ఆపరేషన్ చక్ర-5 సీబీఐ ఆపరేషన్..!

Operation Chakra-V: “మీ పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయి”, “మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం”, మీ బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.. మీ పాన్ నెంబర్ చెప్పండి.. మీ కార్డు బ్లాక్ అయ్యింది. ఓటీపీ చెప్పండి. అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఆపరేషన్ చక్ర-5 పేరుతో దేశవ్యాప్తంగా దాడులు చేసింది. సైబర్ నేరగాళ్ల భరతం పట్టింది. అసలు ఈ ఆపరేషన్ చక్ర-5 అంటే ఏంటి? సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తమ నెట్‌వర్క్ నడిపిస్తున్నారు? ఇటీవల ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాలు ఏమిటి? వీటిని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి?

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్‌లో సమస్య ఉంది, మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు అంటూ అమాయకులను బెదిరించి, డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేరాలను అడ్డుకునేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చక్ర -5 అనే పెద్ద ఆపరేషన్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ నేర నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం, విదేశీల నుంచి జరిగే సైబర్ నేరాలను అరికట్టడం దీని లక్ష్యం. ఈ ఆపరేషన్‌లో అమెరికా ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలతో సీబీఐ కలిసి పనిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, సంభల్, మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్‌లోని జైపూర్, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్‌లలో 12 ప్రాంతాల్లో దాడులు చేసి, కీలక నేరస్తులను అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ నేరస్తులు జపాన్ పౌరులను టార్గెట్ చేసి, మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఆపరేషన్ చక్ర-5, గతంలోని చక్ర-1 నుంచి చక్ర-4 ఆపరేషన్‌ల కొనసాగింపు. గత ఆపరేషన్‌లలో OTP మోసాలు, లోన్ యాప్ స్కామ్‌లు, జాబ్ స్కామ్‌లు, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లపై దాడులు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ నేరాలను అరికట్టడానికి సీబీఐ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.

Also Read: https://www.mega9tv.com/national/another-new-chapter-in-indias-space-history-has-begun-the-indian-flag-has-flown-in-space/

సైబర్ నేరగాళ్లు ఒకే చోట కూర్చొని దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా మోసాలు చేస్తున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డేటా ప్రకారం, భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు సైబర్ నేరాలకు కేంద్రాలుగా మారాయి. ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్, రాజస్థాన్‌లోని డీగ్, అల్వార్, జైపూర్, జోధ్‌పూర్, హర్యానాలోని నూహ్, ఉత్తరప్రదేశ్‌లోని మథుర, గౌతమ్ బుద్ధ నగర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, గుజరాత్‌లోని సూరత్, బీహార్‌లోని నలంద, నవాడా, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్, కేరళలోని కోజికోడ్ ఇలా పలు ప్రాంతాలు సైబర్ నేరాల హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి నేరస్తులు కాల్ సెంటర్లు, ఫేక్ టెక్ సపోర్ట్ సెంటర్లు నడుపుతూ, అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీలో ఇన్నోనెట్ టెక్నాలజీస్ అనే కంపెనీ పేరుతో నడిచిన కాల్ సెంటర్‌ను సీబీఐ ఆపరేషన్ చక్ర-3లో సీజ్ చేశారు. ఈ కాల్ సెంటర్ 2022 నుంచి అమెరికా, జపాన్ పౌరులను టార్గెట్ చేసి మోసాలు చేసింది. ఈ హాట్‌స్పాట్‌లలో నేరస్తులు సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లు ఉపయోగిస్తారు, అంటే మనుషుల మనస్తత్వాన్ని ఉపయోగించి OTPలు, బ్యాంక్ వివరాలు దొంగిలిస్తారు. ఈ నెట్‌వర్క్‌లు చిన్న నగరాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పోలీసులకు వీటిని గుర్తించడం, అరికట్టడం కష్టంగా ఉంటుంది.

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు చాలా రకాలుగా, సంక్లిష్టంగా మారాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డేటా ప్రకారం, 2024లో రోజుకు సగటున 7,000 సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదయ్యాయి, వీటిలో 85% ఆన్‌లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు ఇందులో ప్రధానమైనవి. ఈ స్కామ్‌లలో నేరస్తులు పోలీసులు, సీబీఐ, ఈడీ, బ్యాంక్ అధికారులుగా నటించి, మీ అకౌంట్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది లేదా మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు అని బెదిరిస్తారు. వీడియో కాల్స్‌లో ఫేక్ అరెస్ట్ వారెంట్‌లు చూపిస్తారు, డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తారు. ఇక UPI ఫ్రాడ్స్ మరో సైబర్ నేరం. ఫేక్ లింక్‌లు, QR కోడ్‌ల ద్వారా OTPలు దొంగిలించి బ్యాంక్ అకౌంట్‌లను ఖాళీ చేస్తారు. వీటికి తోడు ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు కూడా ఎక్కువయ్యాయి, ఇందులో స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. అలాగే డేటింగ్ యాప్‌ల ద్వారా బ్లాక్‌మెయిల్, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాంక్ వివరాలు దొంగిలించడం, ఫేక్ టెక్ సపోర్ట్ స్కామ్‌లు కూడా జరుగుతున్నాయి. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతీయులు సైబర్ నేరాల వల్ల రూ. 1,750 కోట్లు నష్టపోయారు. ఈ నేరాలు సామాన్యుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి, అందుకే వీటిని అరికట్టడం చాలా ముఖ్యమని సీబీఐ చెబుతోంది. Operation Chakra-V

