
కాల్పుల విరమణ ఒప్పందం జరిగిపోయింది.. ఇక భారత్, పాకిస్థాన్ మధ్య గొడవలు ఉండవు అనుకుంటున్నారా..? అయితే మనం పొరపాటు పడినట్టే.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ చెప్పడం.. ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తెర తీసింది. అసలు కాల్పుల విరమణ ప్రకటన అంత సెడన్ గా ఎందుకు వచ్చింది.? పాకిస్థాన్ పై దాడులకు సంబంధించి భారత్ ఏం చెబుతోంది..? కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్థాన్ కాల్పులు జరపడాన్ని ఎలా చూడొచ్చు..? ఇది భారత్ పై దాడులు చేయడానికి పాకిస్థాన్ తీసుకుంటున్న విరామంగా భావించవచ్చా..? అయితే మరోసారి పాకిస్థాన్ దాడులు చేస్తే .. భారత్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది..?
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త చల్లారాయి. 5 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఇది పైపైన మాటలతోనే జరిగిందనే మాట వినిపిస్తోంది. అసలైన చర్చలు ముందున్నాయని అంటున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వీటికి ముగింపు పలికేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా ముందుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యను అమెరికా పరిష్కరించగలదా అనే ప్రవ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల సంప్రదింపులు జరిపారనే వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో పాకిస్థాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు అమెరికా మీడియా కథనం ద్వారా తెలుస్తోంది.
ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని ప్రధాని మోదీతో జేడీ వాన్స్ పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి సమాధానంగా.. పాకిస్థాన్ ఎటువంటి దాడులు చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని మోదీ చెప్పినట్లు సమాచారం. అయితే, జేడీ వాన్స్ తో మాట్లాడిన రోజే రోజు రాత్రి భారత్‌లోని 26 ప్రదేశాలపై పాకిస్థాన్ దాడులు చేయగా.. వాటన్నింటినీ భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అనంతరం పాక్ వైమానిక కేంద్రాలపైనా భారత్ విరుచుకుపడింది. దీంతో కాల్పుల విరమణకు సిద్ధమంటూ పాక్ సైన్యం కోరడంతో తాత్కాలిక విరమణకు భారత్ అంగీకరించింది. అయితే తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడటం.. అనంతర పరిణామాలపై త్రివిధ దళాలతో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. పరిస్థితిని మోదీకి వివరించారు. అయితే మోదీ మాత్రం పాక్ విషయంలో అసలు తగ్గేదే లేదంటున్నారు. ఒక వేళ పాకిస్థాన్ తో చర్చలు జరిపితే .. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను అప్పంగించడం మినహా మరో విషయంపై మాట్లాడేది లేదని మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ మాట్లాడితే తాము మాట్లాడుతామని అంటున్నారు. అయితే, ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని, అటువంటి అవసరమూ లేదని చెబుతున్నారు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు. తాము చేపట్టిన ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. దాడుల భయంతో ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయని భారత్ ఆర్మీ పేర్కొంది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించామని… ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని త్రివిధ దళాల అధిపతులు తెలిపారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించామని… స్పష్టమైన ఆధారాలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారన్నారు. ఆ దాడులతో పాకిస్థాన్ వణికిపోయిందని… ఆ తర్వాత మన పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని.. అనంతరం తగిన మూల్యం చెల్లించుకుందని అన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రస్థావరాలపై దాడిలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసీ-814 హైజాకర్లు, పుల్వామా దాడుల్లో పాల్గొన్న ముష్కరులు హతమయ్యారని… వీరిలో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారని ఆర్మీ డీజీఎంవో రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
ఈ నెల 8, 9వ తేదీ రాత్రి భారత్‌పై గగనతల దాడికి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్లు, మానవరహిత విమానాలు భారత్ వైపు దూసుకొచ్చాయి. వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను భారత్ ఆర్మీ అడ్డుకుంది. డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు చేసింది. లాహోర్, గుజ్రన్‌వాలా రాడార్ కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది. డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్థాన్ పౌరవిమానాలనూ ఆకాశంలోకి అనుమతించింది. పరిస్థితి గమనిస్తూ.. కచ్చితమైన లక్ష్యాలతో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేశామని.. మొత్తంగా మూడు రోజులపాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామని డీజీఎంవో స్థాయి అధికారులు పేర్కొన్నారు. భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో సైన్యం పాక్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చాందని త్రివిధ దళాల అధికారులు తెలిపారు. పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించామన్నారు. సైన్యం, వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని… పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని.. అయినా కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్ దాడులు కొనసాగించిందని డీజీఎంవో అధికారి తెలిపారు .
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని అత్యాధునిక విమానాలను కూల్చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతీ వెల్లడించారు. భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ నిర్బంధించినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. భారత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. అటు మన స్థావరాలపై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం కూడా పూర్తి సంసిద్ధతతో ఉందని ఇండియన్ నేవీ వెల్లడించింది. పహల్గాం దాడి తర్వాత వెంటనే అప్రమత్తమయ్యామని, బలగాలతో పాటు సబ్‌మెరైన్లను సముద్రంలో మోహరించామని తెలిపింది. అవసరమైతే కరాచీ పోర్టు కూడా తమ లక్ష్యాల్లో ఒకటని పేర్కొంది. తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో పాకిస్థాన్ నేవీ, ఎయిర్‌బేస్‌లపై నిఘా పెట్టామని.. ఈసారి పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే భారత్ ఏం చేయనుందో వారికి తెలుసునని వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పేర్కొన్నారు.