
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన. అయితే ఈ పర్యటన చాలా కీలకమంటున్నారు నిపుణులు పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడతాయని అంటున్నారు. అలాగే పాకిస్థాన్ కు సహకరించిన టర్కీ లాంటి దేశాలను దారిలో పెట్టేందుకు ఈ పర్యటనల ద్వారా మోదీ వ్యూహరచన చేస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా సైప్రస్‌లో మోదీ పర్యటన చాలా కీలకమని.. ఇది టర్కీకు వెన్నులో వణుకు తెప్పించమే అని చెబుతున్నారు. అయితే ఎందుకు సైప్రస్ పర్యటన భారత్ కు అంత కీలకం..? సైప్రస్, టర్కీ మధ్య గొడవలేంటి..? టర్కీ-పాకిస్తాన్ ను ఎదుర్కోవడానికి భారత్ మెడిటరేనియన్ వ్యూహం ఫాలో అవ్వనుందా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించనున్నారు. ఇది ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన. సైప్రస్‌లో, మోడీ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తారు. కెనడాలో జరిగే G7 సదస్సులో, మోడీ గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను, ఉగ్రవాద వ్యతిరేక దృక్పథాన్ని బలంగా చెప్పనున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొంటున్నారు మోదీ. ఇది భారత్-కెనడా సంబంధాలను మెరుగుపరచడానికి చాలా కీలకం. క్రొయేషియాలో, ఆ దేశ అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్, ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెన్కోవిక్‌లతో మోడీ సమావేశమై, భారత్-క్రొయేషియా మధ్య సంబంధాలను బలపరుస్తారు. ఇది మోదీ తొలి క్రొయేషియా పర్యటన. ఈ పర్యటనల ద్వారా భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాలను బలోపేతం చేసుకోవడం.. టర్కీ-పాకిస్తాన్ ఐక్యతను ఎదుర్కోవడానికి దౌత్యపరమైన మద్దతు సాధించడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా సైప్రస్ దేశంలో ప్రధాని మోదీ పర్యటన చాలా కీలకమని చెబుతున్నారు. సైప్రస్, టర్కీ మధ్య దాదాపు 50 ఏళ్ళుగా సరిహద్దు వివాదం ఉంది. 1974లో టర్కీ దళాలు ఉత్తర సైప్రస్‌ను ఆక్రమించాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు డ్రోన్లు, ఆయుధాల రూపంలో సైనిక సహాయం చేసింది. దీంతో భారత్-టర్కీ సంబంధాలు మరింత దిగజారాయి. సైప్రస్ భారత్‌కు కాశ్మీర్ విషయంలో, సరిహద్దు ఉగ్రవాదం, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణలపై ఎప్పుడూ మద్దతు ఇస్తూ వస్తోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని సైప్రస్ ఖండించి, ఈయూ స్థాయిలో సరిహద్దు ఉగ్రవాద సమస్యను లేవనెత్తింది. 2026లో సైప్రస్ ఈయూ కౌన్సిల్ అధ్యక్షత బాధ్యతలను చేపట్టనుంది. ఇది భారత్-ఈయూ సహకారాన్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. పాకిస్థాన్, భారత్ కు మధ్య కశ్మీర్ విషయంలో టర్కీ వేలు పెట్టింది. ఇప్పుడు సైప్రస్ కు భారత్ దగ్గరవ్వడం ద్వారా టర్కీ పక్కలో బల్లెంగా భారత్ తయారయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు సైప్రస్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో కీలకంగా ఉంది. ఇది భారత్ కు తూర్పు మెడిటరేనియన్ సహజ వాయువు అన్వేషణలో భాగస్వామ్య అవకాశాలను అందిస్తుంది. ఈ పర్యటన టర్కీ-పాకిస్తాన్ దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారత్ వ్యూహాత్మక ఎత్తుగడ అనొచ్చు.
