బంగ్లాదేశ్ లో యూనస్ కు వ్యతిరేకత.. పాకిస్థాన్ తో కలిసి భారత్ పై కుట్రలు.. యూనస్ పై సైన్యం తిరుగుబాటు..!

బంగ్లాదేశ్ లో ఏమవుతోంది.. షేక్ హసినా ప్రభుత్వాన్ని గద్దె దింపి.. అధికారంలోకి వచ్చిన యూనస్ కు ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోందా..? యూనస్ పక్కన పెట్టాలని బంగ్లాదేశ్ సైన్యం చూస్తోందా..? యూనస్, బంగ్లాదేశ్ సైన్యాధిపతికి మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి..? చైనా, పాకిస్థాన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందా..? నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్.. బంగ్లాదేశ్ లో శాంతిని ఎందుకు నెలకొల్పలేకపోతున్నాడు..?

అశాంతి.. హింసతో ఏర్పడిన ప్రభుత్వం కాని.. పాలన కాని ఎప్పటికీ శాశ్వతంగా నిలబడదు. తాత్కాలికంగా బాగానే ఉన్నా.. చివరికి ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. చరిత్ర చూస్తే ఇది చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే అవుతుందని అంటున్నారు. షేక్ హసినాను పదవి నుంచి తప్పుకునేలా చేసి.. బంగ్లాదేశ్ లో పాలన చేపట్టిన యూనస్ కు త్వరలో పెద్ద గండం పొంచి ఉందని అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో యూనస్, ఆ దేశ సైన్యాధిపతి వాకర్-ఉజ్-జమాన్ మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. సైన్యాధిపతి జమాన్ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించాలని పిలుపునిచ్చారు. ఎప్పటి నుంచో యూనస్‌ను వీలైనంత త్వరగా ఎన్నికలు ప్రకటించమని జమాన్ కోరుతున్నారు. ఇటీవల కాలంలో యూనస్ తరుచూ చైనా, పాకిస్థాన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఇది జమాన్ కు నచ్చడం లేదు. బంగ్లాదేశ్ లో విదేశీ జోక్యం వల్ల దేశంలో అస్థిరత పెరిగే అవకాశం ఉందని జమాన్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు యూనస్‌ను కొన్ని విదేశీ శక్తులు ఆడిస్తున్నాయని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. దీంతో షేక్ హసీనా, ఖలీదా జియా పార్టీలను ఒకచోట చేర్చి, దేశం కోసం ఎన్నికల్లో పోటీ చేయాలని జమాన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల యూనస్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఖైదీలను విడుదల చేయడం సైన్యానికి అతిపెద్ద సమస్యగా ఉందని అంటున్నారు. దీనికి తోడు యూనస్ సైన్యాధిపతి లేని సమయంలో జాతీయ భద్రతా సలహాదారును నియమించడం ద్వారా సైన్యంలో విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. క్వార్టర్‌మాస్టర్ జనరల్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫైజుర్ రహ్మాన్, యూనస్ సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు ఖలీలుర్ రహ్మాన్‌తో రహస్య సమావేశం నిర్వహించారని సమాచారం. వీరు సైన్యాధిపతి జమాన్ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ చాలా మంది సైనిక కమాండర్లు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని సమాచారం. జమాన్ మొదట యూనస్‌కు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, విదేశీ జోక్యం కారణంగా ఆయన ఇప్పుడు త్వరగా ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నారంట. ఆయన ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో రహస్యంగా సంప్రదింపులు జరిపి, ప్రజాస్వామ్యం కోసం కలిసి పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది.

