
పక్కదేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం.. అభివృద్ధి పేరుతో అప్పులు ఇచ్చి దేశాలను ముంచడం.. సైనిక స్థావరాలపై నిఘా పెట్టడం పాకిస్థాన్ కు ముందునుంచి ఉన్న తప్పుడు అలవాటే. ముఖ్యంగా భారత్ అంటే కుతంత్రాల డ్రాగెన్ కు ముందు నుంచి అసూయే. నేరుగా ఎదుర్కోలేక పాకిస్థాన్ మద్దతుతో భారత్ పై కుట్రలు పన్నుతుంటుంది. భారత్ ఎప్పుడు.. ఎక్కడ ఏం పని చేస్తుంది..? ఏం ప్లాన్ చేస్తుందా అని ..? ఓ కన్నేసి ఉంచుతుంది చైనా. తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత చైనాకు చెందిన గూఢచారి నౌక మళ్లీ భారత్ పై కన్నేసింది. ఇంతకీ ఇది ఏం చేస్తుంది..? గతంలో భారత్ పై కన్నేసిన గూఢచారి నౌకలు ఏం చేశాయి..? ఇలాంటి విషయాల్లో భారత్ ఎలా స్పందిస్తుంది..?
భారత్ పై నిఘా పెట్టడం చైనాకు కొత్తే కాదు.. ఎన్నో ఏళ్లుగా రకరకాలుగా భారత్ చేసే ప్రతీ పనిని చైనా గమనిస్తూనే ఉంది. తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా నిఘా మరింత పెరిగింది. ముఖ్యంగా పాకిస్థాన్ సమాచారం అందించేందుకు డ్రాగెన్ తన నిఘా నౌకలను రంగంలోకి దింపింది. ఇవి నిరంతరం భారత్ పై కన్నేసి ఉంచుతున్నాయి. పాకిస్థాన్ కు సరైన సాంకేతిక నిఘా వ్యవస్థ లేకపోవడంతో .. చైనా ఆ పనిచేస్తోంది. ఆపరేషన్ సిందూరు తర్వాత భారత జలాల్లో చైనాకు చెందిన గూఢచారి నౌక కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది. భారత జలాలకు సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. భారత సముద్ర జలాల్లోని భారత నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యాన్ని, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా పసిగట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు మన నౌకాదళం అత్యంత అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించింది. చైనా గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్‌ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. పాక్‌కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పాకిస్థాన్‌లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే, వాటిని ముందుగానే పసిగట్టి, సదరు సమాచారాన్ని పాకిస్థాన్‌కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు.
చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ కింద చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సీపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్‌లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండటం డ్రాగన్‌కు అత్యంత కీలకం. అది కూడా నిఘా వెనక కారణం కావొచ్చు. చైనా నౌక భారత నౌకాదళ విభాగాల మధ్య కమ్యూనికేషన్‌ను అడ్డంకులు సృష్టించగలదు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో కీలకమైన జలాంతర్గాముల రాకపోకలను ఇది మ్యాప్ చేయగలదు. అలాగే ఇక్కడ సేకరించిన సమాచారాన్ని పాక్‌లో నిర్మించాలనుకుంటున్న మిలిటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే హిందూ మహాసముద్రంలో ఇలా చైనా నౌకల కదలికలు ఉండటం ఇదే తొలిసారి కాదు. 2022, 2024లో యువాన్ వాంగ్ వంటి నౌకలను చైనా మోహరించింది.
2022లో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టులో డాక్ చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. భద్రతా కారణాల రీత్యా ఈ నౌకను అనుమతించవద్దని భారత్.. శ్రీలంకను కోరింది. దీంతో మొదట్లో శ్రీలంక కూడా చైనా నౌక తమ జలాల్లోకి రావడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, భారత్‌కు ప్రమాదం ఉందన్న వాదనలో నిజం లేదని చైనా ప్రభుత్వం వాదించింది. అలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పింది. దీంతో చివరి నిమిషంలో చైనా నౌకకు శ్రీలంక అనుమతించింది. ఇలాంటి నిఘా నౌకలను భారత్ అడ్డుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన దేశంలో ఎలాంటి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినా ఆ విషయాన్ని చైనా నౌక పసిగడుతుంది. అందువల్ల మన మిస్సైల్స్ గురించిన సాంకేతికత ఆ దేశానికి తెలిసే వీలుంది. ఈ నౌకలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. దీనివల్ల మన మిస్సైల్స్ రేంజ్ ఏంటో ఈ నౌక కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ నౌకకు సముద్ర భూభాగంలో సర్వే చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది. అందువల్ల సముద్రంలో భారత్ ఏవైనా సబ్‌మెరైన్లు వాడితే, వాటి గురించి తెలిసే అవకాశం ఉంది. చైనా యువాన్ వాంగ్ 5, యువాన్ వాంగ్ 6, శియాంగ్ యాంగ్ హాంగ్ వంటి నిఘా ఓడలను ఉపయోగిస్తోంది. ఈ ఓడలు శాటిలైట్ ట్రాకింగ్, క్షిపణి పరీక్షల టెలిమెట్రీ డేటా సేకరణ, సముద్ర గర్భంలో భౌగోళిక నిర్మాణాల మ్యాపింగ్ వంటి పనులు చేస్తాయి.
