భారత్‌లో తగ్గిన పేదరికం.. వరల్డ్ బ్యాంక్ కొత్త లెక్కలు..!!

చేపలు పంచడం కాదు.. చేపలు పట్టడం నేర్పినప్పుడే ఒక వ్యక్తి ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తాడు. అలాగే ఉచిత పథకాలు తగ్గించి.. ఉపాధి కల్పించినప్పుడే పేదరికం పూర్తిగా నిర్మూలించబడుతుంది. అయితే ప్రపంచ బ్యాంక్ కొత్త లెక్కల ప్రకారం భారత దేశంలో పేదరికం గత దశాబ్ధంలో భారీగా తగ్గింది. దీనికి కారణం ఏంటి..? ఇండియాలో పేదరికం ఎలా తగ్గిందని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి..? వరల్డ్ బ్యాంక్ ఎందుకు పేదరిక రేఖను సవరించింది? భారత్ ఎలా ఈ ఫలితాలను సాధించింది?

పేదరిక నిర్మూలనలో భారత్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలో సుమారు దశాబ్దకాలంలో తీవ్ర పేదరికం రేటు భారీగా తగ్గింది. 2011-12 సంవత్సరంలో దేశంలో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గింది. 2011-12లో 34.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా.. 2022-23 నాటికి ఆ సంఖ్య 7.5 కోట్లకు తగ్గింది. ఆ 11 ఏళ్ల కాలంలో సుమారు 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని వరల్డ్ బ్యాంక్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ పేదరిక రేఖను 2021 ఆధారంగా రోజుకు 2.15 డాలర్ల నుంచి 3 డాలర్లకు పెంచింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అతి పేదరికంలో ఉన్నవారి సంఖ్య 22.6 కోట్ల మందిగా పెరిగే అవకాశం ఉండగా, భారత్ లో కొత్త డేటా వల్ల ఈ సంఖ్య 12.5 కోట్లకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫాక్ట్ షీట్ ప్రకారం, 2011-12 నుంచి 2022-23 మధ్య 17.1 కోట్ల మంది అతి పేదరికం నుంచి బయటపడ్డారు. దీనికి ఆహార భద్రతా పథకాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక సంస్కరణలు కారణంగా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ధరల స్థాయిలో వచ్చిన మార్పులను లెక్కించేందుకు పర్చేసింగ్ పవర్ పారిటీ విధానం ఉపయోగిస్తారు. ఈ PPPని 2021 ఆధారంగా ప్రపంచ బ్యాంక్ సవరించింది. దీని ప్రకారం భారత్ లో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం బాగా తగ్గినట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి 11 ఏళ్ల సమయంలో పేదరికం తగ్గింది. ఇక 2017 నాటి పేదరిక రేఖ ఆధారంగా రోజుకు 2.15 డాలర్లు ఖర్చు చేయగలిగే విషయంలో జనాభాలో 2.3 శాతం మంది మాత్రమే అత్యంత పేదరికంలో ఉన్నారని, 2011-12లో 16.2 శాతంతో పోలిస్తే ఇది భారీ తగ్గుదల అని తెలిపింది. 2022లో 2.15 డాలర్ల అంచనా విషయంలో పేదల సంఖ్య 3.36 కోట్లకు తగ్గగా, అది 2011లో 20.5 కోట్లుగా ఉండేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భారత్‌లో పేదరిక తగ్గింపునకు హౌస్‌హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ సర్వే కీలక పాత్ర పోషించింది. ఈ సర్వే గృహాలు వస్తువులు, సేవలపై చేసే ఖర్చులను సేకరిస్తుంది. 2023-24 HCES ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలవారీ వ్యక్తిగత ఖర్చు రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996గా ఉంది. సామాజిక సంక్షేమ పథకాల ద్వారా ఉచితంగా అందిన వస్తువుల విలువను కలిపితే, ఈ సంఖ్యలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,247, పట్టణాల్లో రూ.7,078కి పెరుగుతాయి. 2011-12లో ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,430, పట్టణాల్లో రూ.2,630గా ఉండేవి. అంటే, ఈ దశాబ్దంలో గృహ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. పట్టణ-గ్రామీణ ఖర్చుల మధ్య అంతరం 2011-12లో 84% ఉండగా, 2023-24 నాటికి 70%కి తగ్గింది, ఇది అసమానతల తగ్గుదలను సూచిస్తుంది. 18 ప్రధాన రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ఖర్చులు పెరిగాయి. ఒడిశాలో గ్రామీణ ఖర్చు 14%, పంజాబ్‌లో పట్టణ ఖర్చు 13% పెరిగింది.

