132 ఏళ్లకు నెరవేరిన ఆ రాజు కల..!

ఎత్తైన హిమాలయ శిఖరాలు…చీనాబ్ నది లోయ అందాలు…సుందరమైన ల్యాండ్‌స్కేప్‌లు…చుట్టూ ప్రకృతి అందాల నడుము అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్ ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తులో , ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు పెద్దగా 43,800 కోట్లతో నిర్మితమైన ఈ బ్రిడ్జిపై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఇండియన్ ప్రైడ్ గా చెబుతున్న ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతీయ రైల్వే చరిత్రలో ఇదో మైలురాయి. కాశ్మీర్‌ను భారత్‌లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలనే శతాబ్దాల కల సాకారమైంది. 132 ఏళ్ల క్రితం నాటి రాజు కలను మోదీ నెరవేర్చారు. ఎంతో విశిష్ఠతతో పాటు భారత ఇంజినీరింగ్ నైపుణ్యాలను రంగరించి నిర్మించిన ఈ చీనాబ్ బ్రిడ్జి ప్రారంభమైన సందర్భంగా మెగా9 టీవీ స్పెషల్ ఫోకస్

భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనం చీనాబ్ బ్రిడ్జ్. దేశవాసులు సగర్వంగా చెప్పుకునే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి ఆలోచనకు బీజం 132 ఏళ్ల క్రితం పడింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు.. దేశ విభజన జరగకముందు అప్పటి కాశ్మీర్ రాజు.. రాజా హరిసింగ్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ వంతెన. అది ఇన్నేళ్లకు పూర్తి అయింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ..ఈ రైలు మార్గానికి శ్రీకారం చుట్టారు. 50 కోట్ల వ్యయంతో మొదట ప్రాజెక్టును అంచనా వేశారు. అయితే ఈ బ్రిడ్జ్ పూర్తి కావడానికి 43,800 కోట్లు ఖర్చైంది.

జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్ విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం..19వ శతాబ్దంలో డోగ్రా మహారాజులు ఈ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అనంతరం కాశ్మీర్ లోయకు రైల్వే లైన్ ప్రాజెక్టు చేపట్టాలని మహారాజా ప్రతాప్ సింగ్ 1892లో ప్రతిపాదించారు. ఆ తర్వాత 1898 జూన్‌లో ఈ ప్రాజెక్ట్ ను సర్ చేసి నివేదిక ఇవ్వాలని బ్రిటీష్ ఇంజనీరింగ్ సంస్థ ఎస్ఆర్ స్కాట్ స్ట్రాటెన్ అండ్ కోకు రాజా బాధ్యతలు అప్పగించారు. కాశ్మీర్‌కు రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు ముగ్గురు బ్రిటీష్ ఇంజనీర్లను రాజా నియమించారు.

1898 నుంచి 1909 మధ్య అంటే 11 ఏళ్లలో ఈ ఇంజినీర్ల బృందం మూడు నివేదికలను సిద్ధిం చేసింది. అందులో రెండింటిని తిరస్కరించారు. ఇందులో డీఏ ఆడమ్ సమర్పించిన మొదటి నివేదిక.. జమ్మూ కాశ్మీర్ మధ్య ఎలక్ట్రిక్ రైల్వేను సిఫార్సు చేసింది. ఇది ఇరుకైన రెండున్నర అడుగుల గేజ్ లైన్‌లో స్టీమ్ లోకోమోటివ్‌లను కలిగి ఉంది. అయితే ఇది సవాలుతో కూడుకున్నది కావడంతో దీనిని రాజా తిరస్కరించారు. అనంతరం 1902లో డబ్ల్యూ జే వెయిట్‌మన్ మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న జీలం నది నుంచి కాశ్మీర్‌ను కలిపే రైల్వే లైన్‌ను సూచించింది. ఈ ప్రతిపాదన కూడా తిరస్కరణకు గురైంది. ఈ తర్వాత వైల్డ్ బ్లడ్ మూడో ప్రతిపాదన రాజా ముందు పెట్టారు.. రియాసి ప్రాంతం గుండా చీనాబ్ నది మీదుగా రైల్వే అలైన్‌మెంట్‌ను ఈ టీమ్ సిఫార్సు చేసింది.దీనికి ఆమోదముద్ర పడింది. అయితే 1925లో మహారాజా ప్రతాప్ సింగ్ చనిపోవడం.. అదే సమయంలో భారత స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కారణంగా ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని తెలుస్తోంది.

