భారత్ స్నేహితులు.. శత్రువులు వీరే..!

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రికత్తలు తారాస్థాయికి చేరాయి.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. భారత్ అన్ని విధాలుగా పాకిస్థాన్ ను అష్టదిగ్బంధంనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అటు పాకిస్థాన్ భారత్ ను ఎదుర్కొనేందుకు స్నేహితుల సహాయం కొరుతోంది. ఇంతకీ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే ఏ దేశం ఎవరికి మద్దతు ఇస్తుంది..? డైరెక్టు గా యుద్ధంలో పాల్గొనే దేశాలు ఏంటి..? పాక్ కు మద్దతుగా చైనా మనపై దాడి చేస్తుందా..?

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని భారత్ ఆధారాలు చూపిస్తోంది. ఇప్పటికే అనేక ఆంక్షలు పాకిస్థానపై విధించింది. రేపోమాపో దాడి చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు స్నేహితులను తోడు తెచ్చుకుంటున్నాయి. పాకిస్తాన్‌కు చైనా, టర్కీ లాంటి దేశాలు రాజకీయంగా, కొంతమేర సైనికంగా మద్దతిస్తున్నాయి. చైనా పాకిస్తాన్‌కు పెద్ద ఆయుధ సరఫరాదారు, రాజకీయంగా కూడా ఎప్పుడూ అండగా ఉంటుంది. టర్కీ కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతిస్తూ, సైనిక సహకారం అందిస్తోంది. ఇరాన్ కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్‌కు మద్దతిచ్చినా, అది చాలా తక్కువ. ఇక భారత్ విషయానికొస్తే, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలు బలంగా అండగా నిలుస్తున్నాయి. ఈ దేశాలు భారత్‌తో సైనిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటంలో, ప్రాంతీయ భద్రత కోసం భారత్‌కు ఈ దేశాలు మద్దతిస్తాయి. పహల్గామ్ దాడిని ఈ దేశాలు ఖండించాయి, భారత్‌కు అంతర్జాతీయ మద్దతు పెరిగింది.

ముందుగా పాకిస్థాన్ మిత్రుల విషయానికి వస్తే. టర్కీ, పాకిస్తాన్ మధ్య చాలా సంవత్సరాలుగా గట్టి సంబంధం ఉంది. ఇది మతపరంగా, సైనిక పరంగా, రాజకీయంగా స్నేహం కొనసాగుతోంది. టర్కీ గతంలో కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతిచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఐక్యరాజ్యసమితిలో ఈ విషయాన్ని లేవనెత్తారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ నావికాదళానికి చెందిన యుద్ధ నౌక కరాచీ ఓడరేవుకు వచ్చింది. ఈ నౌకకు అత్యాధునిక క్షిపణులు, శత్రు నౌకలను నాశనం చేసే ఆయుధాలు, జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉంది. టర్కీ పాకిస్తాన్ కోసం నాలుగు పెద్ద యుద్ధ నౌకలను తయారు చేస్తోంది. రెండు ఇస్తాంబుల్‌లో, రెండు కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది టర్కీ, పాకిస్థాన్ మధ్య రక్షణ రంగంలో పెద్ద డీల్. అంతేకాదు, టర్కీ బైరక్తార్, అకిన్సీ డ్రోన్‌లను, శిక్షణ విమానాలను పాకిస్తాన్‌కు ఇచ్చింది. 2024 ఆగస్టులో అరేబియా సముద్రంలో రెండు దేశాలు కలిసి సైనిక విన్యాసాలు చేశాయి. పహల్గామ్ దాడి తర్వాత టర్కీ నుంచి ఆరు సీ-130 విమానాలు కరాచీకి వచ్చాయని, అవి ఆయుధాలు తీసుకొచ్చాయని వార్తలొచ్చాయి. కానీ అవి ఇంధనం నింపడానికి మాత్రమే ఆగాయని టర్కీ చెప్పింది. టర్కీ, పాకిస్తాన్ సంబంధం 1954 నుంచి బలంగా ఉంది. కానీ భారత్‌తో వాణిజ్య సంబంధాల కారణంగా టర్కీ పాకిస్థాన్ కు బహిరంగ సైనిక సహకారానికి ముందుకు రాకపోవచ్చు.

