
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ నుంచి భారత సంస్థల వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులు గణనీయంగా పెరిగాయి. కీలక సంస్థలపై ముష్కరమూకల సైబర్ సెల్స్ దాడులు చేశాయి. ఏఏ సంస్థలపై ఎలాంటి దాడులు జరిగాయి? భారత్ ఈ దాడులను ఎలా తిప్పికొట్టింది?
పహల్గాం దాడి తర్వాత భారత్ పై పాకిస్థాన్ సైబర్ దాడులు పెరిగిపోయాయి. తాజాగా జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. ఈ దాడిలో హ్యాకర్లు వెబ్‌సైట్‌ను డిఫేస్ చేయడానికి ప్రయత్నించారు. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో అనుచిత సందేశాలు, చిత్రాలను పెట్టేందుకు చూశారు. ఈ సైబర్ దాడిలో కీలక ఫైళ్లు మాయమయ్యాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్ గ్రూప్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ గ్రూప్ వెబ్‌సైట్‌లో పాకిస్థాన్ జెండా, కాశ్మీర్ గురించి రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ వెబ్‌సైట్ కశ్మీర్ లో స్థానిక పరిపాలనకు కీలకమైనది. స్థానిక పరిపాలనను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ సైబర్ దాడి జరిగినట్టు భావిస్తున్నారు.
శ్రీనగర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ , ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్‌లపై సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడులను పాకిస్థాన్ కు చెందిన గ్రూప్‌లు చేసినట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్‌లను డిఫేస్ చేసేందుకు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. వెబ్‌సైట్‌లపై పాకిస్థాన్ జెండా, సందేశం, కాశ్మీర్ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనిపించేలా చేశారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌పై కూడా దాడి చేసి, అనుచిత మెసేజ్ లు పెట్టారు. భారత సైన్యం బలాన్ని సవాలు చేయడం, భయాందోళన సృష్టించడం లక్ష్యంగా సైనిక సంస్థలతో సంబంధం ఉన్న వెబ్‌సైట్‌లపై దాడికి యత్నించారు.
పహల్గాం దాడి తర్వాత భారత వ్యవస్థలపై 10 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో పాటు పశ్చిమ ఆసియా, మొరాకో, ఇండోనేషియా నుంచి ఈ సైబర్ దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇస్లామిక్ సైబర్ గ్రూప్‌లు ఈ దాడులు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ దాడులు భారత్ , పాకిస్థాన్ మధ్య సైబర్ యుద్ధంగా మారాయని, భారత్‌పై ఇది పాకిస్థాన్ సైబర్ దాడిగా అభివర్ణిస్తున్నారు.
భారత్ ఈ సైబర్ దాడులను తిప్పికొట్టడానికి బలమైన సైబర్ భద్రతా వ్యవస్థను ఉపయోగిస్తోంది. భారత్ లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఈ దాడులను రియల్ టైమ్‌లో గుర్తించి, వాటి మూలాన్ని పాకిస్థాన్‌గా ట్రాక్ చేసింది. జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మీ స్కూళ్లు, వెల్ఫేర్ సంస్థల వెబ్‌సైట్‌లపై జరిగిన దాడులను సరిచేశారు. ఈ దాడులను అరికట్టడంలో మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ విజయవంతమైంది. సైబర్ హ్యాకింగ్ గ్రూప్‌లు మిషన్-క్రిటికల్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయలేకపోయాయి. కేవలం పబ్లిక్ వెబ్‌సైట్‌లను మాత్రమే టార్గెట్ చేశాయి.
ఆర్మీ స్కూళ్లు, వెల్ఫేర్ సంస్థలతో పాటు, రాజస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సైనిక్ వెల్ఫేర్ బోర్డ్‌లు వంటి ఇతర సంస్థలపై కూడా సైబర్ దాడులు జరిగాయి. రాజస్థాన్‌లో మూడు ప్రభుత్వ వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసి, పహల్గాం దాడి గురించి రెచ్చగొట్టే మెసేజులను ప్రదర్శించారు. వెబ్‌సైట్‌లను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు. భారత్ కు చెందిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలహీనపరచడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు.
సైబర్ దాడులు కేవలం టెక్నికల్ దాడులు మాత్రమే కాదు.. రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగం. పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్ గ్రూప్‌లు భారత సైనిక, ప్రభుత్వ సంస్థలను టార్గెట్ చేయడం ద్వారా భయాందోళన సృష్టించాలని, భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ దాడులు ఇస్లామిక్ సైబర్ గ్రూప్‌ల పేరుతో జరగడం, టూ-నేషన్ థియరీ, కాశ్మీర్ గురించి సందేశాలు ప్రదర్శించడం రాజకీయ ఉద్దేశాన్ని సూచిస్తున్నాయి. అయితే భారత్ ఈ సైబర్ దాడులను తిప్పికొట్టడంలో తన సైబర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని చూపించింది. భారత్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రియల్ టైమ్ మానిటరింగ్, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్, శీఘ్ర రిస్పాన్స్ టీమ్‌లతో ఈ దాడులను నిరోధించాయి.