రాజా ప్రతాప్ సింగ్ తన పాలనలో కాశ్మీర్‌కు రైలు సౌకర్యం గురించి కలలు కన్నారని లేదా ప్రతిపాదించారని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చారిత్రక ఆధారాలు అయితే లభించలేదు. కానీ రాజా ప్రతాప్ సింగ్ 1885 నుంచి 1925 వరకు జమ్మూ కాశ్మీర్‌ను పాలించారు. ఆయన కాలంలో రోడ్లు, టెలిగ్రాఫ్‌లు వంట మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే, కాశ్మీర్‌లో రైల్వే విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు రాజా ప్రతాప్ సింగ్ పాలనా కాలంలో జరిగినా ఆయన వారసుడు మహారాజా హరి సింగ్ ఈ ప్రాజెక్టుపై ఎక్కువగా దృష్టి సారించారని చారిత్రకారులు చెబుతున్నారు. ఆయన పాలనా కాలంలోనే కాశ్మీర్ లోయకు రైల్వేను విస్తరించాలనే ఆలోచన మరింత ప్రముఖంగా వినిపించింది.

అత్యంత ఎత్తులో కొండలను తవ్వి సొరంగాలు ఏర్పాటు చేస్తూ ఈ వంతెనను నిర్మించారు.ఈ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్ . పర్వతాలు, లోయలు, విపరీతమైన చలి గాలులతో నిండి ఉండే ఈ ప్రాంతంలో అంత ఎత్తులో బ్రిడ్జ్ నిర్మాణం ఒక సాహసమనే చెప్పాలి. దాన్ని సవాల్ గా తీసుకుంది ఇండియన్ రైల్వే. చీనాబ్ నదిపై 1,178 అడుగుల ఎత్తులో .. 1315 మీటర్ల పొడవున .. 27వేల టన్నుల ఉక్కుతో కెనడాకు చెందిన డబ్ల్యూఎస్‌పీ ఇంజనీరింగ్ సంస్థ ఈ బ్రిడ్జ్ ను రూపొందించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో డిజైన్లను పరిశీలించి ఫైనల్ గా ఆర్చి మోడల్ లో బ్రిడ్జిని కట్టారు ఇంజనీర్లు.

43,800 కోట్లు పోసి ఈ బ్రిడ్జ్ కట్టారంటే దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అర్థ చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి – కాట్రా వరకూ డైరెక్ట్ గా ట్రైన్ లోనే వెళ్లిపోవచ్చు. మరోవైపు బారాముల్లా నుంచి శ్రీనగర్ మీదుగా రైల్వే లైన్ ఉంది. ఈ రెండు లైన్ల మధ్యలో ఎత్తైన కొండలు, లోయలు నిండి ఉంటాయి. ఈ కారణంగా ఇన్నాళ్లు రైల్వే లింక్ ఉండేది కాదు. దానితో బయట రాష్ట్రాల నుంచి శ్రీనగర్ రావాలంటే ఫ్లైట్ ద్వారానో లేదంటే జమ్ము వరకూ ట్రైన్ లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రావడమో జరిగేది. కానీ ఇప్పుడు ఆ తీరింది. మామూలుగా కట్రా నుంచి శ్రీనగర్ వెళ్లాలంటే 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. కానీ ఈ లైన్ వల్ల ప్రయాణం 3 గంటలకు తగ్గుతుంది. ఇక టూరిజాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా చాలా సౌలభ్యం కల్పిస్తుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్.