బిహార్ ఎన్నికల వేళ నితీశ్ వ్యూహాలు..!

Nitish’s elections strategies: బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నితీష్ కొత్త రాజకీయానికి తెర తీశారు. మహిళ ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త హామీని ముందుకు తీసుకొచ్చారు. దేశ రాజ‌కీయాల్లో ప్రతి ఎన్నికల వేళ కొత్త పథకాలను తీసుకురావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ కొన్ని నిర్ణ‌యాలు ఎన్నిక‌ల కోసం తీసుకున్నా.. అవి సామాజిక దిశ‌గా మార్పుల‌కు దారి తీస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అటువంటి‌దే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకున్న తాజా నిర్ణ‌యం. ఇంతకీ నితీష్ ఇచ్చిన కొత్త హామీ ఏంటి..? ఇది ఆయన గెలుపునకు ఎలా ఉపయోగపడనుంది..? దీనికి ఉన్న సవాళ్లు ఏంటి..?

ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలు హామీలతో ఊదరకొడతారు. ఆ పథకం, ఈ పథకం అంటూ ఓటర్లను ఆకర్షిస్తారు. ముఖ్యంగా మహిళ ఓటర్లకైతే ప్రత్యేక పథకాలు ఉంటాయి. ఫ్రీఫ్రీఫ్రీ అంటూ ఉచితాలు ఉంటాయి. తాజాగా బిహార్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నితీశ్ కూడా మహిళకు వరాల జల్లు కురిపించారు. నితీశ్ కుమార్ మంత్రివర్గం ఆమోదించిన 43 నిర్ణయాలలో మహిళల రిజర్వేషన్ కీలక బిందువుగా మారింది. ఇప్పటివరకు 2016లో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల కోసం 35% రిజర్వేషన్ విధానం కొనసాగుతోంది. కానీ తాజా నిర్ణయం వల్ల ఈ రిజర్వేషన్ సరళంగా అన్ని మహిళలకు కాకుండా, బీహార్‌కు చెందిన వారికే పరిమితం అవుతుంది. అంటే తల్లి, తండ్రి, విద్య, నివాస ధ్రువీకరణల ఆధారంగా స్థానికురాలు అన్న గుర్తింపు పొందిన వారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో హక్కు. ఇది ఒకవైపు స్థానిక మహిళలకు అవకాశాలను పెంచుతుంది. మరోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి బీహార్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అర్హురాలు అయినా మహిళకు ఇది ఇబ్బందే. ప్రభుత్వ వర్గాల ప్రకారం, డోమిసైల్ ధృవీకరణను పంచాయితీ స్థాయిలోనే అమలు చేస్తారు. కానీ దానికి సంబంధించి పారదర్శకత సక్రమంగా ఉండారు. మంత్రివర్గ నిర్ణయంలో పేర్కొన్న విధంగా అన్ని గ్రూప్ A, B, C, D ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల్లో ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఉద్యోగ నియామకాల్లో ఇతర రిజర్వేషన్లను దెబ్బతీయకుండా, ప్రత్యేక కేటాయింపు ద్వారా అమలు చేస్తామని మంత్రివర్గం తెలిపింది. Nitish’s elections strategies.

ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. బీహార్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ సంస్థ చేసిన ఓ ప్రీ-పోల్ సర్వే ప్రకారం, బీహార్ మహిళల్లో ఎక్కువమంది నితీశ్ కుమార్‌కు మద్దతు ఇస్తున్నారని తేలింది. అదే సమయంలో యువతలో మాత్రం తేజస్వీ యాదవ్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో, మహిళా ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ఈ రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఇది కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ మాత్రమే కాదు — మహిళల సామాజిక స్థితిని బలోపేతం చేయాలన్న సంకల్పానికి సంకేతం అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ నిర్ణయం వల్ల బీహార్ మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరగడం ఖాయం. కానీ దీని అమలులో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మొదటిగా, స్థానికత నిర్ధారణ ఎలా చేస్తారు? ఒక మహిళ బీహార్‌కు చెందినదని నిరూపించేందుకు ఏ డాక్యుమెంట్లు అవసరం? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండకపోతే, అర్హులైన మహిళలు కూడా నష్టపోవచ్చు. రెండవది, ఇప్పటికే ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండగా, ఈ రిజర్వేషన్ వల్ల కొన్ని వర్గాల మహిళలకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. మూడవది, ఇతర రాష్ట్రాల మహిళలు కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత రాజ్యాంగం ప్రకారం, ఉద్యోగాల్లో ప్రాంతీయ వివక్షకు తావు ఉండకూడదు. ఈ అంశం భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది.

