
భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడుల తర్వాత.. పాకిస్థాన్ సరిహద్దుల వద్ద భరితెగించింది. సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే భారత్ పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టింది.. అక్కడితో ఆగని భారత్ పాకిస్థాన్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా.. చైనా గిఫ్టుగా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నాశనం చేసింది. భారత్ దాడులతో పాకిస్థాన్ పరిస్థితి ఏంటి..? పాకిస్థాన్ ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది..?
భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఇప్పటికే పాకిస్థాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది.. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని భారత్ తెలిపింది. అయినా పాకిస్థాన్ వినకుండా ఎదురుదాడి చేస్తే ఆపరేషన్ సిందూర్ 2.0ను చూడాల్సి వస్తుందని భారత్ ఆర్మీ హెచ్చరించింది.. కానీ పాకిస్థాన్ మాట వినలేదు.. భారత్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. క్షిపణులను ప్రయోగించింది. దీంతో పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకుంది.
దీంతో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే.. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.
తర్వాత భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడింది. పాకిస్థాన్‌లోని లాహోర్ తో పాటు కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహవల్పూర్, మైనివాలి, చోర్ వంటి నగరాలతో పాటు షేఖూపురా, సేయిల్ కోట్, నరోవాల్ వంటి ప్రాంతాల్లో భారత డ్రోన్ దాడులు తెలుస్తోంది. ఈ దాడుల్లో HQ9 పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత డ్రోన్లు ధ్వంసం చేశాయి. అలాగే రావల్పిండిలోని ఒక స్టేడియంపై కూడా దాడి జరిగింది. దీంతో క్రికెటర్లు ఆ ప్రాంతాన్ని వీడాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సూచించింది. లాహోర్‌లో పాక్ మోహరించిన హెచ్‌క్యూ9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లను భారత్ ధ్వంసం చేయడంతో.. అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే.. తక్షణమే లాహోర్‌ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ జారీ చేసింది.
ఈ మేరకు పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నగరంలో పేలుళ్లు, డ్రోన్ల కూల్చివేతలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పేర్కొంది. తమ సిబ్బందిని షెల్టర్‌లోకి తరలించినట్లు వెల్లడించింది. బుధవారం రాత్రి పాకిస్థాన్ భారత్‌లోని 15 నగరాలు లక్ష్యంగా దాడులు మొదలుపెట్టడంతో మన గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని సకాలంలో అడ్డుకొన్నాయి. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 రంగంలోకి దిగింది. పాక్ ప్రయోగించిన చాలా ఆయుధాలను ఇది నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. ప్రతిదాడిగా పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకొంటుండంతో తీవ్ర గందరగోళం నెలకొంది. యుద్ధ భయంతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌ఛేంజి 7శాతం పతనమైంది. దీంతో ట్రేడింగ్‌ను కొద్దిసేపు ఆపేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్‌పుర్, బికనేర్, కిషన్‌ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు.
గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక పంజాబ్‌లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, ఫజ్లికా, అమృత్‌సర్, గురుదాస్‌పుర్, తార్న్ తరన్ ప్రాంతాల్లో 72 గంటలపాటు స్కూళ్లను మూసివేశారు. రాష్ట్ర పోలీస్‌శాఖ, ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి.. సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు.
భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్లు కాల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. చీకటిలో ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి దూసుకురావడాన్ని గమనించి ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు. వీక్ పాయింట్లపై ఫోకస్ పెంచారు.