బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం దారుణాలు.. కొత్త చట్టంతో మానవ హక్కుల ఉల్లంఘన..!!

పాకిస్థాన్ కు పక్కలో బల్లెంలా తయారైన బలూచిస్థాన్ ఆర్మీని అణచివేయడానికి.. అక్కడ తిరుగుబాటును అణగదొక్కడానికి కొత్త దారులు వెతుకుతోంది. బలూచిస్థాన్ ప్రాంతంలో కొత్త కౌంటర్-టెర్రరిజం చట్టం అమల్లోకి వచ్చింది కూడా దీని కోసమే అంటున్నారు. ఈ చట్టం ఎవరినైనా ఎలాంటి ఆధారాలు లేకుండా 90 రోజుల పాటు నిర్బంధించే అధికారాన్ని పాక్ సైన్యానికి ఇస్తుంది. దీనిపై మానవ హక్కుల సంస్థలు, స్థానిక బలూచ్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ చట్టం గురించి బలూచ్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు..?. అసలు బలూచిస్థాన్ సమస్య ఏమిటి? బలూచ్ ప్రజలు పాకిస్థాన్ నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? పాక్ సైన్యం ఎలాంటి దారుణాలకు పాల్పడుతోంది? బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలాంటి తిరుగుబాటు చేస్తోంది?

పాకిస్థాన్ తో మొదటి నుంచి కలిసి ఉండటానికి ఇష్టపడని బలూచిస్థాన్ ప్రజలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. బలూచిస్థాన్ పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతం, కానీ జనాభా చాలా తక్కువ. గ్వాదర్ ఓడరేవు, బంగారం, సహజ వాయువు, రాగి వంటి సహజ వనరులతో ఈ ప్రాంతం సమృద్ధిగా ఉంది. అయితే, ఈ వనరుల నుంచి స్థానిక బలూచ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 1948లో పాకిస్థాన్ బలూచిస్థాన్‌ను బలవంతంగా ఆక్రమించిందని,
అప్పటి నుంచి స్థానికులను అణచివేస్తూ, వారి వనరులను దోచుకుంటోందని బలూచ్ ప్రజలు చెబుతున్నారు. ఈ అసంతృప్తి కారణంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ సంస్థలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ సైన్యంతో బలూచ్ ఆర్మీ పోరాడుతోంది. ఈ ఏడాది మార్చిలో BLA జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి, 450 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకుంది. ఈ ఘటనలో 214 మంది పాక్ సైనికులను చంపినట్టు BLA ప్రకటించింది, అయితే పాక్ సైన్యం 33 మంది తిరుగుబాటుదారులను చంపినట్టు చెప్పింది. మే 2025లో BLA 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసింది, సైనిక వాహనాలు, మొబైల్ టవర్లు, రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేసింది. ఈ దాడుల ద్వారా బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్ర డిమాండ్‌ను ప్రపంచానికి చాటాలని చూస్తున్నారు. బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ మే 2025లో బలూచిస్థాన్ స్వాతంత్య్రాన్ని ప్రకటించి, భారత్‌లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ తిరుగుబాటు పాక్ సైన్యాన్ని కలవరపరిచింది, దీంతో వారు కొత్త చట్టాన్ని తెచ్చారు.

జూన్ 4న బలూచిస్థాన్ అసెంబ్లీ కౌంటర్-టెర్రరిజం యాక్ట్ 2025ను ఆమోదించింది. ఈ చట్టం పాక్ సైన్యానికి, భద్రతా బలగాలకు బలూచిస్థాన్ లో ఎవరినైనా ఎలాంటి ఆధారాలు లేకుండా 90 రోజుల పాటు నిర్బంధించే అధికారం ఇస్తుంది. ఈ చట్టం ద్వారా విస్తృత నిఘా, సామూహిక అరెస్టులు, బలవంతంగా అదృశ్యం చేయడం వంటి చర్యలు చట్టబద్ధం అవుతాయని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం ప్రజల స్వేచ్ఛ, న్యాయవిచారణ హక్కు, అక్రమ అరెస్టుల నుంచి రక్షణ వంటి ప్రాథమిక హక్కులను హరిస్తుందని HRCP విమర్శించింది. ఈ చట్టం వల్ల స్థానిక బలూచ్ ప్రజలు నిత్యం భయం మధ్య జీవించాల్సి వస్తుంది. ఇప్పటికే బలూచిస్థాన్‌లో అక్రమ అరెస్టులు, హింస, బలవంతంగా అదృశ్యం చేయడం సర్వసాధారణం. ఈ చట్టం ఈ దారుణాలను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ చట్టం అమలు తర్వాత గ్వాదర్, క్వెట్టా వంటి ప్రాంతాల్లో సైన్యం ఇంటింటి తనిఖీలు, అక్రమ డిటెన్షన్లను పెంచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చట్టం స్థానిక ఉద్యమాలను అణచివేయడానికి, తిరుగుబాటును నియంత్రించడానికి ఉద్దేశించినప్పటికీ, ఇది బలూచ్ ప్రజల ఆగ్రహాన్ని మరింత రెచ్చగొడుతోంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని కోరుతున్నాయి.

