ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదం ఎలా జరిగింది..?

నిత్యం రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్స్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాయి. ముంబైలోని ముంబ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఒక దారుణ రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ షాక్‌కు గురిచేసింది. కాసరా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తున్న ఒక లోకల్ రైలు నుంచి 13 మంది ప్రయాణికులు రైలు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తూ జారిపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? రైల్వే అధికారులు, మహారాష్ట్ర సీఎం ఈ ఘటనపై ఎలా స్పందించారు? ప్రయాణికులు ఏమంటున్నారు?

అది ముంబైలోని ముంబ్రా రైల్వే స్టేషన్. జూన్ 9, 2025. సమయం ఉదయం 9:30 గంటలు అవుతోంది. అందులోనె పెద్ద పెద్ద అహాకారాలు. రక్తశిక్తమైన శరీరాలతో ప్రయాణికులు చెల్లచెదురుగా పడి ఉన్నారు. కాసరా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తున్న ఒక లోకల్ రైలు, దివా-ముంబ్రా స్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్ లైన్‌పై ప్రయాణిస్తోంది. అదే సమయంలో, ఎదురుగా మరో లోకల్ రైలు వచ్చింది. ఈ రెండు రైళ్లు ఒకదానికొకటి దగ్గరగా వెళ్తున్నప్పుడు, రెండు రైళ్ల ఫుట్‌బోర్డ్‌లపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఢీకొనడం వల్ల, కాసరా-బౌండ్ రైలు నుంచి 13 మంది ప్రయాణికులు జారిపడి ట్రాక్‌లపై పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఏడుగురు గాయపడ్డారు, వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రైళ్లలో అతిగా రద్దీ, ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడమే కారమంటున్నారు. ముంబై లోకల్ రైళ్లు ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో అత్యంత రద్దీగా ఉంటాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఫుట్‌బోర్డ్‌పై లేదా తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తారు. ఈ ఘటనలో కూడా, రైలు అతిగా రద్దీగా ఉండటం వల్ల, ప్రయాణికులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, రెండు రైళ్లు ఒకదానికొకటి దగ్గరగా వెళ్లినప్పుడు ఈ ఢీకొనడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఫుట్‌బోర్డ్ ట్రావెల్‌ను నిషేధించాలని, ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే, ముంబై రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ ఈ రూట్‌లో తగినంత లోకల్ రైళ్లు లేకపోవడం, డివిజనల్ రైల్వే మేనేజర్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రద్దీ పెరిగిందని ఆరోపిస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే, రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రి, కల్వాకు తరలించారు. ప్రత్యేక్ష సాక్షి కథనం ప్రకారం.. రెండు రైళ్లు అతి వేగంగా వెళ్తుండగా, ట్రాక్‌లపై ఏడు-ఎనిమిది మంది రక్తస్రావంతో పడి ఉన్నారని, సహాయం కోసం అరుస్తున్నారని తెలిపాడు. రైల్వే అధికారులు అంబులెన్స్‌లను త్వరగా ఏర్పాటు చేసి, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడంలో సమర్థవంతంగా వ్యవహరించారని అన్నారు.

అయితే ముంబై లోకల్ రైళ్లలో ఫుట్ బోర్డు ప్రయాణం సర్వ సాధారణం. అక్కడ ప్రమాదాలు సర్వసాధరణం. అందుకే ఫుట్‌బోర్డ్ ట్రావెల్ అత్యంత ప్రమాదకరమని, ప్రయాణికులు దీనిని నివారించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. ఈ ప్రమాదం రద్దీ, ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం వల్లే జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు రైల్వే బోర్డ్ ముంబై సబ్‌అర్బన్ రైళ్లలో ఆటోమాటిక్ డోర్ క్లోజర్ సౌకర్యాన్ని తీసుకొస్తోందని ప్రకటించారు. అన్ని కొత్త రైళ్లలో ఈ సౌకర్యం ఉంటుంది, ఇప్పటికే ఉన్న రైళ్లను కూడా రీడిజైన్ చేసి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనను దర్యాప్తు చేసేందుకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విచారణను ప్రారంభించింది.
అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించారు. గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించినవారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు, గాయపడినవారికి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.

ప్రయాణికులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ ఈ రూట్‌లో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, రైల్వే శాఖ దివా-కల్వా రూట్‌లో లోకల్ రైళ్ల సంఖ్యను పెంచకపోవడం, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రద్దీ పెరిగి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్, ప్రభుత్వం రైల్వే భద్రతపై హామీలు ఇచ్చినప్పటికీ, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. రైళ్లలో రద్దీ తగ్గించేందుకు మరిన్ని రైళ్లను నడపాలని, భద్రతా చర్యలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.

ముంబై లోకల్ ట్రైన్లు అక్కడి సిటీ ట్రాన్స్ పోర్టుకు కీలక మైనవి. కానీ అత్యధిక రద్దీ, ఫుట్‌బోర్డ్ ప్రయాణాల వల్ల ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ప్రతిరోజూ 80 లక్షల మంది ప్రయాణికులు ఈ రైళ్లను ఉపయోగిస్తారు, కానీ ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో రైళ్లు సామర్థ్యానికి మించి నిండిపోతాయి, దీంతో చాలా మంది ఫుట్‌బోర్డ్‌పై లేదా తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తారు. ఈ ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే రైళ్లు వేగంగా కదులుతున్నప్పుడు లేదా వంపుల వద్ద ప్రయాణికులు అదుపుతప్పి పడిపోతారు. ఈ విధంగా ముంబ్రా సమీపంలో జరిగిన ప్రమాదంలో, రెండు రైళ్ల ఫుట్‌బోర్డ్ ప్రయాణికుల బ్యాగులు ఢీకొనడంతో జారిపడి మరణించారు. గత 20 ఏళ్లలో ముంబై లోకల్ రైళ్లలో 51,000 మంది మరణించారని రైల్వే డేటా చెబుతోంది, ఇందులో ఫుట్‌బోర్డ్ నుంచి పడటం ఒక ప్రధాన కారణం. రైల్వే శాఖ ఆటోమాటిక్ డోర్ క్లోజర్‌లు, అదనపు రైళ్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ, రద్దీ, తక్కువ సంఖ్యలో రైళ్లు, ట్రాక్‌ల వద్ద భద్రతా లోపాలు ఈ ప్రమాదాలను పెంచుతున్నాయి.