చైనా, పాకిస్తాన్ మధ్య చాలా సంవత్సరాలుగా ధృడమైన సైనిక, రాజకీయ సంబంధం ఉంది. ఇది చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ తో మరింత బలపడింది. చైనా పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు, టైప్-054 యుద్ధ నౌకలు, హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్థాన్ కు చైనా ఇస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత చైనా పాకిస్తాన్‌కు రాజకీయంగా మద్దతిచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌తో మాట్లాడి, రెండు దేశాలు సంయమనం పాటించాలని చెప్పారు. ఇటీవల చైనా కన్సల్ జనరల్ ఝాఓ షిరెన్ లాహోర్‌లో పాకిస్తాన్‌కు చైనా ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కానీ శాంతి కోసం సంప్రదింపులు జరపాలని సూచించారు. తాజాగా చైనా 100కు పైగా పీఎల్-15 క్షిపణులను పాకిస్తాన్‌కు ఇచ్చినట్లు చెప్పినా, ఇది అధికారికంగా నిర్ధారణ కాలేదు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు చైనా తయారీ శాటిలైట్ ఫోన్‌లు, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు వాడినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. ఇది చైనాపై సందేహాలు లేవనెత్తింది. ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే, చైనా నేరుగా యుద్ధంలో పాల్గొనే అవకాశం తక్కువ. ఎందుకంటే భారత్‌తో ఆర్థిక సంబంధాలు డ్రాగెన్ కంట్రీకి ముఖ్యం. కానీ చైనా ఆయుధ సరఫరా, సాంకేతిక సహకారం, రాజకీయ మద్దతు ద్వారా పాకిస్తాన్‌కు అండగా నిలవవచ్చే అని అంటున్నారు. చైనా హిమాలయాల్లో సైనిక విన్యాసాలు చేసి భారత్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కానీ యుద్ధం చేసే ఛాన్స్ తక్కువ.

ఇక భారత్ స్నేహితుల విషయానికి వస్తే.. భారత్‌కు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలు మద్దతిస్తాయి. అమెరికాతో భారత్‌కు వ్యూహాత్మక సంబంధం ఉంది. క్వాడ్ కూటమి ద్వారా చైనా ప్రభావాన్ని అడ్డుకోవడంలో కలిసి పనిచేస్తాయి. అమెరికా గూఢచర్య సమాచారం, రక్షణ సామగ్రి ఇస్తుంది. రష్యా చాలా సంవత్సరాలుగా భారత్‌కు సైనిక సరఫరాదారు, ఎస్-400 రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలు ఇస్తోంది. 1971 యుద్ధంలో రష్యా భారత్‌కు అండగా నిలిచింది. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, జలాంతర్గాములు ఇచ్చి సైనిక సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్ డ్రోన్‌లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, సైబర్ భద్రతలో భారత్‌కు సాయం చేస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ ద్వారా భారత్‌తో ఇండో-పసిఫిక్ భద్రత కోసం కలిసి పనిచేస్తాయి. సౌదీ అరేబియా, యూఏఈ ఆర్థిక, శక్తి సహకారం, ఉగ్రవాదంపై భారత్ వైఖరికి మద్దతిస్తున్నాయి. భారత్ ఆర్థిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం, ఉగ్రవాదంపై గట్టి వైఖరి, ఇండో-పసిఫిక్‌లో వ్యూహాత్మక పాత్ర వంటి కారణాలతో ఈ దేశాలు భారత్ కు మద్దతు ఇస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే, ఈ దేశాలు భారత్‌కు సైనిక సామగ్రి, గూఢచర్య సమాచారం, రాజకీయ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే రెండు దేశాల బలబలాలు, ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే.. భారత్ పాకిస్థాన్ కంటే చాలా ముందుంది. పైకి పాకిస్థాన్ దేనికైనా సిద్ధమనే పరిస్థితిలో ఉన్నా.. యుద్ధం వస్తే చేతులు ఎత్తేసే చాన్సులు ఎక్కువ అంటున్నారు.