రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాకిస్థాన్.. భారత్ కు పాకిస్థాన్ కు తేడా ఏంటి..?

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ కు భారత్ అంటే ఏంటో తెలిసొచ్చింది. భారత్ రక్షణ సాంకేతికత, లెటెస్ట్ వెపెన్స్ పాకిస్థాన్ కు చుక్కలు చూపించాయి. దీంతో భారత్ రక్షణ సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది దాయాది దేశం. అయితే దీని కోసం ఈ ఏడాది రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచాలని చూస్తోంది. బడ్జెట్ లో 20 శాతం రక్షణ రంగానికే కేటాయించాలని భావిస్తోంది. అయితే ఇది ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులతో కూడుకున్న అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు పాకిస్థాన్ కు అంత సీన్ ఉందా..? రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తే.. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి..? అసలు రక్షణ బడ్జెట్ విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య తేడా ఏంటి..? ఏ దేశం ఎంత కేటాయిస్తోంది..?

మొదటి నుంచి పాకిస్థాన్ తన దేశ ప్రజల మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధి కంటే భారత్ పై పగతో రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అయితే పైకి సైనిక అవసరాల కోసం నిధులని చెప్పి.. ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచి పోషిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ కు చావు దెబ్బ తగిలింది. సైనిక శక్తి విషయంలో తాను ఎక్కడ ఉందో అర్థమైంది. దీంతో రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చూస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రక్షణ రంగానికి నిధులను దాదాపు 20% పెంచాలని భావిస్తోంది. అంటే సైన్యానికి 2,550 బిలియన్ పాకిస్థానీ రూపాయలు కేటాయించనుంది. ఇది ఇప్పటి వరకు పెంచిన మొత్తంలో చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ ఇదే సమయంలో పాకిస్థాన్ ఇప్పటివరకూ చూడని అప్పుల భారంతో కూడా సతమతమవుతోంది. IMF లాంటి సంస్థల నుంచి వచ్చే నిధులను పాకిస్థాన్ ఎలా ఉపయోగించుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రక్షణ రంగానికి 2,550 బిలియన్ రూపాయలు కేటాయింపు అంటే. అప్పులపై వడ్డీ చెల్లింపుల తర్వాత రెండో అతిపెద్ద ఖర్చు కింద లెక్క. పాకిస్థాన్ ఆర్థిక సర్వే ప్రకారం, 2025 మార్చి నాటికి ఆ దేశ అప్పు 76 వేల బిలియన్ రూపాయలకు చేరింది. ఇది గత నాలుగేళ్లలో రెట్టింపు అయ్యింది. పాకిస్థాన్ లోని వ్యవసాయ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆర్థిక సర్వే చెబుతోంది. ఈ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 6.4% ఉండగా.. ఇప్పుడు 0.56% వృద్ధికి పడిపోయింది. ఇండస్ నీటి బేసిన్‌లో నీటి కొరత వల్ల ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇలాంటి ఆర్థిక సమస్యల మధ్యలోనే పాకిస్థాన్ తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచడం గమనార్హం. అయితే ఈ నిధులను సైనిక అవసరాల పేరుతో ఉగ్రవాదులకు పాకిస్థాన్ బదిలీ చేస్తుందనే మాటా వినిపిస్తోంది. పాకిస్థాన్ సీనియర్ నాయకురాలు, పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహమాన్, పాకిస్థాన్ గతంలో ఉగ్రవాద గ్రూపులతో ఉన్న సంబంధాలను పరోక్షంగా ఒప్పుకున్నారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై రెహమాన్ మాట్లాడుతూ, గతంలో ఉగ్రవాదంతో సంబంధాలు నిజమే అని ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఉగ్రవాదంతో పోరాడుతున్నామని చెబుతున్నారు. 26/11 ముంబై దాడుల కీలక కుట్రదారు సాజిద్ మీర్‌ను కొన్ని సంవత్సరాలపాటు పాకిస్థాన్ కాపాడింది. ఆ తర్వాతే అరెస్టు చేసిన విషయాన్ని షెర్రీ రెహమాన్ అంగీకరించారు. పైగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియలకు సైనికులు హాజరయ్యారు. ఇది పాకిస్థాన్ ఉగ్రవాదులకు నేరుగా మద్దతు ఇస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ .. ఈ నేపథ్యంలో ఇప్పుడు రక్షణ బడ్జెట్ పేరుతో ఆ నిధులను ఉగ్రవాదులకు పాకిస్థాన్ అందిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు భారత్ కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. తాజా సమాచారం ప్రకారం, భారత్ రక్షణ బడ్జెట్ సుమారు 6.8 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 1.8 లక్షల కోట్లు ఆయుధాలు, సాంకేతికత, ఆధునీకరణకు కేటాయించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, చైనా, పాకిస్థాన్ నుంచి వచ్చే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరో 50 వేల కోట్ల అదనపు కేటాయింపులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో భారత్ రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటవచ్చు. 2024లో భారత్ రక్షణ ఖర్చు పాకిస్థాన్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. భారత్ సైన్యం గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్‌లో 4వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 12వ స్థానంలో ఉంది. భారత్ రక్షణ బడ్జెట్‌లో ఆధునీకరణ, సరిహద్దు రక్షణ, సైబర్ సెక్యూరిటీ, విమానాలు, క్షిపణులపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.