ఇటు భారత్ కూడా నిఘా నౌకల విషయంలో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా, INS ధ్రువ్ అనే అత్యాధునిక నిఘా నౌక భారత నౌకాదళానికి కీలకంగా ఉంది. 2018లో విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించబడిన ఈ నౌక 175 మీటర్ల పొడవు, 17,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది X-బ్యాండ్ మరియు S-బ్యాండ్ రాడార్లతో సహా అత్యాధునిక యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే రాడార్ వ్యవస్థలను కలిగి ఉంది. ఇవి ఖచ్చితమైన స్కానింగ్, విస్తృత పరిధి నిఘా కోసం ఉపయోగపడతాయి. INS ధ్రువ్ క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడం, సముద్ర నిఘా, బాలిస్టిక్ క్షిపణి దాడుల గురించి ముందస్తు హెచ్చరికలను అందించచే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే భారత నౌకాదళం P-8I పోసిడాన్ విమానాలు, డోర్నియర్-220 నిఘా విమానాలు, హెరాన్, సెర్చర్ వంటి డ్రోన్లను సముద్ర నిఘా కోసం ఉపయోగిస్తోంది. ఇవి రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి. దీని వల్ల భారత సముద్ర ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నౌకల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. INS ధ్రువ్, చైనా యువాన్ వాంగ్, శియాంగ్ యాంగ్ హాంగ్ శ్రేణి నిఘా నౌకలను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. 2022లో యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబంతోట వద్ద డాక్ చేసినప్పుడు, భారత నౌకాదళం P-8I విమానాలు, INS ధ్రువ్, ఇతర యుద్ధనౌకలతో దాని కదలికలను భారత్ నిశితంగా పర్యవేక్షించింది. ఈ చైనీస్ నౌకలు భారత్ క్షిపణి పరీక్షలు, అణు సబ్‌మెరీన్‌ల సంకేతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తే.. ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజర్స్ ద్వారా, రాడార్ జామింగ్, తప్పుడు సంకేతాలను ఉపయోగించి భారత్ వీటిని నిరోధిస్తుంది. 2024లో శియాంగ్ యాంగ్ హాంగ్ 01 బే ఆఫ్ బెంగాల్‌లో ఉన్నప్పుడు, భారత్ అగ్ని-5 క్షిపణి పరీక్ష షెడ్యూల్‌ను రద్దు చేసి, చైనా డేటా సేకరించకుండా నిరోధించింది. అంతేకాకుండా, భారత తీర రక్షక దళం అండమాన్ నికోబార్ దీవుల వద్ద నిరంతర గస్తీలు, డోర్నియర్ విమానాలు, హెలికాప్టర్లతో నిఘా కొనసాగిస్తోంది. ఇవి చైనా నౌకల కదలికలను గుర్తించడంలో సహాయపడతాయి.
భారత్‌లో INS ధ్రువ్‌తో సహా 14 నిఘా నౌకలు ఉన్నాయని అంచనా. కానీ చైనాతో పోలిస్తే ఇది 1:4 నిష్పత్తిలో ఉంది. ఎందుకంటే చైనా 64 నిఘా నౌకలను కలిగి ఉంది. భారత్‌లో నిఘా నౌకల సంఖ్య తక్కువగా ఉండటం, బడ్జెట్ పరిమితులు, నిర్మాణంలో ఆలస్యం వంటి సమస్యలు వీటిని సంఖ్యా సామర్థ్యాన్ని పరిమితం చేస్తున్నాయి. భారత్ 2035 నాటికి 175 నౌకల ఫ్లీట్‌ను కలిగి ఉండాలనే లక్ష్యంతో మారిటైమ్ కెపాబిలిటీ పెర్స్పెక్టివ్ ప్లాన్ కింద మరిన్ని నిఘా నౌకలను నిర్మిస్తోంది. కానీ ఆర్థిక సమస్యలు వల్ల ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, అండమాన్ నికోబార్ దీవుల వద్ద నౌకాదళ స్థావరాలను బలోపేతం చేయడం, P-8I విమానాలను ఉపయోగించడం ద్వారా భారత్ చైనా నిఘా నౌకలను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.