టర్కీ-పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన, సైనిక ఐక్యత భారత్‌కు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు సైనిక సహాయం చేసిన తర్వాత ఈ పెద్ద సమస్యగా మారింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీమద్దతు ఇవ్వడం, సైప్రస్‌లోని ఉత్తర భాగాన్ని ఆక్రమించడం, తూర్పు మెడిటరేనియన్‌లో వివాదాస్పద గ్యాస్ డ్రిల్లింగ్ చేయడం వంటివి సైప్రస్‌తో దాని వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. భారత్ సైప్రస్‌తో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా టర్కీ-పాకిస్తాన్ గ్రూప్‌కు దౌత్యపరమైన ఇబ్బందులను సృష్టించనుంది. సైప్రస్, గ్రీస్, ఆర్మేనియా వంటి టర్కీతో విభేదాలున్న దేశాలతో భారత్ సంబంధాలు బలపడుతున్నాయి. ఉదాహరణకు, గ్రీస్ ఆపరేషన్ సిందూర్ నుంచి రాఫెల్ జెట్ యుద్ధ డేటాను అధ్యయనం చేయడానికి భారత్‌తో సహకరిస్తోంది. సైప్రస్ భారత్‌కు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ సభ్యత్వం, ఇండియా-యూఎస్ న్యూక్లియర్ ఒప్పందంలో మద్దతు ఇచ్చింది.
అటు కెనడాలో జరిగే G7 సదస్సులో, ప్రధానమంత్రి మోడీ గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను, భారత్ ఉగ్రవాద వ్యతిరేక దృక్పథాన్ని బలంగా చెప్పనున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం కానున్నారు. G7 సదస్సు భారత్‌కు అంతర్జాతీయ దౌత్య వేదికగా చాలా కీలకం. ఇక్కడ భారత్ ఆర్థిక ప్రాముఖ్యతను, అంతర్జాతీయ సమస్యలపై మన పోరాటాన్ని మోదీ తెలియజేయనున్నారు. కెనడా ఆతిథ్యంలో ఈ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఖలిస్తానీ విషయంలో భారత్-కెనడా మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈ సమావేశం ఒక అవకాశం.
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని బయటపెట్టడానికి మోదీ G7 వేదికను ఉపయోగించుకోనున్నారు. మోడీ ఈ సదస్సులో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇచ్చే ప్రోత్సాహం, సరిహద్దు ఉగ్రవాదం ద్వారా భారత్‌పై చేస్తున్న దాడులను లేవనెత్తనున్నారు. ఉగ్రవాదంపై సమిష్టి చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలని G7 దేశాలను మోదీ కోరనున్నారు. ఇక భారత్-కెనడా సంబంధాలు గతంలో ఖలిస్తానీ విషయంలో ఉద్రిక్తతలతో బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలతో సంబంధలు దెబ్బతిన్నాయి. కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానంతో, మోడీ G7 సదస్సులో పాల్గొనడం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అవకాశం ఉంది. మోడీ-కార్నీ సమావేశం ద్వైపాక్షిక సమస్యలను చర్చించడానికి, ఖలిస్తానీ తీవ్రవాదంపై ఉమ్మడి దృక్పథాన్ని రూపొందించడానికి కీలకంగా మారనున్నాయి.
ఇక మోదీ భారత ప్రధానమంత్రి హోదాలో క్రొయేషియాకు మొదటి సారి వెళ్తున్నారు. క్రొయేషియా, ఈయూ సభ్య దేశంగా, భారత్ యూరోపియన్ విస్తరణకు కీలక భాగస్వామిగా ఉపయోగడపుంది. అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్, ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెన్కోవిక్‌లతో మోదీ చర్చలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తాయని భావిస్తున్నారు. మోదీ మూడు దేశాల పర్యటన ఈయూ సభ్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి, సైప్రస్ ఈయూ కౌన్సిల్ అధ్యక్షత సందర్భంగా భవిష్యత్ సహకారానికి ఒక పునాది వేస్తుందని భావిస్తున్నారు.