పాకిస్థాన్‌కు ఎలాంటి సాయం లేదు..!!

యుద్ధంతో పూర్తిగా దివాలా తీయనున్న పాకిస్తాన్ ..ఓ వైపు అంతర్గత పోరు… మరో వైపు ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతోంది .. చేయి చాచి అడిగినా పాక్‌కు బయట నుంచి ఆదుకునే వారు ఎవరూ కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో పాక్‌ మనదేశంతో ఎక్కువ కాలం పోటీ పడే పరిస్థితి లేదు. పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.

భారత్‌ను కెలికి వాసన చూసిన పాక్ అన్నిరకాలుగా చావుదెబ్బ తింటోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్‌ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్‌కు ఏ మాత్రం లేదు. పాకిస్తాన్ ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోలు వరకూ అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధార పడే ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవిప్పుడు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ప్రస్తుతమున్న నిల్వలు మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయంటున్నారు. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్‌ను ఆర్థికంగా ఆదుకోవటానికి ఎవ్వరూ ఇప్పుడు ముందుకు రావడం లేదు.

అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే సీఈఐసీ ప్రకారం… డిసెంబరు 2024 నాటికి పాకిస్థాన్‌ అప్పు 131 బిలియన్‌ డాలర్లు. తాజాగా పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది. పాక్‌ జీడీపీలో అప్పుల వాటా ఇప్పటికే 75 శాతానికి చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచదేశాల్లో ముద్ర పడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్‌కు అసాధ్యంగా మారనున్నాయి. మరోవైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు పాకిస్తాన్ సతమతమవుతోంది. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదు. పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్థాన్‌కు అంతులేని నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళుతున్న భారత్‌తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.

అటు ఆర్థిక ఇబ్బందులకు తోడు… రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్‌లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్థాన్‌లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు, సైన్యానికీ సవాలు విసురుతోంది. తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తోంది. ఇటీవల జరిగిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌తో ఆ ప్రాంతంపై పట్టు కోల్పోయినట్లయింది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వంతోనూ పాక్‌కు పొసగటం లేదు. ఇంకోవైపు సింధ్‌లో ఇండస్‌ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒకరకంగా అంతర్యుద్ధ పరిస్థితులను పాకిస్థాన్‌ ఎదుర్కొంటోంది.

దేశ భద్రతలో కీలకమైన రక్షణవ్యవస్థ కూడా బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యంపైనా పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోలు వంటివాటినీ అవసరాలకు అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్‌ వంటి శక్తిమంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్‌ రక్షణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్‌ రూ.2.50 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని… పాకిస్థాన్‌ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని ముంబయికి చెందిన థింక్‌ ట్యాంక్‌ స్ట్రాటజిక్‌ ఫోర్‌సైట్‌ గ్రూప్‌ విశ్లేషించింది. ఇదే జరిగితే పాక్‌పై కోలుకోలేని భారం పడుతుంది. దాంతో ఆ దేశంలో ప్రజాజీవనం అతలాకుతలం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.