
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరాయి. భారత్ సైనిక చర్యలకు సిద్ధమవుతోందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో POKలో యుద్ధానికి రెడీ అవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు కీలక ఆదేశాలు జారీచేసింది? ఇంతకీ అవి ఏంటి..? మరోవైపు పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నం ఏంటి..?
పహల్గాం దాడి తర్వాత భారత్ ఎప్పుడు సైనిక చర్యలకు దిగుతుందోనని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. దీంతో ఆ దేశ నేతలకు భారత్ చర్యలపై భయం పట్టుకుంది. భారత్ దాడి తప్పనిసరిగా చేస్తుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అధికారులు ప్రజలను రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను భద్రపరుచుకోమని సూచించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి 15 లక్షల మంది నివసిస్తున్నారు. వీరు యుద్ధం భయంతో బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. POKలో 1,000కి పైగా మదర్సాలను 10 రోజుల పాటు మూసివేశారు. యుద్ధం జరిగితే సరఫరా నిలిచిపోయి, ఆహార కొరత ఏర్పడవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మురోవైపు పహల్గాం దాడి తర్వాత ఆన్ లైన్ లో పోరు జరుగుతోంది. పాకిస్థాన్ సోషల్ మీడియాపై భారత్ నియంత్రణ పెడుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ ను భారత్ నిలిపివేసింది. అటు భారత వెబ్‌సైట్‌లపై పాకిస్థాన్ హ్యాకర్లు దాడులు చేస్తున్నారు. కానీ భారత సైబర్ సెక్యూరిటీ వాటిని దీటుగా అడ్డుకుంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పై 10 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా బలహీనంగా ఉంది. దీనికి IMF నిధులు కీలకం. 2024 జులైలో పాకిస్థాన్‌కు 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీని IMF ఆమోదించింది. ఇటీవల 1.3 బిలియన్ డార్లు క్లైమేట్ రెసిలియన్స్ లోన్ కూడా ఓకే అయ్యింది. పహల్గాం దాడి తర్వాత, ఈ నిధుల విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలని భారత్ IMFని కోరింది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఈ చర్యలు ద్వారా పాకిస్థాన్‌పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు, అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
భారత్ పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి తిరిగి చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్ 2018-2022 మధ్య గ్రే లిస్టులో ఉంది. ఇది విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సహాయంపై ప్రభావం చూపింది. పహల్గాం దాడి తర్వాత, పాకిస్థాన్ ఉగ్రవాద నిధులను అరికట్టడంలో విఫలమైందని భారత్ ఆరోపిస్తోంది. UN సెక్యూరిటీ కౌన్సిల్ సభ్య దేశాలతో భారత్ చర్చలు జరిపి, FATFలో ఈ అంశాన్ని లేవనెత్తింది. పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో చేర్చాలని జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకులు కూడా కోరారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 1989లో స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ. డబ్బు లాండరింగ్, ఉగ్రవాద నిధులను అరికట్టేందుకు ఏర్పాటైంది. ఇది 40 సిఫార్సుల ద్వారా దేశాల ఆర్థిక వ్యవస్థలను పర్యవేక్షిస్తుంది. ఈ సిఫార్సులు ఏడు రంగాలను కవర్ చేస్తాయి. FATF గ్రే లిస్టులో ఉన్న దేశాలపై నిధుల విషయంలో నిఘా ఉంటుంది. ఇది విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సహాయంపై ప్రభావం చూపుతుంది.
పహల్గాం దాడి తర్వాత భారత్ ఆర్థిక, దౌత్యపరమైన రంగాల్లో పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్, ఎయిర్‌స్పేస్ నిషేధం, సైబర్ చర్యలతో పాటు, IMF నిధుల సమీక్ష, FATF గ్రే లిస్టు ప్రయత్నాలు ఈ వ్యూహంలో భాగం. భారత్ ఈ చర్యల ద్వారా పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఒంటరిగా చేయాలని, ఉగ్రవాద నిధులను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.