
Nepal PM Oli’s controversial Comments: హిందువులందరికీ శ్రీరాముడు అంటేనే ఓ సెంటిమెంట్. ఓ నమ్మకం. అలాంటి రాముడి విషయంలోనే నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ వివాదాస్మ వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్‌లో జన్మించారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీశాయి. అసలు రాముడు నిజంగా అయోధ్యలోనే పెట్టారా..? చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయి..? ఓలి ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ? దీనిపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి..?
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి .. శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన టూరిజం సదస్సులో శ్రీరాముడు నేపాల్‌లో జన్మించారని… ఇది వాస్తవమని… ఈ విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు. ఆయన వాదన ప్రకారం, వాల్మీకి రామాయణంలో రాముడు, లక్ష్మణుడు కోశీ నదిని దాటి విశ్వామిత్ర ఆశ్రమానికి వచ్చారని ఉంటుంది. ఆ ఆశ్రమం నేపాల్‌లోని సున్సారి జిల్లాలోని చటారా ప్రాంతంలో ఉందని ఓలి చెబుతున్నారు. అంతేకాదు శివుడు, విశ్వామిత్రుడు, కౌశిక ఋషి వీరంతా నేపాల్‌కు చెందినవారే అని కూడా చెప్పారు. తాను రామాయణం రాయలేదు. వాల్మీకి రాశారు. అందులోనే ఉంది అని కేపీ ఓలి వ్యాఖ్యానించారు. ఓలి ఇలా మాట్లాడటం మొదటిసారి కాదు 2020లోనూ ఇదే వాదన చేశారు. అప్పట్లో అయోధ్య నేపాల్‌లోని థోరి ప్రాంతంలో ఉందని, అక్కడే రాముడి జన్మస్థలం అని చెప్పారు. అక్కడ రామ మందిర నిర్మాణానికి ఆదేశాలు కూడా ఇచ్చారు. వాల్మికీ ఆశ్రమం, రిడిలో దశరథుడు పుత్రకామేశ్టి యాగం చేసిన స్థలం ఇవన్నీ నేపాల్‌లోనే ఉన్నాయని ఆయన వాదించారు. జనకాపురి, అయోధ్య కూడా నేపాల్ లోని ఉందని చెప్పారు. అయితే ఇది వేదకాల చరిత్రను మార్చడమేనని విమర్శలు వచ్చాయి.
ఓలి చేసిన వ్యాఖ్యలపై భారతదేశంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. అయోధ్యను శ్రీరామ జన్మస్థలంగా భావించే కోట్లాది హిందువులకు ఇది మతపరమైన, భావోద్వేగపూరితమైన అంశం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, ఇది కేవలం చరిత్ర కాదు భారతీయ సంస్కృతికి, హిందూ మతానికి ప్రతీకగా మారింది. ఓలి వ్యాఖ్యలు ఈ భావనను కించపరిచే ప్రయత్నంగా భావిస్తూ, పలువురు మతపెద్దలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. భారత విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు కానీ, రాజకీయ వర్గాలు ఇది చరిత్రను వక్రీకరించే ప్రయత్నం అని విమర్శించాయి. కొన్ని హిందూ సంస్థలు ఓలి వ్యాఖ్యలు మతాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అని అభిప్రాయపడ్డాయి. రాముడు భారతీయుడు. అయోధ్య ఆయన జన్మస్థలం. ఇది వేదకాలం నుంచి ఉన్న విశ్వాసం అని పలువురు భారతీయులు పేర్కొన్నారు. నేపాల్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం కూడా ఈ అంశాన్ని గమనించి, సంబంధిత అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. Nepal PM Oli’s controversial Comments.
ఓలి వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్‌లో 2025 చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓలి నేతృత్వంలోని పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో, జాతీయత, సాంస్కృతిక భావం వంటి అంశాలను ముందుకు తెచ్చి ఓటర్లను ఆకర్షించాలన్న వ్యూహంగా ఇది కనిపిస్తోంది. రాముడు నేపాల్‌లో పుట్టారు అనే వాదన కేవలం మతపరమైనది కాదు, నేపాల్‌కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందన్న భావనను ప్రజల్లో నాటేందుకు ప్రయత్నం. అంతేకాదు, భారతదేశంతో ఉన్న సంబంధాల్లో తాము కూడా ప్రాచీన నాగరికతకు కేంద్రం అనే సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం కనిపిస్తోందంటున్నారు. ఓలి గతంలోనూ భారతదేశం నేపాల్‌ను చిన్నచూపు చూస్తోంది అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా అదే ధోరణిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక రకంగా — సాంస్కృతిక జాతీయత అనే భావనను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అంటున్నారు.