Also Read: https://www.mega9tv.com/international/how-trump-controlling-both-countries-and-what-type-of-serious-consequences-he-is-facing/

సైబర్ నేరాల నుంచి రక్షణ పొందడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా, గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్‌లను నమ్మవద్దు. మీ అకౌంట్ బ్లాక్ అయింది లేదా మీరు అరెస్ట్ అవుతారు అని బెదిరిస్తే, వెంటనే ఫోన్ కట్ చేసి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. రెండవది, OTP, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్‌లో OTP అడగరు. మూడవది, గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు, QR కోడ్‌లను స్కాన్ చేయడానికి ముందు జాగ్రత్తగా చూడండి. నాలుగవది, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లలో డబ్బు పెట్టే ముందు, ఆ సంస్థ నమోదైనదా, విశ్వసనీయమా అని చెక్ చేయండి. SEBI, RBI వెబ్‌సైట్‌లలో ఈ సమాచారం ఉంటుంది. ఐదవది, మీ ఫోన్, కంప్యూటర్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయండి, పాస్‌వర్డ్‌లను బలంగా, రెగ్యులర్‌గా మారుస్తూ ఉండండి. ఆరవది, సైబర్ నేరం జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి లేదా 1930 నంబర్‌కు కాల్ చేయండి. ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు సంబంధిత రాష్ట్ర పోలీసులకు వెళతాయి. I4C, సీబీఐ వంటి సంస్థలు మీ ఫిర్యాదును వెంటనే పరిశీలిస్తాయి. అంతేకాదు, సైబర్ నేరాల గురించి అవగాహన పెంచుకోవడం కూడా ముఖ్యం.

సైబర్ నేరాల వల్ల భారత్‌లో భారీ ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి. I4C డేటా ప్రకారం, 2024లో రూ. 22,812 కోట్లు సైబర్ ఫ్రాడ్స్ వల్ల నష్టపోయాము. 2021లో ఈ నష్టం రూ. 551 కోట్లు ఉంటే, 2023లో రూ. 7,496 కోట్లకు పెరిగింది. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రూ. 1,750 కోట్లు నష్టపోయాము. రోజుకు సగటున 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి, అంటే సంవత్సరానికి 17 లక్షలకు పైగా ఫిర్యాదులు. ఈ ఫిర్యాదుల్లో 85% ఆన్‌లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కు సంబంధించినవి. ఈ నష్టాలు సామాన్యుల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తున్నాయి. UPI ఫ్రాడ్స్, క్రిప్టో స్కామ్‌ల వల్ల చిన్న వ్యాపారులు, సామాన్య పౌరులు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. I4C ప్రకారం, రోజుకు 4,000 మ్యూల్ బ్యాంక్ అకౌంట్‌లను గుర్తిస్తున్నారు, అంటే నేరస్తులు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే ఫేక్ అకౌంట్‌లు. ఈ ఆర్థిక నష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థపై 0.7% ప్రభావం చూపిస్తున్నాయి, అంటే GDPలో 0.7% నష్టం. ఈ నష్టాలను తగ్గించడానికి I4C, సీబీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కలిసి మ్యూల్ అకౌంట్‌లను బ్లాక్ చేస్తున్నాయి, స్కైప్, గూగుల్, మెటా యాడ్స్‌ను మానిటర్ చేస్తున్నాయి. సైబర్ నేరాలు కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, పౌరుల భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తాయి.

సైబర్ నేరాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 2020లో ఏర్పాటై, సైబర్ నేరాలపై ఒక కేంద్రీకృత వ్యవస్థగా పనిచేస్తోంది. I4C ఏడు రకాల విధానాలతో సైబర్ నేరాలను ఎదుర్కొంటోంది. సైబర్ థ్రెట్ అనలిటిక్స్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లు, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, శిక్షణ కేంద్రాలు, సైబర్ క్రైమ్ రీసెర్చ్, ఎకోసిస్టమ్ మేనేజ్‌మెంట్. 2024 సెప్టెంబర్‌లో I4C మొదటి ఫౌండేషన్ డేలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాలుగు కీలక చర్యలను ప్రకటించారు. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, క్వార్డినేసన్ ప్లాట్‌ఫామ్, సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, నేషనల్ సస్పెక్ట్ రిజిస్ట్రీ. ఈ రిజిస్ట్రీలో 14 లక్షల మంది సైబర్ నేరస్తుల డేటా ఉంది, ఇది రాష్ట్రాలు, కేంద్ర ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. ఈ రిజిస్ట్రీ ద్వారా 2024లో 6 లక్షల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్‌లను అడ్డుకుని, రూ. 1,800 కోట్లు కాపాడారు. అంతేకాదు, కొత్త క్రిమినల్ చట్టాల్లో సైబర్ నేరాలపై కఠిన నిబంధనలు చేర్చారు. I4C 35,000 మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చింది, డిజిటల్ ఫోరెన్సిక్ కిట్‌లు, ఇంటెలిజెన్స్ టూల్స్ అందిస్తోంది.

Also Read: https://www.mega9tv.com/national/nia-pfi-carried-hit-list-including-former-judge-and-976-more-people/