ఇప్పటికీ భోపాల్ లో దాని ప్రభావం..!

Bhopal Gas Tragedy: 40 ఏళ్ల క్రితం భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటన లక్షల మంది జీవితాలను చీకటి చేసింది. విష వాయువు వేల మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పటికీ భోపాల్ పేరు చెబితే ఆ ఘోర దుర్ఘటనే గుర్తుకు వస్తుంది. అయితే ఇనాళ్లకు ఆ ఫ్యాక్టరీలోని విష వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఫ్యాక్టరీ వ్యర్థాలను కోర్టు ఆదేశాలతో అత్యంత భద్రంగా దహనం చేశారు. అయితే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ప్రమాదం జరిగితే.. ఇప్పటికీ అంత జాగ్రత్త అవసరమా..? ఎందుకు ఈ శుద్ధి ప్రక్రియకు స్థానికులు అడ్డు చెప్పారు.? అసలు భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ40 ఏళ్ల క్రితం ఏం జరిగింది..? ఒక్క రాత్రిలో 20 వేల మంది చనిపోయారనే మాట నిజమేనా..?

సుమారు 40 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ దుర్ఘటన తాలుకు ఆనవాళ్లు ఇప్పటికీ స్థానికుల గుండెల్లో నిలిచిపోయే ఉన్నాయి. రాత్రికి రాత్రి భోపాల్ నగరం సమాధి అయిపోయింది. వేలాది మంది విష వాయువు పీల్చి చనిపోయారు. ఆ ప్రమాదం భయాలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్నాయి. దాని విష పదార్థాలు తమకు ఎక్కడ హానీ కలగచేస్తాయోనని జనం భయపడుతున్నారు. కోర్టులు చెట్టూ తిరిగారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఫ్యాక్టరీలోని వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 337 మెట్రిక్ టన్నుల విష రసాయన వ్యర్థాలను మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పిఠంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించారు. 12 లీక్-ప్రూఫ్, ఫైర్-రెసిస్టెంట్ కంటైనర్లలో ఈ వ్యర్థాలను భోపాల్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని పిఠంపూర్‌కు జాగ్రత్తగా తీసుకెళ్లారు. అక్కడ ఈ వ్యర్థాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద దహనం చేశారు. జూన్ 30 నాటికి, 337 టన్నుల వ్యర్థం పూర్తిగా దహనం చేయబడిందని మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. దహనం చేసే సమయంలో వెలువడే వాయువులను ఆన్‌లైన్‌లో మానిటర్ చేశారు. అవి సేఫ్టీ లిమిట్స్‌లోనే ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేసుకున్నారు. మిగిలిన బూడిదను అత్యంత జాగ్రత్తగా దాచిపెట్టారు. దీనిని ఈ ఏడాది చివరి నాటికి భూమికి హాని కలగకుండా పూడ్చిపెట్టనున్నారు. ఈ ప్రక్రియ ఇంత జాగ్రత్తగా చేయకపోతే అది మరింత మంది ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఉంది.

అయితే విష వ్యర్థాలను దహనం చేస్తున్నప్పుడు పిఠంపూర్‌లోని స్థానికులు కంటిలో మంటలు, దగ్గు, శ్వాస సమస్యలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2015లో 10 టన్నుల వ్యర్థాలను దహనం చేసిన సమయంలో కూడా ఇలాంటి సమస్యలే వచ్చాయి. అయితే 1200°C వద్ద నాలుగు-లేయర్ ఫిల్టరింగ్ ద్వారా సురక్షితంగా దహనం చేయడం జరిగిందని అధికారులు చెప్పారు. అయితే ఈ శుద్ధి ప్రక్రియను ఆపాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యర్థాలను శుద్ధి చేయడమే ప్రజలక మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు భోపాల్‌ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ దుర్ఘటన తాలుకు అనవాళ్లు లేకుండా ఉండటమే మేలు అనే అభిప్రాయం వ్యక్తమైంది. Bhopal Gas Tragedy.

