త్వరలో ఢిల్లీ-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ కారిడార్..!

Indian Bullet Train Corridor: భారత ప్రజలకు బుల్లెట్ ట్రైన్ ఒక కల. ఆ కల త్వరలో నెరవేరబోతోంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మరో మూడు నాలుగు ఏళ్లలో అందుబాటులోకి రానుంది. దీనికి తోడు ఇప్పుడు ఏడారిలో కూడా బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. అదేంటి ఏడారిలో బుల్లెట్ ట్రైన్ పెట్టడమేంటి…? అసలు భారత్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కేంద్రం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి..? ముంబై నుంచి ఢిల్లీకి 4 గంటల్లో వెళ్లిపోవచ్చా..? రెండు గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ రావొచ్చా..?

కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఎప్పుడు ఉన్నా రవాణా వ్యవస్థపై ప్రత్యేక శద్ధ పెడుతుంది. అప్పట్లో వాజ్ పేయి సమయంలోనైనా ఇప్పుడు మోదీ పాలనలోనైనా రవాణా అనేది ఎన్డీఏ సర్కార్ మొదటి ప్రెయార్టీ.. దీనికి ఉదాహరణే వందే భారత్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు. రవాణా వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ భావిస్తారు. అందుకే వందేభారత్ రైళ్లతో పాటు బుల్లెట్ ట్రైన్ ను త్వరలో పట్టాలెక్కించేందుకు పట్టుదలగా ఉన్నారు. దీనిలో భాగంగాను ఢిల్లీ-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ కారిడార్ మరో రెండు మూడేళ్లలో అందుబాటులోకి రానుంది. తర్వాత దీనిని ఢిల్లీ వరకు పొడిగించనున్నారు. అలాగే దేశంలోని పలు ముఖ్య నగరాలను కలుపుతూ బుల్లెట్ రైళ్లు నడిపే ప్రతిపాదనలు ఉన్నాయి. 2047 నాటికి భారత్ లో ప్రధాన నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు పరిగెట్టే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ముంబై -అహ్మదాబాద్ పనులు వేగంగా సాగుతుండగా.. దీనితో పాటు ఏడారి రాష్ట్రం రాజస్థాన్‌లో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. Indian Bullet Train Corridor.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం.. ఢిల్లీ వరకు పొడిస్తే.. ఇది రాజస్థాన్ నుంచే వెళ్లనుంది. ఈ 878 కిలోమీటర్ల హై-స్పీడ్ రైలు మార్గంలో 75 శాతం, అంటే 657 కిలోమీటర్లు, రాజస్థాన్‌లోని ఏడు జిల్లాల గుండా వెళ్తుంది. ఈ మార్గంలో మొత్తం 11 స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో తొమ్మిది రాజస్థాన్‌లో ఉంటాయి. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, ఢిల్లీ నుంచి ముంబై కేవలం 4 గంటల్లో చేరుకుంటుంది. ఈ రైలు మార్గం ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21 నుంచి మొదలై, హరియాణాలోని మానేసర్, రేవారీ గుండా రాజస్థాన్‌లో అల్వార్ వద్ద ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి నేషనల్ హైవే 48కు సమాంతరంగా జైపూర్, అజ్మేర్, భీల్వారా, చిత్తోర్‌గఢ్, ఉదయపూర్, డుంగర్‌పూర్ గుండా అహ్మదాబాద్‌కు చేరుతుంది. ఉదయపూర్ జిల్లాలో 127 కిలోమీటర్ల ట్రాక్, ఐదు నదులపై వంతెనలు, ఎనిమిది టన్నెల్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్‌లోని 335 గ్రామాలను కవర్ చేస్తుంది. నేషనల్ హై-స్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. 2025 ఫిబ్రవరిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కారిడార్ DPR సిద్ధమైందని పార్లమెంట్‌లో తెలిపారు. అయితే ఇది ఇంకా పబ్లిక్‌లో విడుదల కాలేదు. ముంబై-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ కారిడార్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. 300 కిలోమీటర్ల ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అటు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ రైల్వే డివిజన్‌లో 60 కిలోమీటర్ల హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ రూ. 820 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బులెట్ ట్రైన్ ను టెస్ట్ చేయనున్నారు. ఈ టెస్ట్ ట్రాక్ 2025 సెప్టెంబర్ నాటికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు.

