
Pakistan Ships Banned: భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చే లేదా అక్కడికి వెళ్లే సరుకులను తీసుకువచ్చే నౌకలను భారత ఓడరేవుల్లోకి రాకుండా నిషేధించారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ కు ఎంత నష్టమో ఇప్పుడు అర్థమవుతోంది. భారత్ వ్యూహాత్మక నిర్ణయానికి పాకిస్థాన్ రవాణా వ్యవస్థ అతలాకుతలం అయిపోతోంది. రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోంది. అసలు ఈ నిర్ణయం పాకిస్థాన్ ను ఎలా దెబ్బకొట్టింది..? పాకిస్థాన్ షిప్పులు భారత్ కు రాకుండా అడ్డుకోవడం వల్లే ఉపయోగం ఏంటి..?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ పై కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. సింధూ నది జలాల ఒప్పందం రద్దుతో పాటు.. పాకిస్థాన్ నుంచి వచ్చే, అక్కడికి వెళ్లే నౌకలను భారత ఓడరేవుల్లోకి అనుమతించడం ఆపేసింది. ఈ నిషేధం పాకిస్థాన్ ను తీవ్రంగా దెబ్బతీసింది. దీని దెబ్బ ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ దిగుమతులు, ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద నౌకలు పాకిస్థాన్‌కు రావడం ఆగిపోయి, చిన్న ఫీడర్ నౌకలపై ఆధారపడాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా ఖర్చు, బీమా ఖర్చు గణనీయంగా పెరిగాయి. యూరప్, అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే కంటైనర్‌లకు కొన్ని కంపెనీలు ఒక్కో కంటైనర్‌కు 800 డాలర్ల అదనపు ఛార్జీ చేస్తున్నాయి. అలాగే రసాయనాలు, యంత్రాలు, టెక్స్‌టైల్ ముడిసరుకు వంటి కీలక దిగుమతులు ఆలస్యమవడంతో పాకిస్థాన్ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించే అవకాశం ఉంది. అయితే, ఎగుమతులపై ప్రభావం ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఈ ఆంక్షలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచే అవకాశం ఉందని అంటున్నారు. Pakistan Ships Banned.
ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్థాన్‌పై ఆర్థిక, దౌత్య ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ దాడిని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు నిర్వహించినట్లు భారత్ ఆరోపించింది. దీని ప్రతిస్పందనగా, మే 2 నుంచి పాకిస్థాన్ నుంచి వచ్చే లేదా అక్కడికి వెళ్లే సరుకులను తీసుకువచ్చే నౌకలను భారత ఓడరేవుల్లోకి అనుమతించడం ఆపివేశారు. ఈ నిషేధం భారత ఆస్తులు, సరుకులు, మౌలిక సదుపాయాల భద్రతను కాపాడటానికి, ఉగ్రవాద బెదిరింపులను అరికట్టడానికి విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్ కింద, భారత అధికారులు UAE ద్వారా రవాణా చేయబడిన 39 కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు, ఇవి కరాచీ నుంచి వచ్చినవని గుర్తించారు. 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌కు అత్యంత అనుకూల దేశ హోదాను రద్దు చేసి, 200 శాతం దిగుమతి సుంకం విధించింది. ఆ తర్వాత నౌకలపై ఈ నిషేధం మరో పెద్ద దెబ్బే అనాలి.