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం దశాబ్దాలుగా బలూచ్ ప్రజలపై దారుణాలకు పాల్పడుతోంది. బలవంతంగా అదృశ్యం చేయడం, అక్రమ అరెస్టులు, హత్యలు, హింస, గ్రామాలపై దాడులు సర్వసాధారణంగా మారాయి. ఇటీవల ఓ బలూచ్ జర్నలిస్ట్ ను అతని ఇంట్లో, భార్య, పిల్లల ముందు కాల్చి చంపారు. అతను మానవ హక్కుల ఉల్లంఘనలు, సైనిక దాడులపై వార్తను నిర్భయంగా రాసినందుకు చంపేశారు. ఇలాంటి హత్యలు బలూచిస్థాన్‌లో కొత్త కాదు. గత 15-20 సంవత్సరాలుగా వేలాది మంది బలూచ్ కార్యకర్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు అదృశ్యమయ్యారు. కొంతమంది హత్యకు గురయ్యారు. స్వాతంత్య్రం, తమ సహజ వనరులపై పూర్తి నియంత్రణ, పాకిస్థాన్ నుంచి విడిపోవడం బలూచ్ ప్రజల ప్రధాన డిమాండ్లు. వారు గ్వాదర్ ఓడరేవు, సహజ వాయువు, ఖనిజాల నుంచి లభించే ఆదాయం పాక్ ప్రభుత్వం, చైనా సంస్థలకు వెళ్తోందని ఆరోపిస్తున్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు స్థానికులకు ఉపాధి, అభివృద్ధి కల్పించలేదని, బదులుగా వారి భూములను కబ్జా చేస్తున్నారని బలూచ్ నాయకులు చెబుతున్నారు. ఈ దోపడినే తమ స్వాతంత్య్ర ఉద్యమానికి కారణమని చెబుతున్నారు. బలూచ్ ప్రజలు తమ సంస్కృతి, భాష, గుర్తింపును కాపాడుకోవాలని, పాక్ అణచివేత నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు.

బలూచిస్థాన్‌లోని అశాంతికి పాకిస్థాన్ భారత్‌ను నిందిస్తోంది. ఇటీవల ఖుజ్దార్‌లో స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మరణించారని.. 38 మంది గాయపడ్డారని పాక్ చెబుతోంది. భారత్ ఈ ఆరోపణలను నిరాధారం అని తోసిపుచ్చింది. పాకిస్థాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి భారత్‌ను నిందిస్తోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. బలూచిస్థాన్‌లో అశాంతి కారణంగా భారత్‌ను నిందించడం పాక్ సైన్యానికి రెండో స్వభావంగా మారిందని భారత్ విమర్శించింది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అంతర్జాతీయంగా, బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, యామ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాయి. ఈ చట్టం బలూచ్ ప్రజలను మరింత భయాందోళనలోకి నెట్టి, తిరుగుబాటును మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలూచ్ నాయకులు భారత్, అమెరికా, ఐరోపా దేశాల నుంచి రాజకీయ, దౌత్యపరమైన మద్దతు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ దృష్టిని మరింత ఆకర్షించే అవకాశం ఉంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్ర పోరాటాన్ని ఆపేలా కనిపించడం లేదు. అదే సమయంలో పాక్ సైన్యం ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి మరింత బలాన్ని ప్రయోగించే సూచనలు కనిపిస్తున్నాయి.