నేపాల్‌లో కూడా ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని జాతీయవాద వర్గాలు — ఓలి నిజం చెప్పారు. ఇది నేపాల్ గౌరవం అని స్వాగతించాయి. కానీ మరికొన్ని వర్గాలు — ఇది మతాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అని విమర్శించాయి. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఓలి వ్యాఖ్యలు ప్రజల మత విశ్వాసాలపై ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇది పార్టీకి నష్టం అని అన్నారు. ఈ అంశంపై నేపాల్ విదేశాంగ శాఖ 2020లో ఓలి వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇది ప్రభుత్వ అధికారిక వైఖరి కాదు. ఇది వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. ఈసారి కూడా ఓలి వ్యాఖ్యలు పార్టీ కార్యక్రమంలో చేసినవే. కానీ అవి అంతర్జాతీయంగా చర్చకు దారితీయడంతో, నేపాల్ ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓలి వ్యాఖ్యలు మతాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమని… ఇది నేపాల్-భారత్ సంబంధాలకు నష్టం అని నేపాల్ మీడియా విశ్లేషించింది.
శాస్త్రీయంగా చూస్తే వాల్మీకి రామాయణంలో రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర ఆశ్రమానికి వెళ్లినప్పుడు కోశీ నదిని దాటినట్లు పేర్కొనబడింది. విశ్వామిత్రుడు కౌశిక ఋషిగా పిలవబడతాడు. కౌశిక అనే పదం కోశీ నది ఒడ్డున నివసించిన ఋషికి సూచన. ఓలి వాదన ప్రకారం ఈ ప్రాంతం నేపాల్‌లో ఉంది. కానీ వాల్మీకి రామాయణం భౌగోళికంగా స్పష్టమైన స్థలాలను పేర్కొనదు. అయోధ్య అనే పేరు ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉంది. వేదాలలో, పురాణాలలో, జైన గ్రంథాలలో అయోధ్యను రామ జన్మస్థలంగా పేర్కొనబడింది. అంతేకాదు, అయోధ్యలోని ప్రాచీన స్థలాలు, తవ్వకాల్లో లభించిన ఆధారాలు రామాయణ కాలానికి సంబంధించినవి అని పురావస్తు శాఖ పేర్కొంది. వాల్మీకి ఆశ్రమం నేపాల్‌లో ఉండవచ్చు. కానీ అది రాముడి జన్మస్థలమా? అనే ప్రశ్నకు స్పష్టమైన ఆధారాలు లేవు.
రాముడు అయోధ్యలోనే జన్మించాడని చెప్పడానికి ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయి. అవి పురాణాలు, పురావస్తు తవ్వకాలు, చారిత్రక పత్రాలు, ప్రజల విశ్వాసం, న్యాయస్థాన తీర్పులు వంటి విభిన్న అంశాల ఆధారంగా చెప్పవచ్చు. వాల్మీకి రచించిన రామాయణంలో స్పష్టంగా సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో రాముడు జన్మించాడు అని పేర్కొనబడింది. స్కంద పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం వంటి అనేక హిందూ గ్రంథాల్లో అయోధ్యను రామ జన్మస్థలంగా పేర్కొన్నారు. 1902లో బ్రిటిష్ అధికారి ఎడ్వర్డ్, స్కంద పురాణ ఆధారంగా అయోధ్యలోని 148 తీర్థ స్థలాల్లో శిల్పస్తంభాలు ఏర్పాటు చేశారు. చరిత్రకారుడు హాన్స్ బాకర్ వాటిని అధ్యయనం చేసి అయోధ్యలో రామ జన్మస్థలాన్ని గుర్తించే పలు మ్యాపులు రూపొందించారు. పురావస్తు ఆధారాల పరంగా, 2003లో భారత పురావస్తు శాఖ కోర్టు ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు స్థలంలో తవ్వకాలు నిర్వహించింది. ఈ తవ్వకాల్లో 10వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయ నిర్మాణ శైలికి సంబంధించిన శిల్పాలు, స్థూపాలు, పునాది నిర్మాణాలు బయటపడ్డాయి. ASI నివేదిక ప్రకారం, బాబ్రీ మసీదు స్థలంలో ముందుగా హిందూ దేవాలయం ఉండేది అనే అంశాన్ని తవ్వకాలు సూచిస్తున్నాయి. చారిత్రక పత్రాల పరంగా, 1717లో జైసింగ్ అనే రాజపుత్ రాజు ఆ స్థలానికి సంబంధించిన భూమిని కొనుగోలు చేశాడు. 1766–1771 మధ్య జెస్యూట్ మిషనరీ జోసెఫ్ టీఫెన్‌థాలర్, ఆ స్థలాన్ని సందర్శించి ఇది హిందువులు రామ జన్మస్థలంగా భావించే ప్రదేశం అని రాశాడు. 1810లో ఫ్రాన్సిస్ బుచానన్ కూడా ఇది రాముడికి అంకితమైన దేవాలయం అని పేర్కొన్నాడు. 1870లో ఫైజాబాద్ గెజిటీర్‌లో బాబర్ 1528లో రామ మందిరాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించాడు అని పేర్కొనబడింది. ఈ ఆధారాలన్నింటిని కలిపి చూస్తే — అయోధ్యను రామ జన్మస్థలంగా భావించడానికి పురాణ, పురావస్తు, చారిత్రక, న్యాయపరమైన, ప్రజల విశ్వాస పరమైన బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇది కేవలం మత విశ్వాసం మాత్రమే కాదు . శాస్త్రీయంగా, చారిత్రకంగా, న్యాయపరంగా కూడా బలంగా నిలిచిన అంశం.