
బిచ్చగాడు సినిమాలో హీరో తల్లి ఆరోగ్యం కోసం మారువేషంలో ఆలయాల వద్ద ఆడుక్కుంటూ ఉంటాడు. పాకిస్థాన్ కు చెందిన చాలా మంది .. విదేశాలకు వెళ్లి అక్కడ బిచ్చమెత్తుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. అయితే ఏ తల్లి కోసమే.. చెల్లి కోసమో కాదు.. పాకిస్థాన్ దుర్భరమైన ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం నుంచి తప్పించుకోవడం కోసం వీరు అడుక్కుంటున్నారు. పాకిస్థాన్ బిచ్చగాళ్ల సమస్యల ఎంతలా పెరిగిపోయిందంటే.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరి కొన్ని దేశాలు పాకిస్థాన్ బిచ్చగాళ్లను వారి దేశానికి పంపిస్తున్నాయి. ఇంతకీ పాకిస్థాన్ కు చెందిన వారే ప్రపంచ దేశాల్లో ఎక్కువగా బిచ్చగాళ్లుగా ఎందుకు మారుతున్నారు. ? ఇప్పుడు పాకిస్థాన్ బిచ్చగాళ్ల చూపు అరబ్ దేశాల నుంచి జపాన్ వైపు ఎందుకు పడింది..? తమ బిచ్చగాళ్లపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..?
భారత్ ను తిడితే చాలా పాకిస్థాన్ లో చాలా మందికి కడుపునిండిపోతుంది. ఓ వైపు పేదరికంలో మగ్గుతూ.. ఉపాధి లేక అడుక్కునే పరిస్థితికి వచ్చినా.. భారత్ పై మాత్రం కుళ్లు కక్కాల్సిందే. ఇదే పాకిస్థాన్ జనానికి ఆ దేశ పాలకులు అలవాటు చేశారు. వారిని పేదరికంలో పడేసి.. భారత పై మనమే పైచేయి సాధించామనే నాలుగు మాటలు చెబితే చాలు.. వాటిని విన్న జనం.. అకలిని మర్చి సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి తర్వాత పరిస్థితి.. ఉపాధి ఉండదు.. వ్యాపారమూ కదరుదు.. ఇంక వేరే మార్గం ఏ ముంది అడుక్కోవడమే. అయితే పాకిస్థాన్ లో అడుక్కుంటే ఏం లాభం.. ఇప్పటికే ఆ దేశం బికారిగా మారి.. ప్రపంచ దేశాల ముందు చేయిజాచింది. అందుకే పాకిస్థాన్ బిచ్చగాళ్లు ఇతర దేశాల బాట పడుతున్నారు. కరెన్సీ విలువ ఎక్కుగా ఉండి.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ఎక్కువ ఆదాయం వచ్చే దేశాలకు వైపు పాక్ బిచ్చగాళ్లు వలస వెళ్లిపోతున్నారు. కొన్ని దేశాలు వీరిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే.. మరికొన్ని దేశాలు వెనక్కు పంపుతున్నాయి. మరికొన్ని దేశాలతో అసలు పాకిస్థాన్ లు ఎవరైనా వస్తే బిచ్చం ఎత్తుకోవడానికేమోనని వీసాలు కూడా ఇవ్వడం లేదు.
తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారు.. అని దాదాపు మూడేళ్ల క్రితం ప్రస్తుత పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతం బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్ అపకీర్తిని పొందింది. తాజాగా సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు చెందిన 5,033 మంది పాక్ బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల ఆ దేశ పార్లమెంట్ లో వెల్లడించించారు. ఇక 2024 జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను కలుపుకుటే ఇది 5,402కు చేరుతుంది. వీరిని సాగనంపిన వారిలో సౌదీతోపాటు.. ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ ఉన్నాయి. ఈ మొత్తంలో సింధి ప్రావిన్స్‌కు చెందినవారు 2,795 మంది, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1,437, కేపీ నుంచి 1,002, బలోచిస్థాన్ 125, పీవోకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారు. విదేశాల్లో అరెస్టు అవుతున్న 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌కు చెందినవారే. చాలామంది యాత్రికుల వీసాలను తీసుకుని సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్లి అడుక్కుంటున్నారు.
పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్లు ఇతర దేశాలకు వెళ్లి భిక్షాటన చేయడం ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సమస్యగా మారింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, ఒమన్, ఖతర్, మలేసియా వంటి ముస్లిం దేశాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దేశాలలో మతపరమైన యాత్రల పేరుతో ఉమ్రా లేదా హజ్ వీసాలపై వచ్చే పాకిస్తానీలు, తిరిగి స్వదేశానికి వెళ్లకుండా భిక్షాటన చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని మక్కా వంటి పవిత్ర ప్రదేశాలలో జేబుదొంగతనాలు, భిక్షాటన కారణంగా స్థానిక జైళ్లు నిండిపోతున్నాయంట. ఈ సమస్య వల్ల ఆయా దేశాలు పాకిస్తానీ వీసా దరఖాస్తులపై కఠిన నిబంధనలను విధిస్తున్నాయి. దీని వల్ల ఇది పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా ప్రతిష్ట దెబ్బతింటోందని ఆ దేశ నేతలు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం, పేదరికం, ఆరోగ్య సమస్యలు బిచ్చగాళ్లు విదేశాలకు వెళ్లడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, ఉద్యోగ అవకాశాల కొరత, సక్రమంగా లేని ఆరోగ్య వ్యవస్థ వల్ల ప్రజలు జీవనోపాధి కోసం ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బిచ్చగాళ్లు వీసాలపై సౌదీ అరేబియా వంటి ధనిక దేశాలకు వెళుతున్నారు, ఎందుకంటే అక్కడ భిక్షాటన ద్వారా పాకిస్తాన్‌లో కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చని వారు భావిస్తున్నారు. 2024లో సౌదీ అరేబియాలో గుర్తించిన బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్తానీలేనని తేలింది.
