ఈ ఒప్పందం ప్రకారం, ఇండస్, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్‌కు నియంత్రణ ఇవ్వగా, బియాస్, రవి, సట్లెజ్ నదులపై భారత్‌కు నియంత్రణ ఇచ్చారు. ఈ ఒప్పందం పాకిస్తాన్‌కు మొత్తం నీటిలో 70 శాతం, భారత్‌కు 30 శాతం హక్కులను కల్పించింది. భారత్ పశ్చిమ నదుల నీటిని సేద్యం, విద్యుత్ ఉత్పత్తి వంటి వాటి కోసం వాడవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం రెండు దేశాల నీటి సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

పహల్గాం ఉగ్రదాడి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌కు కారణమైంది. దాడికి ప్రతిస్పందనగా భారత్ ట్రీటీని సస్పెండ్ చేసింది. గతంలో 2016 ఉరి, 2019 పుల్వామా దాడుల తర్వాత కూడా భారత్ ట్రీటీపై ఫోకస్ పెట్టింది, కానీ నీటి ప్రవాహన్ని అడ్డుకోలేదు. అయితే ఈసారి చర్యలతో సాటిలైట్ ఇమేజెస్ నీటి ప్రవాహం తగ్గినట్లు చూపిస్తున్నాయి. యుద్ధం చేయకుండానే పాకిస్థాన్ ఈ విధంగా భారత్ దెబ్బకొట్టిందని అనుకోవచ్చు.

పాకిస్తాన్ వ్యవసాయం ఇండస్ నదీ వ్యవస్థపై 80 శాతం ఆధారపడుతుంది. చీనాబ్ నది నీరు ఖరీఫ్, రబీ పంటలకు అత్యవసరం. మరాలా హెడ్‌వర్క్స్ వద్ద నీటి ప్రవాహం తగ్గడం పాకిస్థాన్ లో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుంది. పాకిస్థాన్ ఇప్పటికే నీటి కొరతతో సతమతమవుతోంది, వ్యక్తిగత నీటి లభ్యత 1,000 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువగా ఉంది. నీటి కొరత పాకిస్థాన్ లో వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తుంది. క ఈ మార్పు పంటలను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్ ఎడారిగా మారవచ్చని లేదా వరదలతో మునిగిపోవచ్చని అంటున్నారు.

భారత్ ఈ నిర్ణయం ద్వారా నీటిని వ్యూహాత్మక ఉపయోగిస్తోంది. పాకిస్థాన్‌కు నీరు అవసరమైనప్పుడు ఆపడం, అవసరం లేనప్పుడు భారత్ విడుదల చేయవచ్చని అంటున్నారు. ఈ వ్యూహం పాకిస్థాన్‌లో ఆహార భద్రతను అస్థిరపరుస్తుంది. గతంలో భారత్ ఉరి, పుల్వామా దాడుల తర్వాత కూడా నీటి విషయంలో గట్టి వైఖరి తీసుకుంది, కానీ ట్రీటీలోని పరిమితుల వల్ల చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ట్రీటీ సస్పెన్షన్ భారత్‌కు మరింత స్వేచ్ఛను ఇచ్చింది. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు భారత్ చర్యలతో తీవ్ర కరవును ఎదుర్కోనుంది.

ఈ సస్పెన్షన్ భారత్-పాకిస్తాన్ సంబంధాలను దీర్ఘకాలంలో మార్చవచ్చు. పాకిస్థాన్ ఈ చర్యను యుద్ధ చర్యగా భావిస్తూ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం కోరవచ్చు. భారత్‌లో ఈ నిర్ణయానికి మద్దతు పెరుగుతోంది, పాకిస్థాన్ బుద్ధి రావాలంటే ఇలాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని అంటున్నారు.