
Karnataka Crowd Management Bill 2025: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన భారీ తొక్కిసలాట ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 56 మంది గాయపడ్డారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా కర్ణాటక ప్రభుత్వం ఓ కొత్త చట్టం తీసుకురానుంది. దీంతో ఎలాంటి పబ్లిక్ మీటింగ్ పెట్టాలన్న కొన్ని రూల్స్ ఫాలో కావాల్సిందే. అయితే కొన్ని రూల్స్ ఇబ్బంది కరంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇంతకీ కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఏంటి..? ఇక నుంచి ఈవెంట్లు, పెళ్లి ఫంక్షన్లు జరపాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరా..? అనుమతులు పాటించకపోతే మూడు సంవత్సరాలు జైలు తప్పదా..?
భారీ సమావేశాలు, పెద్ద పెద్ద సినీ ఈవెంట్లు, పెద్ద స్థాయిలో వివాహాలు జరిగినప్పుడు తొక్కిసలాట ఘటనలు, ప్రమాదాలు నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం కొత్త చట్టం తీసుకురానుంది. క్రౌడ్ కంట్రోల్, మేనేజింగ్ క్రౌడ్ యాట్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్ ఆఫ్ మాస్ గ్యాదరింగ్ బిల్ సంక్షిప్తంగా క్రౌడ్ మేనేజ్‌మెంట్ బిల్. ఈ బిల్ కర్ణాటక కేబినెట్ ఆమోదం తర్వాత చట్టసభలకు రానుంది. స్పోర్ట్స్ ఈవెంట్లు, రాజకీయ ర్యాలీలు, వివాహాలు, జాతరలు, సమావేశాలు, సినిమా ఈవెంట్లు వంటి పెద్ద కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించడం ఈ బిల్ ప్రధాన లక్ష్యం. ఈ బిల్ ప్రకారం, ఈవెంట్ ఆర్గనైజర్లు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి, మీటింగ్ సామర్థ్యాన్ని ముందుగా నిర్ణయించాలి, భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఈ బిల్ ఉల్లంఘిస్తే, ఈవెంట్ ప్లానర్లకు గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఒకవేళ ఈవెంట్‌లో తొక్కిసలాట, గాయాలవ్వడం, ఎవరైనా చనిపోవడం జరిగితే, ఆర్గనైజర్లు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. ఈ బిల్ ఉల్లంఘనలను నాన్-కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలుగా వర్గీకరించింది, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ బిల్ రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక ఈవెంట్లన్నింటికీ వర్తిస్తుంది, ఆర్గనైజర్ల బాధ్యతను స్పష్టంగా నిర్దేశిస్తుంది.
ఈ బిల్ ఎందుకు తీసుకొచ్చారు?
జూన్ 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన దుర్ఘటన ఈ బిల్ పుట్టుకు ప్రధాన కారణం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి IPL టైటిల్ గెలవడంతో, విజయోత్సవ ఊరేగింపు సందర్భంగా లక్షలాది అభిమానులు స్టేడియం వద్ద గుమిగూడారు. ఈ సమయంలో నిర్వహణ లోపాలు, అనుమతి కంటే ఎక్కువ మంది రావడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి, 11 మంది మరణించారు, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్‌ను తీసుకొచ్చింది. కానీ, ఈ బిల్ ఆలోచన కొత్తది కాదు. గతంలో 2018లో బెంగళూరు సంక్రాంతి జాతరలో, 2022లో మంగళూరు కబడ్డీ మ్యాచ్‌లో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఈ ఘటనలు కార్యక్రమాల నిర్వహణలో లోపాలను బయటపెట్టాయి. చిన్నస్వామి దుర్ఘటన తర్వాత, ప్రతిపక్ష బీజేపీ నాయకుడు ఆర్. అశోక, విశేష అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ హెచ్.కె. పాటిల్, ఈ బిల్ డ్రాఫ్ట్‌ను రెడీ చేసి క్యాబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ బిల్ ద్వారా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు నివారించడం, ఈవెంట్ ఆర్గనైజర్ల బాధ్యతను పెంచడం లక్ష్యంగా ఉంది.
ఈ బిల్ చాలా కీలక నిబంధనలను కలిగి ఉంది. ఈవెంట్ నిర్వాహకులు తమ ఈవెంట్ గురించి ముందస్తు అనుమతి తీసుకోవాలి, స్థల సామర్థ్యాన్ని స్పష్టంగా నిర్దేశించాలి. స్టేడియంలో 10,000 మంది పట్టే సామర్థ్యం ఉంటే, అంతకు మించి అనుమతించకూడదు. భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి. సీసీటీవీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ, మెడికల్ టీమ్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఉండాలి. ఈవెంట్‌లో ఏదైనా దుర్ఘటన జరిగితే, ఆర్గనైజర్లు బాధితులకు పరిహారం చెల్లించాలి, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. ఈ బిల్ ప్రభావం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, క్రీడా సంఘాలు, రాజకీయ పార్టీలు, సినిమా నిర్మాణ సంస్థలపై ఎక్కువగా ఉంటుంది. IPL మ్యాచ్‌లు, రాజకీయ ర్యాలీలు, సినిమా ప్రీమియర్‌లు, పెళ్లిళ్లు వంటి ఈవెంట్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ బిల్ వల్ల ఈవెంట్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే భద్రతా ఏర్పాట్లు, అనుమతుల కోసం అదనపు ఖర్చు చేయాలి. అయితే, ఈ బిల్ ప్రజల భద్రతను పెంచుతుందని, మీటింగ్ల నిర్వహణలో క్రమశిక్షణ తీసుకొస్తుందని ప్రభుత్వం చెబుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ బిల్ గురించి చర్చలు జరుగుతున్నాయి, కొందరు దీన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు ఈవెంట్ నిర్వహణ కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Karnataka Crowd Management Bill 2025
ఈ బిల్ రాజకీయంగా, సామాజికంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష బీజేపీ ఈ బిల్‌ను స్వాగతించినప్పటికీ, చిన్నస్వామి దుర్ఘటనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. బీజేపీ నాయకుడు ఆర్. అశోక, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదు అని అన్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం, ఈ బిల్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారిస్తుందని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఈ బిల్ ద్వారా సభల నిర్వహణలో కొత్త ప్రమాణాలు ఏర్పడతాయి అని పేర్కొన్నారు. అయితే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఈ బిల్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనల వల్ల చిన్న ఈవెంట్ నిర్వాహకులకు ఆర్థిక భారం పెరుగుతుంది అని బెంగళూరు ఈవెంట్ ఆర్గనైజర్స్ అసోసియేషన్ అంటోంది. ఈ బిల్‌పై మరింత చర్చ అవసరమని, మంత్రులు మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుంటారని హెచ్.కె. పాటిల్ చెప్పారు. ఈ బిల్ చట్టంగా మారితే, దేశంలో సభల నిర్వహణకు కొత్త ప్రమాణాలు ఏర్పడే అవకాశం ఉంది.