జమాన్, యూనస్ మధ్య ఆలోచనా తీరు చాలా భిన్నంగా ఉన్నాయి. జమాన్, 2024 జూన్‌లో సైన్యాధిపతిగా నియమితులైయాడు. సమతుల్యత కలిగి, భారత్‌కు అనుకూలమైన ధోరణి కలిగి ఉన్నాడు జమాన్. గతంలో కూడా యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా నియమించడం జమాన్ కు నచ్చలేదంట. నేషనల్ సిటిజన్ పార్టీ ప్రధాన నిర్వాహకుడు హస్నత్ అబ్దుల్లా ఒక 28-సెకన్ల వీడియోను విడుదల చేశాడు, దీనిలో యూనస్‌ను సలహాదారుగా నియమించడానికి యూత్ అండ్ స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ మహమూద్ షోజిబ్ భూయాన్, సైన్యాధిపతి ఇష్టపడలేదని చెప్పాడు. ఈ వీడియోలో, ఆసిఫ్, యూనస్ నోబెల్ గ్రహీత, సంస్కరణవాది అయినప్పటికీ, ఈ పదవికి సరైన వ్యక్తి కాదని భావించారని తెలిపారు. ఈ వీడియో సైన్యంలో అంతర్గత విభజనను సూచిస్తుందని, విదేశీ శక్తుల జోక్యం కూడా ఉండవచ్చని భారతదేశ ఉన్నత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలిసి సైన్యాధిపతిని తొలగించాలని యూనస్ అనుకుంటున్నాడని కూడా తెలిపాయి. గతంలో జమాన్ దేశాన్ని సరైన చేతుల్లోకి అప్పగించాలని ప్రజలను కోరినట్లు తెలిసింది.

పాకిస్థాన్ ఐఎస్ఐ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ ఈ ఏడాది ప్రారంభంలో ఫైజుర్ రహ్మాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఇబ్బందులు కలిగించడం, చొరబాట్ల అంశంపై పాకిస్థాన్ కుట్రలు చేసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత ఫైజుర్ రహ్మాన్ నేతృత్వంలో ఒక తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. క్రమశిక్షణ కలిగిన అధికారులు సైన్యాధిపతి జమాన్ కి వ్యతిరేకంగా వెళ్లడానికి నిరాకరించారని తెలుస్తోంది. రహ్మాన్ ఇస్లామిస్ట్, పాకిస్థాన్ అనుకూల ధోరణి, జమాన్ భారత్ అనుకూల ధోరణి వల్ల సైన్యంలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఎక్కువ మంది జమాన్ వైపే నిలిచారు. ఎందుకంటే ఎక్కువ మంది బంగ్లాదేశీ సైనికులు తమ దేశంలో పాకిస్థాన్ జోక్యాన్ని కోరుకోవడం లేదు. అటు తన తిరుగుబాటు ప్రయత్నం విఫలం కావడంతో ఫైజుర్ రహ్మాన్ జమాన్ పై కుట్రలకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో దేశంలో ఎన్నికలు జరిగితేనే ప్రస్తుత పరిస్థితులు చక్కబడతాయని సైన్యాధిపతి జమాన్ భావిస్తున్నారంట. అంతేకాదు యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని చక్కదిద్దడంలో విఫలమైనందుకు జమాన్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో స్థిరత్వం పునరుద్ధరించబడిన తర్వాతే సైన్యం తిరిగి బ్యారక్‌లకు వెళ్లాలని సూచించారు. అప్పటి వరకు అలర్ట్ గా ఉండాలని అంటున్నారు. అయితే ఒక వేళ ఎన్నికల జరిగితే యూనస్ కు వ్యతిరేకత ఉండే అవకాశం చాలా ఉందంటున్నారు. ఎందుకంటే షేక్ హసీనపై కోపంతో విద్యార్థి నేతలు.. యూనస్ ను గద్దె ఎక్కించారు కాని.. ఆ తర్వత పరిస్థితి వాళ్ల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడిందని అంటున్నారు. దేశంలో అశాంతి రేగింది. దీంతో చాలా మంది యూనస్ ను గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు.

హసీనా పదవీ విరమణ వెనుక విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్యమం మొదట ప్రభుత్వ ఉద్యోగాలలో కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైంది.ఇందులో 1971 స్వాతంత్ర్య సమర యోధుల బంధువులకు మూడవ వంతు ఉద్యోగాలు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ కోటా వ్యవస్థ వివక్షాపూరితమని ఆందోళనకారులు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ కోటాను తగ్గించినప్పటికీ, ఆందోళనలు హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా మారాయి. ఈ ఆందోళనలు తీవ్రమైన హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి, దీనిలో దాదాపు 400 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో హసీనా ఆగస్టు 5, 2024న రాజీనామా చేసి భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత, రాష్ట్రపతి మహమ్మద్ షహాబుద్దీన్, సైనిక నాయకులు, విద్యార్థి నాయకులతో సంప్రదింపులు జరిపి, యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా నియమించారు. విద్యార్థి నాయకులు సైనిక నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తిరస్కరించి, యూనస్‌ను నాయకుడిగా కోరారు. ఆగస్టు 8న ఢాకాలోని రాష్ట్రపతి భవనంలో యూనస్ 17 మంది సలహాదారులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశాడు. దీనిలో విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. యూనస్ ప్రధాన లక్ష్యం దేశంలో శాంతిని పునరుద్ధరించడం, ఎన్నికల కోసం సన్నాహాలు చేయడం, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడం. కాని ఆ విషయంలో యూనస్ విఫలమయ్యాడని అంటున్నారు.

మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, బంగ్లాదేశ్ విదేశీ విధానం చాలావరకు చైనా, పాకిస్థాన్ వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. ఈ ఏడాది మార్చిలో యూనస్ చైనాకు వెళ్లాడు. ఈ సమయంలో యూనస్ ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ కు చెందిన ఈశ్యాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదని.. దానిని తమ దేశంలో కలిపేసుకుంటే.. చైనాకు సముద్ర వాణిజ్యం సులువు అవుతందని అర్థం వచ్చేలా మాట్లాడాడు యూనస్. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. చైనాతో కలిసి యూనస్ కుట్రలకు దిగుతారనే ఆలోచన రేకెత్తించింది. చైనా లాభం కోసం భారత్ కు నష్టం కలిగేలా యూనస్ పథకాలు ప్లాన్ చేశాడు. మరోవైపు యూనస్ ప్రభుత్వం జమాత్-ఎ-ఇస్లామీ వంటి పాకిస్థాన్ కు మద్దతు పలికే ఇస్లామిస్ట్ సమూహాలపై హసీనా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అలాగే యూనస్ సన్నిహితుడైన రిటైర్డ్ మేజర్ జనరల్ ఎఎల్ఎం ఫజ్లుర్ రహ్మాన్ .. భారతదేశం పాకిస్థాన్‌పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలని, దాని కోసం చైనాతో సైనిక ఒప్పందం చేసుకోవాలని సూచించాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్, చైనాకు అనుకూలంగా యూనస్ పాలన సాగుతుందని క్లీయర్ గా తెలియజేస్తున్నాయి.

మహమ్మద్ యూనస్ పాలన చేపట్టిన తర్వాత భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హసీనా హయాంలో భారత్‌, బంగ్లాదేశ్ ఆర్థిక, భద్రతా సంబంధాలు చాలా బలంగా ఉండేవి.. కాని యూనస్ నేతృత్వంలో ఈ సంబంధాలు క్షీణించాయి. హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందడం, ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని యూనస్ డిమాండ్ చేయడం వివాదాంగా మారింది. యూనస్ హసీనాను ఎలగైనా హసినాను బంగ్లాదేశ్ తీసుకువెళ్లి.. ఆమె జైలులో పెట్టించాలని భావిస్తున్నాడు. దీనికి భారత్ అంగీకరించడం లేదు. ఎందుకంటే భారత్ హసీనాను ఒక దీర్ఘకాల మిత్రురాలిగా భావిస్తుంది. దీంతో యూనస్ కు ఏం చేయాలో అర్థం కాక భారత్ పై విషయం కక్కుతున్నాడు. అటు యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఈ దాడులను అడ్డుకోవడంలో యూనస్ విఫలమయ్యాడు. హసినా పార్టీ నేతలు, మద్దతు దాడులను యూనస్ అరెస్ట్ చేయించాడు. హిందూ సంఘాల నేతలు, ఇస్కాన్ టెంపుల్స్ నిర్వాహకులను ఇబ్బందులు పెట్టాడు. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వలాభం కోసం యూనస్ భారత్ కు వ్యతిరేకంగా.. చైనా, పాకిస్థాన్ కు మద్దతుగా వ్యవహరించినా.. అది బంగ్లాదేశ్ కు తాత్కాలికంగా లాభం చేకూర్చవచ్చు కాని.. దీర్ఘకాలంలో చాలా నష్టమని ఆ దేశ సైన్యాధిపతి జమాన్ భావిస్తున్నారు. దీనికి బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగడమే పరిష్కారమని అంటున్నారు. అప్పుడు యూనస్ గద్దె దిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.