ఈ నిర్ణయంతో పాటు, బీహార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ యువత కోసం ప్రత్యేకంగా యూత్ కమిషన్ ఏర్పాటు. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరందరూ 45 ఏళ్ల లోపు వయస్సు కలిగినవారే కావాలి. ఈ కమిషన్ పని ఏమిటంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యా రంగంలో దిశానిర్దేశం చేయడం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పించడం వంటివి ఉంటాయి. అంతేకాదు, మద్యపానం, మత్తు పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు కార్యక్రమాలు రూపొందించడం కూడా ఈ కమిషన్ బాధ్యత. ఇది ఒక రకంగా యువతకు ప్రభుత్వ మద్దతు అని చెప్పవచ్చు. కానీ ఇది కేవలం ఎన్నికల ముందు తీసుకున్న ప్రకటనగా మిగిలిపోతుందా? లేక నిజంగా అమలవుతుందా? అన్నది చూడాలి.

నితీశ్ తీసుకున్న ఇంకొక ఆసక్తికర అంశం వికలాంగుల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ పాస్ అయిన వికలాంగ అభ్యర్థులకు 50 వేల రూపాయలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. ఇది ఒక మంచి నిర్ణయంగా చెబుతున్నారు. ఎందుకంటే, వికలాంగులు సాధారణంగా పోటీ పరీక్షల కోసం ఎక్కువ ఖర్చు చేయలేరు. ఈ ఆర్థిక సహాయం వల్ల వారు మెయిన్స్, ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా సామాజిక న్యాయం దిశగా తీసుకున్న మంచి అడుగు. కానీ దీని అమలు ఎలా జరుగుతుంది? ఎంతమంది దీనికి అర్హులు అవుతారు? అనే ప్రశ్నలు ఇంకా స్పష్టంగా లేవు.

ప్రధానంగా మహిళలు, యువత, వికలాంగులు అనే మూడు వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటిని చూస్తే సామాజిక న్యాయం, మరోవైపు ఓటు బ్యాంక్ రాజకీయాల కలయికగా కనిపిస్తుంది. నితీశ్ కుమార్ గతంలోనూ మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. సైకిల్ యోజన, విద్యా ప్రోత్సాహకాలు, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ వంటివి. ఇప్పుడు ఈ 35 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కూడా అదే దారిలో తీసుకున్న నిర్ణయం. కానీ దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మహిళలు నిజంగా ఉద్యోగాల్లోకి వస్తారా? లేక ఇది కేవలం గెజిట్‌లో మిగిలిపోయే ప్రకటనగా మిగిలిపోతుందా? అన్నది అమలులోనే తెలుస్తుంది.

మహిళల కోసం తీసుకున్న 35 శాతం రిజర్వేషన్, యువత కోసం యూత్ కమిషన్, వికలాంగుల కోసం ప్రోత్సాహకాలు ఇవన్నీ కలిపి చూస్తే, నితీశ్ పై నమ్మకాన్ని పెంచుతుందని ఆయన పార్టీ నాయకులు అంటున్నారు. కానీ ఈ రిజర్వేషన్ పక్కాగా అమలు అవుతుందా? నిజంగా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందా? లేదా ఇది పేపర్ ప్రకటనలకే పరిమితమవుతుందా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. మహిళలకు అవకాశం కల్పించడం ఒక మంచి ఆలోచన అయినా, అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలు, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఈ విధానం అన్యాయం కాకూడదు. అందుకే ఈ నిర్ణయాలు ఓ ఎన్నికల స్ట్రాటజీగా మిగిలిపోకుండా .. అమలు జరిగితే అందరికీ ఉపయోగం.