అరబ్ దేశాలతో పాటు ఇటీవలి కాలంలో జపాన్‌లో కూడా పాకిస్తానీ బిచ్చగాళ్ల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. జపాన్‌లో భిక్షాటన చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే జపాన్‌లో జీవన వ్యయం అధికంగా ఉన్నప్పటికీ, దాతృత్వం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పాకిస్తాన్ సెనేట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఓవర్సీస్ పాకిస్తానీస్ నివేదిక ప్రకారం.. విదేశాలలో అరెస్టు చేయబడిన బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్తానీలే ఉంటున్నారు. గతంలో సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈకి ఎక్కువ వెళ్తే.. ఇప్పుడు జపాన్ కూడా కొత్త గమ్యస్థానంగా మారిందని స్వయంగా పాకిస్ధాన్ లెక్కలే చెబుతున్నాయి. జపాన్‌లోని పెద్ద నగరాలైన టోక్యో, ఒసాకా, సైతామా వంటి ప్రాంతాల్లో విదేశీయులు ఎక్కువగా ఉంటారు. దీంతో పాక్ బిచ్చగాళ్లు కూడా అక్కడికే వెళ్తున్నారు. పాకిస్తానీ బిచ్చగాళ్లు జపాన్‌కు వెళ్లడానికి ప్రధాన కారణం ఆర్థిక అవకాశాలు. 1980లలో జపాన్ అసాధారణ కార్మికులకు అధిక వేతనాలను అందించినప్పుడు, కరాచీ వంటి నగరాల్లో జపాన్ ఉపాధి సంస్థలు ప్రకటనలు ఇచ్చేవి. ఇది పాకిస్తానీలను జపాన్ వైపు ఆకర్షించింది. అయితే, జపాన్ వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత, కొందరు అనధికార మార్గాల ద్వారా జపాన్ కు వెళ్తున్నారు. మరోవైపు జపాన్‌లో భిక్షాటనకు సంబంధించిన చట్టాలు కఠినంగా లేవు, స్థానికుల దాతృత్వ స్వభావం కూడా పాకిస్థాన్ బిచ్చగాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ బిచ్చగాళ్లను స్వదేశానికి తిరిగి పంపడంలో ఆయా దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. తరచూ అనధికార మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించడం, గుర్తింపు పత్రాలు లేకపోవడం, స్థానిక చట్టాలను ఉల్లంఘించడం వల్ల డిపోర్టేషన్ ప్రక్రియ కష్టంగా మారుతోంది.
అసలు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ బిచ్చగాళ్ల సంఖ్య పెరగడానికి కారణం ఏంటి..? దీనికి ఆ దేశ పాలకులు చేసిన పాపాలు ఏంటి.. ? ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉపాధి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దీనికి ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, మౌలిక సదుపాయాల కొరత ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2023లో పాకిస్తాన్‌లో నిరుద్యోగ రేటు 5.5%గా నమోదైంది. దేశ జనాభాలో 60% కంటే ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వయస్సు గలవారు, కానీ వీరికి సరైన ఉపాధి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో, 46% మంది ప్రజలు పేదరికం, స్వచ్ఛమైన నీరు, ఆహారం లేకపోవడం వల్ల జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళుతున్నారు. ఉపాధి కల్పన వైఫల్యం వల్ల పాకిస్తాన్‌లో పేదరికం ఎక్కువై, సామాజిక అస్థిరత పెరుగుతోంది. యువతలో నిరాశ నెలకొనడం, విదేశాలకు అనధికార వలసలు పెరగడం ముమూలైపోయింది. జపాన్‌లో పాకిస్తానీ బిచ్చగాళ్ల సంఖ్య పెరగడానికి ఈ ఆర్థిక దురవస్థ ఒక కీలక కారణం. జపాన్‌లో భిక్షాటన ద్వారా రోజువారీ ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల, చాలా మంది అక్కడికి వెళుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మాణాత్మక సంస్కరణలు, విద్యా నైపుణ్య శిక్షణ, వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది, కానీ రాజకీయ సంక్షోభం అప్పుల భారం వల్ల ఈ ప్రయత్నాలు ఫలించడం లేదు. అటు ఇతర దేశాలతో పాటు పాకిస్థాన్ లో బిచ్చగాళ్ల సంఖ్య తక్కువేం కాదు. పాకిస్థాన్ లో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు సమాచారం. వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్థానీ రూపాయిలు అని అంటున్నారు. కొందరైతే ఉపాధి లేక బిచ్చం ఎత్తుకోవడమే మేలని అనుకుంటున్నారు. పాకిస్థాన్ పాలకులు మాత్రం ఈ సమస్యలను కప్పిపుచ్చుకుని.. ఆదాయాన్ని, అప్పులను ఉగ్రవాదులకు.. సైనికులకు తరలిస్తోంది. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.