ఢిల్లీ-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ జపాన్ కు చెందిన షింకన్‌సెన్ E5 సిరీస్ సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు, ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు అవుతుంది. ఈ రైలు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడుస్తుంది. భద్రత, స్థిరత్వం కోసం పిల్లర్లపై నిర్మిస్తారు. ఉదయపూర్ జిల్లాలో 8 టన్నెల్స్, ఐదు నదులపై వంతెనలు ఉంటాయి. ఈ రైలు ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంటే డ్రైవర్ ప్రమేయం లేకుండా రైలును నియంత్రించగలదు. అలాగే ఈ బులెట్ ట్రైన్‌లో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు, CCTV కెమెరాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వై-ఫై, సౌండ్‌ప్రూఫ్ కంపార్ట్‌మెంట్లు, రిక్లైనింగ్ సీట్లు వీటి ప్రత్యేకత. ఒక్కో రైలులో 10-12 కోచ్‌లు ఉంటాయి, సుమారు 750-1000 మంది ప్రయాణించ వచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ రూ. 50,000 కోట్ల రుణం అందిస్తోంది.

ఢిల్లీ-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ రాజస్థాన్‌కు భారీ లాభాలను తీసుకొస్తుంది. ఈ 657 కిలోమీటర్ల ట్రాక్ రాజస్థాన్‌లోని 335 గ్రామాలను, ఏడు జిల్లాలను కలుపుతుంది, దీనివల్ల ఈ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి జరుగుతుంది. జైపూర్, ఉదయపూర్, అజ్మేర్ వంటి పర్యాటక కేంద్రాలు ఢిల్లీ, అహ్మదాబాద్‌లతో వేగవంతంగా అనుసంధానం కావడంతో టూరిజం రంగం బలపడుతుంది. ఉదయపూర్‌కు ఢిల్లీ నుంచి ప్రయాణ సమయం 12 గంటల నుంచి 4-5 గంటలకు తగ్గుతుంది, దీనివల్ల టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. స్టేషన్ల సమీపంలో వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రిటైల్ షాపులు అభివృద్ధి చెందుతాయి. భీల్వారా, చిత్తోర్‌గఢ్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు అహ్మదాబాద్‌తో సులభంగా అనుసంధానం కావడంతో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 50,000 పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని NHSRCL అంచనా వేసింది, ఇందులో స్థానిక కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఈ ప్రాజెక్ట్ సవాళ్లు లేకపోలేదు. భూసేకరణ కోసం 335 గ్రామాల్లో రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఉదయపూర్, డుంగర్‌పూర్‌లో రైతులు తమ భూములను కోల్పోవడం వల్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. NHSRCL పరిహారం, పునరావాస చర్యల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

ఢిల్లీ-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భూసేకరణ దీనికి అతిపెద్ద సవాలు. రాజస్థాన్‌లోని 335 గ్రామాల్లో సుమారు 1,400 హెక్టార్ల భూమిని సేకరించాలి, ఇందులో వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. మరో సవాలు ఈ ప్రాజెక్ట్ ఖర్చు. ఢిల్లీ-అహ్మదాబాద్ కారిడార్ ఖర్చు సుమారు రూ. 1.2 లక్షల కోట్లుగా అంచనా వేశారు, ఇందులో జపాన్ నుంచి రూ. 50,000 కోట్ల రుణం ఉంది. ఈ భారీ ఖర్చు, రుణ భారం వల్ల టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చని విమర్శలు ఉన్నాయి. ఈ రైలు టికెట్ ధరలు 3 వేల నుంచి 5 వేల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది విమాన టికెట్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నా.. సామాన్య ప్రయాణికులకు ఖరీదైనది. అయితే అభివ‌ృద్ధిని దృష్టిలో పెట్టుకుని దీనిని నిర్మిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ 2026లో ప్రారంభమైతే, ఢిల్లీ-అహ్మదాబాద్ కారిడార్ 2028-30 నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పారు. దీనితో పాటు ముంబై- హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కూడా కేంద్ర ఆలోచిస్తోంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ రాబోయే 30 ఏళ్లలో బుల్లెట్ ట్రైన్స్ నడపాలనే యోచనలో ఉంది కేంద్రం.

Also Read: https://www.mega9tv.com/national/many-people-believe-that-justice-has-not-yet-been-fully-served-for-the-victims-of-this-bhopal-gas-tragedy/