
PM Modi’s visit to Trinidad and Tobago: భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ఆసక్తి రేపింది. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్-బిసెస్సర్ సాంప్రదాయ భారతీయ చీరలో ఆకట్టుకున్నారు. దక్షిణ అమెరికా సమీపంలో ఉన్న ఈ చిన్న దేశానికి మోదీ ఎందుకు వెళ్లారు? అమెరికాకు దగ్గరలో ఉన్న ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ప్రధానికి, బిహార్ కు ఉన్న సంబంధం ఏంటి? ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయుల డామినేషన్ ఎక్కువగా ఉండటానికి కారణమేంటి.?
ప్రధాని నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అపూర్వ స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్-బిసెస్సర్, సాంప్రదాయ భారతీయ చీరలో, తన కేబినెట్‌లోని 38 మంది మంత్రులు, నలుగురు ఎంపీలతో కలిసి మోదీని స్వాగతించారు. భారత సంతతికి చెందిన స్థానికులు మోదీని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోదీ కూడా వారితో సన్నిహితంగా మాట్లాడి, వారి ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలిపారు. 1999 తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధాని చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ఈ రెండు రోజుల పర్యటనలో మోదీ ట్రినిడాడ్ అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కాంగలూ, ప్రధాని కమలాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే, ట్రినిడాడ్ పార్లమెంట్‌లో జాయింట్ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్శనం భారత్-ట్రినిడాడ్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్-బిసెస్సర్‌కు భారత్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఆమె భారత సంతతికి చెందిన నాయకురాలు, ఆమె పూర్వీకులు బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని భేలుపూర్ గ్రామం నుంచి ట్రినిడాడ్‌కు వలస వెళ్లారు. 2012లో కమలా తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించి, భారతీయ సంస్కృతితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మోదీ తన పర్యటనలో ఆమెను బీహార్ బిడ్డగా అభివర్ణించి, ఆమె నాయకత్వాన్ని ప్రశంసించారు. కమలా 2010-2015 మధ్య ట్రినిడాడ్ ప్రధానిగా పనిచేసి, 2025లో మళ్లీ ఈ పదవిని చేపట్టారు. ఆమె నాయకత్వంలో భారత్-ట్రినిడాడ్ సంబంధాలు మరింత బలపడ్డాయి. కమలా మోదీని స్వాగతిస్తూ, ఆయనను విజనరీ లీడర్ గా, భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించిన ట్రాన్స్‌ఫార్మేషనల్ ఫోర్స్ గా కొనియాడారు. ఆమె 2002లో మోదీ ట్రినిడాడ్‌లో జరిగిన వరల్డ్ హిందూ కాన్ఫరెన్స్‌కు హాజరైన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంలో మోదీ కమలాకు మహాకుంభ నీటిని, రామమందిర రెప్లికాను బహుమతిగా ఇచ్చారు. PM Modi’s visit to Trinidad and Tobago.
భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య సంబంధాలు 1962 నుంచి ఉన్నప్పటికీ, వీటి మూలాలు 1845లో భారతీయ వలసలతో మొదలయ్యాయి. ట్రినిడాడ్ జనాభా 13.6 లక్షలు కాగా.. అందులో సుమారు 40 నుంచి 45 శాతం మంది భారత సంతతికి చెందినవారు, వీరిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చినవారు. ఈ భారతీయ మూలాలు ట్రినిడాడ్‌లో సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో ప్రతిబింబిస్తాయి. మోదీ తన ప్రసంగంలో వారు గంగా, యమునాను వదిలి వచ్చినప్పటికీ, రామాయణాన్ని హృదయాల్లో దాచుకున్నారని కొనియాడారు. ట్రినిడాడ్‌లో రామలీలా, భోజ్‌పురి చౌటాల్ ప్రదర్శనలు ఈ సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబిస్తాయి. 1968లో ట్రినిడాడ్ పార్లమెంట్‌కు భారత్ స్పీకర్ చైర్ బహుమతిగా ఇవ్వడం, యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను ట్రినిడాడ్ అవలంబించడం ఈ సంబంధాలకు నిదర్శనం.
భారత్-ట్రినిడాడ్ సంబంధాలు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో కరేబియన్ ప్రాంతంలో కీలక దేశం. మోదీ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని వాణిజ్యం, డిజిటల్ ఫైనాన్స్, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, ఐటీ, వ్యవసాయం, డిజాస్టర్ రెసిస్టెన్స్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో బలోపేతం చేస్తుంది. భారత్ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించిన కరేబియన్ దేశాల్లో ట్రినిడాడ్ మొదటిది. కరేబియన్ కమ్యూనిటీ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. 2024లో గయానాలో జరిగిన ఇండియా-కారికామ్ సమ్మిట్‌లో మోదీ ట్రినిడాడ్ నాయకులతో చర్చలు జరిపారు, ఇది ఈ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక ఆసక్తిని తెలియజేస్తుంది.
మోదీ ట్రినిడాడ్ పర్యటన సందర్భంగా ఆయనకు ఆ దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో లభించింది. ఈ గౌరవం ఇండో-ట్రినిడాడియన్ హిందూ సమాజంలో ఆనందాన్ని కలిగించినప్పటికీ, ఆ దేశంలోని అతిపెద్ద ముస్లిం సంస్థ అంజుమన్ సున్నత్-ఉల్-జమాత్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 గుజరాత్ అల్లర్లు, కాశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు వంటి అంశాలను లేవనెత్తింది. అయితే, మోదీకి సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ వంటి ముస్లిం దేశాల నుంచి కూడా గౌరవాలు లభించాయి.