పాకిస్థాన్‌కు వెళ్లే నౌకలు భారత ఓడరేవులను ఉపయోగించడానికి ప్రధాన కారణం భారత్ భౌగోళిక స్థానం, ఓడరేవుల సామర్థ్యం. భారత్‌లోని ముంబై, ముంద్రా వంటి ఓడరేవులు దక్షిణాసియాలో ప్రధాన షిప్పింగ్ హబ్‌లుగా ఉన్నాయి. ఈ ఓడరేవులు యూరప్, అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే పెద్ద నౌకలకు షిప్‌మెంట్ కేంద్రాలుగా పనిచేస్తాయి. పాకిస్థాన్‌లోని కరాచీ, పోర్ట్ కాసిమ్ ఓడరేవుల సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, చాలా సరుకులు భారత ఓడరేవుల ద్వారా రవాణా చేయబడతాయి. పాకిస్థాన్ సరుకులు సింగపూర్, కొలంబో, UAEలోని ఓడరేవు ద్వారా ట్రాన్స్‌షిప్ చేయబడతాయి, కానీ భారత ఓడరేవులు ఈ రూట్‌లో అత్యంత సమర్థవంతమైనవి. భారత నిషేధం వల్ల, నౌకలు భారత్‌ను దాటి ఇతర ఓడరేవులకు వెళ్లాల్సి రావడంతో రవాణా సమయం, ఖర్చు పెరిగాయి. ఈ ఆంక్షలు నౌకలు భారత్ లేదా పాకిస్థాన్‌లో ఒక దేశాన్ని ఎంచుకోవాల్సి రావడంతో, చాలా నౌకలు భారత్‌ను ఎంచుకుంటున్నాయి, ఎందుకంటే 70 శాతం సరుకులు భారత్‌కు సంబంధించినవి. దీని వల్ల పాకిస్థాన్‌కు రవాణా సామర్థ్యం తగ్గిపోయింది.
భారత్ నిషేధం వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో తీవ్ర నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంది. రవాణా ఖర్చు, బీమా ఖర్చు పెరగడం వల్ల పాకిస్థాన్ దిగుమతి భారం గణనీయంగా పెరుగనుంది. రసాయనాలు, యంత్రాలు, టెక్స్‌టైల్ ముడిసరుకులు వంటి కీలక దిగుమతులు ఆలస్యమవడం వల్ల పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. అటు పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి, ఈ ఆంక్షలు వాటిని మరింత క్షీణింపజేస్తున్నాయి. అయితే ఎగుమతులపై ప్రస్తుతం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో యూరప్, అమెరికా వంటి మార్కెట్లకు సరుకుల రవాణా ఖర్చు పెరగడం వల్ల పాకిస్థాన్ ఎగుమతులు పోటీతత్వాన్ని కోల్పోతాయి. సింగపూర్, కొలంబో, UAE వంటి ఇతర ఓడరేవులపై ఆధారపడటం వల్ల రవాణా సమయం, ఖర్చు పెరగడంతో పాకిస్థాన్ సప్లై చైన్ బలహీనపడుతుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం, భారత్‌తో అనధికారిక వాణిజ్యం సంవత్సరానికి 10 బిలియన్ డాలర్లు ఉన్నప్పటికీ, ఈ నిషేధం దాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఆర్థిక ఒత్తిడి పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అటు సింధూ నది జలాల ఒప్పందం రద్దు కూడా పాకిస్థాన్ కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్థాన్ వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి సింధూ నదీ జలాలపై 80 శాతం ఆధారపడుతుంది. నీటి సరఫరా తగ్గితే, పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది, ఆహార ధరలు పెరుగుతాయి. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల విద్యుత్ కొరత పెరిగి, పరిశ్రమలు దెబ్బతింటాయి. ఒక వేళ భారత్ సింధూ జలాలను పూర్తిగా దారి మళ్లిస్తే పాకిస్థాన్ లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ నదీ జలాల విషయంలో ఇప్పటికే పాకిస్థాన్ లోని సింధ్, పంజాబ్ ప్రావిన్స్ ల మధ్య విబేధాలు ఉన్నాయి. నీటి కోసం గొడవలు జరుగుతున్నాయి.. ఇప్పుడు భారత్ నిర్ణయంతో అక్కడ ఈ గొడవలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు నీటి ప్రాజెక్టులు నిలిచిపోనున్నాయి.
Also Read: https://www.mega9tv.com/national/why-dk-shivakumars-name-being-heard-as-the-new-cm-of-karnataka/