భారత్‌లో పేదరికం నిజంగా తగ్గిందా? వరల్డ్ బ్యాంక్, భారత ప్రభుత్వ డేటా ప్రకారం అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొత్త MMRP పద్ధతి ద్వారా గృహ ఖర్చులను ఖచ్చితంగా కొలవడం వల్ల 2011-12లో 22.9% ఉన్న పేదరిక రేటు 16.2%కి తగ్గింది. ఆహార భద్రతా పథకాలు, గ్రామీణ ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు ఈ విజయానికి కారణాలు. ఈ ఫలితాలు కేవలం గణాంకాల సవరణ కాదు, భారత్‌లో ప్రజల ఆదాయం, జీవన స్థితిగతులు మెరుగైన వాస్తవాన్ని చూపిస్తాయి. అయితే, పట్టణ యువతలో నిరుద్యోగం, వేతన అసమానతలు ఇంకా సవాళ్లుగా ఉన్నాయి. ఇది కూడా సరైతే పేదరికం ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి ప్రధానంగా గృహ వినియోగ ఖర్చు సర్వే ఆధారంగా లెక్కిస్తారు. ఈ సర్వేలో కుటుంబాలు ఆహారం, ఆహారేతర వస్తువులు, సేవలపై చేసే నెలవారీ ఖర్చులను సేకరిస్తారు. ఈ డేటా ఆధారంగా ఒక వ్యక్తి రోజువారీ జీవన అవసరాలను తీర్చుకోవడానికి కావాల్సిన కనీస ఖర్చును నిర్ణయిస్తారు. దీనినే దారిద్ర రేఖ అంటారు. ఈ రేఖను గతంలో టెందూల్కర్ కమిటీ వంటి నిపుణుల బృందాలు నిర్ణయించాయి. ఇది ఆహారం, విద్య, ఆరోగ్యం, గృహ అవసరాలను కవర్ చేసే కనీస ఖర్చును అంచనా వేస్తుంది. ఉదాహరణకు, 2011-12లో టెందూల్కర్ కమిటీ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.27, పట్టణ ప్రాంతాల్లో రూ.33 కంటే తక్కువ ఖర్చు చేసే వ్యక్తిని దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారిగా గుర్తించారు. ఈ రేఖ ఆధారంగా, ఒక వ్యక్తి లేదా కుటుంబం ఈ కనీస ఖర్చును చేరుకోలేకపోతే వారు BPL కేటగిరీలోకి వస్తారు, అంటే పేదరికంలో ఉన్నట్టు లెక్క.

భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ఇటీవల మోడిఫైడ్ మిక్స్‌డ్ రీకాల్ పీరియడ్ అనే కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి గతంలో ఉపయోగించిన యూనిఫాం రిఫరెన్స్ పీరియడ్ కంటే ఖచ్చితమైన డేటాను అందిస్తుంది, ఎందుకంటే ఇది వాస్తవ ఖర్చులను, ముఖ్యంగా ఆహారం, ఆహారేతర వస్తువులపై ఖర్చును మరింత స్పష్టంగా సేకరిస్తుంది. 2023-24 HCES డేటా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలవారీ వ్యక్తిగత ఖర్చు రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996గా ఉంది. ఇది 2011-12లో గ్రామీణ రూ.1,430, పట్టణ రూ.2,630తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా చెప్పొచ్చు. ఈ ఖర్చుల పెరుగుదల, ఆహార భద్రతా పథకాలు, గ్రామీణ ఆర్థిక వృద్ధి వంటివి పేదరిక తగ్గింపుకు దోహదపడ్డాయి.