అసలు భోపాల్‌లో ఆ రాత్రి ఏం జరిగింది...
అది 1984 డిసెంబర్ 2. రాత్రి సమయంలో భోపాల్‌ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత ప్రమాదకరమైన విష వాయువు ట్యాంక్ లీక్ అయింది. నీరు ట్యాంక్‌లోకి వెళ్లడంతో, రసాయన ప్రతిచర్య జరిగి, ఏకంగా 27 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ వాయువు వాతావరణంలో కలిసిపోయింది. మిథైల్ ఐసోసైనేట్ పీల్చితే నిమిషాల్లోనే మనిషి ప్రాణాలు పోతాయి. అలాంటి ఈ వాయువు భోపాల్ నగరంలోని జనవాసాల్లోకి వ్యాపించి, సుమారు 6 లక్షల మందిని ప్రభావితం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం, ఆ రోజు రాత్రి 3,787 మంది చనిపోయారు. కానీ అనధికారికంగా 15 వేల నుంచి 20 వేల మంది మరణించారని అంటారు. అంతఘోరమైంది ఆ దుర్ఘటన. అంత ప్రమాదకరమైంది ఆ విష వాయవు. ఆ సమయంలో లక్షలాది మంది ఊపిరితిత్తులు, కంటి సమస్యలు, జనన లోపాలతో బాధపడ్డారు. ఫ్యాక్టరీలో భద్రతా వ్యవస్థలు సరిగా లేకపోవడం, కూలింగ్ సిస్టమ్స్ పనిచేయకపోవడం, కార్మికులకు శిక్షణ లేకపోవడం, కంపెనీ ఖర్చు తగ్గించేందుకు సేఫ్టీ స్టాండర్డ్స్‌ను పాటించకపోవడం ఈ దుర్ఘటనకు కారణాలుగా చెబుతారు. 1982, 1983లో కూడా చిన్న చిన్న లీక్‌లు జరిగాయి, కానీ వాటిని కంపెనీ సీరియస్‌గా తీసుకోలేదు. అదే భారతదేశ చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తు జరగడానికి కారణమైంది. విషయం తెలిసి కంపెనీ సీఈవో రాత్రికి రాత్రే అమెరికాకు పారిపోయాడు.

యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ 1969లో భోపాల్‌లో స్థాపించబడింది. ఈ ఫ్యాక్టరీని సెవిన్ అనే పురుగుమందు తయారీ కోసం ఏర్పాటు చేశారు. ఇది వ్యవసాయ రంగంలో గ్రీన్ రివల్యూషన్ సమయంలో ఎక్కువగా ఉపయోగించే వారు. భోపాల్ సెంట్రల్ ఇండియాలో ఉండటం, రవాణా సౌకర్యాలు, తక్కువ జీతాలతో పనిచేసే కార్మికుల లభ్యత కారణంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఈ స్థలం ఎంచుకున్నారు. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ UCC దీనిని ఏర్పాటు చేసింది. UCC CEO వారెన్ ఆండర్సన్ ఫ్యాక్టరీ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఫ్యాక్టరీ స్థాపించే సమయంలో భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది, కానీ భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటం, ఖర్చు తగ్గించే ప్రయత్నాలు దుర్ఘటనకు దారితీశాయని నిపుణులు చెప్పారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. 1989లో భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, సుమారు 2000 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించింది UCC. ఈ మొత్తం బాధితుల సంఖ్య, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలను లెక్కించినప్పుడు చాలా తక్కువగా ఉందని విమర్శించారు. ఒక్కో బాధితుడికి ఆ సమయంలో సగటున 25,000 రూపాయలు మాత్రమే దక్కింది. చాలా మంది బాధితులకు, ముఖ్యంగా ఆ తర్వాత అనారోగ్యంతో మరణించిన వారికి ఎలాంటి పరిహారం అందలేదు. 2010లో, భోపాల్ కోర్టు UCILలోని ఏడుగురు మాజీ మేనేజర్‌లను దోషులుగా తేల్చి, ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా విధించింది. కానీ ఈ శిక్షలు తేలికపాటివిగా ఉన్నాయని, ఎవరూ జైలు శిక్ష అనుభవించలేదని విమర్శలొచ్చాయి. UCC CEO వారెన్ ఆండర్సన్‌పై క్రిమినల్ కేసు దాఖలైంది, కానీ అతను 1984లోనే భారతదేశం వదిలి వెళ్లిపోయాడు, ఆ తర్వాత అతడిని అరెస్టు చేయలేదు. ఈ దుర్ఘటన బాధితులకు న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదని చాలా మంది భావిస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/national/pakistan-in-deep-financial-trouble-pakistani-ships-banned-after-pahalgam-terror-attack/