
India’s focus on indigenous weapons: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసిన యుద్ధాలే. ఒక దేశం బలంగా ఉండాలంటే ఆయుధాలు ఎంత ముఖ్యమే.. ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత అర్థమైంది. దీంతో భారత్ స్వదేశీ ఆయుధాల తయారీపై ఫోకస్ పెంచింది. భారత్ ఒకప్పుడు ఆయుధాల కోసం రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లాంటి దేశాలపై ఆధారపడేది. కానీ ఇప్పుడు స్వదేశీ ఆయుధ తయారీలో దూసుకుపోతోంది. కాన్పూర్‌లో రైఫిళ్ల నుంచి బెంగళూరులో ఫైటర్ జెట్ల వరకూ, భారత్ తన సైనిక శక్తిని స్వయంగా నిర్మించుకుంటోంది. అసలు భారత్ లో ఎక్కడెక్కడ ఏం ఏం తయారవుతున్నాయి? మేకిన్ ఇండియా ఎలాంటి ఫలితాలు ఇస్తోంది..?
భారత్ ఒకప్పుడు తన సైనిక ఆయుధాల్లో 60-70% విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. రష్యా నుంచి మిగ్ ఫైటర్ జెట్లు, ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు, అమెరికా నుంచి హెలికాప్టర్లు కొనేవాళ్లం. కానీ, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో అంతా మారిపోయింది. ఈ కార్యక్రమాల లక్ష్యం.. స్వదేశంలోనే ఆయుధాలు తయారు చేయడం, విదేశీ దిగుమతులను తగ్గించడం, ఉద్యోగాలు సృష్టించడం. ఇప్పుడు భారత్ తన సైన్యం, పోలీసులు, భద్రతా బలగాల కోసం ఆయుధాలు తయారు చేయడమే కాదు, వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. డీఆర్‌డీఓ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బీఈఎల్ వంటి సంస్థలు, అలాగే అదానీ, టాటా, ఎల్‌అండ్‌టీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఆయుధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలు కలిసి రైఫిళ్ల నుంచి ఫైటర్ జెట్ల వరకూ అన్నీ తయారు చేస్తున్నాయి. ఈ పరిణామం వల్ల భారత సైన్యం బలోపేతమవడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, 2016-20 మధ్య భారత్ ఆయుధ దిగుమతులు 33% తగ్గాయి. ఇది స్వదేశీ ఆయుధ తయారీలో భారత్ ఎంత ముందడుగు వేసిందో చూపిస్తుంది. India’s focus on indigenous weapons.
భారత్‌లో స్వదేశీ ఆయుధ తయారీ గురించి మాట్లాడుకుంటే, మొదట చిన్న ఆయుధాల గురించి చెప్పుకోవాలి. కాన్పూర్, ఛండీగఢ్‌లోని ఆర్డనెన్స్ ఫ్యాక్టరీలు ఇప్పుడు రైఫిళ్లు, కార్బైన్స్ వంటి చిన్న ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలు INSAS రైఫల్, AK-203 రైఫల్, కార్బైన్స్‌ను తయారు చేస్తున్నాయి. INSAS రైఫల్ అంటే భారత సైన్యం 1990ల నుంచి ఉపయోగిస్తున్న స్వదేశీ తుపాకి. AK-203 అంటే రష్యాతో కలిసి భారత్ తయారు చేస్తున్న ఆధునిక రైఫల్, ఇది చాలా ఖచ్చితమైనది, తేలిగ్గా ఉంటుంది. ఈ ఆయుధాలను భారత సైన్యం, పోలీసులు, CRPF వంటి భద్రతా బల్గాలు ఉపయోగిస్తాయి. అంతే కాదు, ఈ రైఫిళ్లను ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. 2024లో బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ స్నైపర్ రైఫిళ్లను విదేశాలకు ఎగుమతి చేసే కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇలా చిన్న ఆయుధాల తయారీలో భారత్ బలమైన స్థానంలో నిలిచింది.
బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్వదేశీ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. HAL తయారు చేస్తున్న తేజస్- స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది ఆధునిక రాడార్, మిస్సైళ్లు, లేజర్ గైడెడ్ బాంబులు వంటి సాంకేతికతలతో రూపొందింది. తేజస్ ఇప్పటికే భారత వైమానిక దళంలో చేరింది, దీని వేగం, ఖచ్చితత్వం వల్ల సైన్యానికి గొప్ప ఆస్తి. ఇప్పుడు బెంగళూరులో అమ్కా ప్రాజెక్ట్ కూడా రూపుదిద్దుకుంటోంది. అంటే అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది ఐదవ తరం ఫైటర్ జెట్. అమ్కాలో స్టెల్త్ ఫీచర్ ఉంటుంది, అంటే శత్రువు రాడార్‌కు ఇది సులభంగా కనిపించదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2025 జూన్‌లో ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. ఎనిమిదేళ్లలో ఈ విమానాన్ని తయారు చేయడానికి భారత కంపెనీలను ఆహ్వానించారు. ఈ విమానం రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతమవుతుంది.
బెంగళూరు ఒక్కటే కాదు, హైదరాబాద్, జబల్పూర్, కొచ్చి, పూణే, నాగపూర్‌లు కూడా ఆయుధ తయారీలో ముందున్నాయి. హైదరాబాద్‌లో డీఆర్‌డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అకాశ్ మిస్సైల్ వంటి ఆయుధాలను తయారు చేస్తున్నాయి. అకాశ్ మిస్సైల్ శత్రువు విమానాలను, డ్రోన్లను ఆకాశంలోనే కూల్చే రక్షణ వ్యవస్థ. ఇది 2025 మేలో ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ డ్రోన్లను, మిస్సైళ్లను కూల్చడంలో సత్తా చాటింది. జబల్పూర్‌లో ఆర్డనెన్స్ ఫ్యాక్టరీలు ధనుష్ హోవిట్జర్ తయారు చేస్తున్నాయి. హోవిట్జర్ అంటే దూరంగా ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసే భారీ ఫిరంగి. ధనుష్ అంటే స్వీడన్ బోఫోర్స్ గన్ ఆధారంగా భారత్ తయారు చేసిన స్వదేశీ ఫిరంగి, దీని రేంజ్ 40 కిలోమీటర్లు. కొచ్చిలో మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ జలాంతర్గాములు, యుద్ధనౌకలు తయారు చేస్తోంది. ఈ సబ్‌మెరీన్స్ సముద్రంలో శత్రువు నౌకలను, విమానాలను గుర్తిచి, ధ్వంసం చేయగలవు. ఈ నగరాలు భారత సైన్యానికి ఆయుధాల సరఫరా చేయడమే కాదు, దేశంలో టెక్నాలజీ, ఉద్యోగాల వృద్ధికి కీలకంగా ఉన్నాయి.
2025 మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో స్వదేశీ ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి. ఈ ఆపరేషన్‌లో అకాశ్ మిస్సైల్ సిస్టమ్ పాకిస్తాన్ డ్రోన్లను, మిస్సైళ్లను కూల్చింది. D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించి, నాశనం చేసింది. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం తేజస్ విమానాలు, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన రాడార్ సిస్టమ్స్ ఉపయోగించింది. ఈ ఆపరేషన్ భారత స్వదేశీ ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ప్రధాని మోదీ ఈ సందర్భంలో స్వదేశీ ఆయుధాలే మన సైన్య బలం అని ప్రశంసించారు. ఈ ఆపరేషన్ వల్ల భారత సైనిక సామర్థ్యం మీద ప్రపంచ దేశాలకు నమ్మకం పెరగడమే కాదు, కంపెనీల షేర్లు పెరిగాయి.