విమానయానం భయం.. భయం..!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన తర్వాత, విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువవుతుండటంతో ఈ భయం మరింత పెరిగింది. ఈ ఘటనలు కేవలం యాదృచ్ఛికమా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? బోయింగ్ విమానాల్లోనే ఎక్కువ సమస్యలు ఎందుకు వస్తున్నాయి?

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది. టీవీల్లో, సోషల్ మీడియాలో విమాన ప్రమాదానికి సంబంధించి వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన ప్రయాణికులు విమాన ప్రయాణమంటేనే భయడపతున్నారు. విమానం ఎక్కాలంటే జంకుతున్నారు. వీటికి తోడు ఇటీవల పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు, కొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువై, ప్రయాణికుల ఆందోళనను మరింత పెంచాయి.

అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత కొన్ని వరుస ఘటనలు ప్రయాణికులను ఆందోళకు గురిచేస్తున్నాయి. తాజాగా హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా మళ్లీ హాంగ్‌కాంగ్‌కు వెనక్కి వెళ్లిపోయింది. లండన్ నుంచి చెన్నై వస్తున్న బ్రిటిష్ ఏర్‌వేస్ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చి, వెనక్కి తిరిగిపోయింది. లక్నో ఎయిర్‌పోర్టులో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన హజ్ ఫ్లైట్ చక్రాల నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయపడ్డారు. ఈ ఘటనలు వరుసగా జరుగుతుండటంతో ప్రయాణికులు విమాన ప్రయాణం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

విమానాల్లో సాంకేతిక సమస్యలకు తోడు, బాంబు బెదిరింపు కాల్స్ కూడా ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం రెండు గంటల ప్రయాణం తర్వాత బాంబు బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాకుండానే వెనక్కి వెళ్లిపోయింది. ఈ బెదిరింపులు నిజమైనవా, ఫేక్‌వా అనేది పక్కనపెడితే, ప్రయాణికుల మనసులో భయాన్ని నింపాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఈ బెదిరింపులు ఎక్కువవడంతో, విమాన రంగంలో సేఫ్టీ గురించి లోతటై చర్చ మొదలైంది. ఈ బెదిరింపులు, సాంకేతిక సమస్యలు కలిసి ప్రయాణికులను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.

వరుస ఘటనలు చాలామంది విమాన ప్రయాణం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. విమానం ఎక్కితే సేఫ్‌గా గమ్యాన్ని చేరగలమా అనే భయం పెరిగింది. ఈ భయాన్ని దూరం చేసేందుకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీలు ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని బోయింగ్ 787 విమానాలను తనిఖీ చేయమని ఆదేశించింది. ఎయిర్ ఇండియా 34 డ్రీమ్‌లైనర్‌లలో చాలా విమానాల తనిఖీ పూర్తయింది. ఇంజన్ ఫ్యూయెల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్, టేకాఫ్ సెట్టింగ్స్ లాంటివి జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు.

వరుసగా జరగుతున్న ఘటనలు యాదృచ్ఛికమా, లేక బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎక్కువగా బయటపడుతున్నాయా? అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమానాల సాంకేతిక సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరంటున్నారు. హాంగ్‌కాంగ్, లండన్, లక్నో ఘటనలు చిన్నవిగా ఉన్నా, ప్రయాణికుల భయాన్ని పెంచాయి. బాంబు బెదిరింపులు కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేశాయి. ఈ సమస్యలు కొత్తవైనా, పాతవైనా వాటిని సరిచేయాల్సిన బాధ్యత బోయింగ్ సంస్థపై ఉంది.

మరోవైపు ఎక్కువగా బోయింగ్ విమానాల్లోనే సాంకేతిక సమస్యలు రావడం ఆ సంస్థకు తలనొప్పిగా మారింది. అహ్మదాబాద్ కూడా కూలిపోయింది బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానమే. ఈ విమానం ఎక్కువ ఇంధనం ఆదా చేసేలా కొత్త టెక్నాలజీతో తయారైంది.. తేలికైన కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. కానీ గతంలో దీని బ్యాటరీలు వేడెక్కడం, వైరింగ్ సమస్యలు వంటి టెక్నికల్ సమస్యలు వచ్చాయి. 2013లో లిథియం-ఐయాన్ బ్యాటరీలు మంటలు చెలరేగడంతో కొన్ని నెలలు ఈ విమానాలను నిలిపివేశారు. 2021-2022లో ఫ్యూజ్‌లేజ్ గ్యాప్‌ల సమస్యల వల్ల డెలివరీలు ఆగిపోయాయి.

ఈ ఘటనలు బోయింగ్ కంపెనీపై ఒత్తిడిని పెంచాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బోయింగ్ షేర్లు 7.72% పడిపోయాయి. కంపెనీ సీఈవో కెల్లీ ఆర్ట్‌బర్గ్ ఈ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో జరిగిన రెండు క్రాష్‌లు కంపెనీ సేఫ్టీ కల్చర్‌పై పెద్ద ప్రశ్నలు లేపాయి. ఇప్పుడు 787 డ్రీమ్‌లైనర్‌ మోడల్ పై కూడా అదే ఆరోపణలు వస్తున్నాయి. విసిల్‌బ్లోవర్ జాన్ బార్నెట్ 2019లో, బోయింగ్ తయారీలో సేఫ్టీ స్టాండర్డ్స్ తగ్గాయని, దీని వల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఈ ఆరోపణలు అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత మళ్లీ వైరల్ అవుతన్నాయి.

అయితే ప్రస్తుత ఘటనలు ప్రయాణికులను ఆందోళనలో ముంచెత్తినా, విమాన రంగంలో సేఫ్టీ మెరుగుపరచడానికి కొన్ని మంచి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌లైన్స్, రెగ్యులేటరీ అథారిటీలు ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భారత్‌లోని అన్ని బోయింగ్ 787లను తనిఖీ చేస్తున్నారు. బాంబు బెదిరింపులపై సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులకు కూడా సేఫ్టీ గురించి ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమస్యలు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా, భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత సురక్షితం కావడానికి ఈ జాగ్రత్తలు దోహదపడతాయని ఆశిద్దాం.