పాకిస్థాన్, భారత్ రక్షణ బడ్జెట్‌ల మధ్య భారీ తేడా ఉంది. పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ 7.5 బిలియన్ డాలర్లు కాగా, భారత్ బడ్జెట్ దాదాపు 90 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. అంటే భారత రక్షణ బడ్జెట్ దాదాపు 12 రెట్లు ఎక్కువ. పాకిస్థాన్ సైనికుడిపై సగటున సంవత్సరానికి 11,000 డాలర్లు ఖర్చు చేస్తుండగా, భారత్ సైనికుడిపై 50,000 డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ తేడా రెండు దేశాల ఆర్థిక స్థితులను కూడా ప్రతిబింబిస్తుంది. భారత్ జీడీపీ 2024-25లో 7.3% వృద్ధి అంచనా వేయబడింది, ఇది ఆర్థికంగా బలంగా ఉందని చూపిస్తుంది. దీనికి విరుద్ధంగా, పాకిస్థాన్ ఆర్థిక సర్వే వ్యవసాయ రంగం 0.56%కి పడిపోయిందని, నీటి కొరత, భారీ అప్పులతో దేశం సతమతమవుతోందని చెప్తోంది. భారత్ రక్షణ ఖర్చులో ఎక్కువ భాగం ఆధునీక ఆయుధాలు, సాంకేతికత, సరిహద్దు రక్షణ కోసం వెళ్తుండగా, పాకిస్థాన్ బడ్జెట్ అప్పుల భారంతో పరిమితమై, ఆర్థిక సంక్షోభంలోనూ రక్షణ ఖర్చులను పెంచడం గమనార్హం.

రెండు దేశాల రక్షణ బడ్జెట్‌ల పెరుగుదల వెనుక కాశ్మీర్ వివాదం, ఉగ్రవాద దాడుల నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో 26 మంది పర్యాటకులను చంపిన దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది, దీనికి పాకిస్థాన్ ప్రతీకార దాడులతో స్పందించింది. ఈ ఉద్రిక్తతలు రెండు దేశాల రక్షణ ఖర్చులను పెంచాయి. భారత్ బడ్జెట్‌లో ఆధునీకరణ, సైబర్ రక్షణ, వైమానిక దళాలపై దృష్టి ఉండగా, పాకిస్థాన్ బడ్జెట్ ఆర్థిక సంక్షోభం మధ్య కూడా సైనిక బలోపేతంపై దృష్టి పెట్టింది. భారత్ ఆర్థిక బలం, పెద్ద సైన్యం, ఆధునిక సాంకేతికతతో పాకిస్థాన్ కంటే బలంగా ఉంది, కానీ పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపులతో గత సంబంధాలు, ప్రస్తుత రక్షణ ఖర్చు పెంపు అంతర్జాతీయంగా విమర్శలను రేకెత్తిస్తోంది. ఈ రెండు దేశాల రక్షణ బడ్జెట్‌ల తేడాలు, వాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత స్పష్టం చేస్తున్నాయి.