
సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు విషయంపై భారత రాష్ట్రపతి స్పందించారు. అంతేకాదు దీనికి సమాధానం చెప్పాలని కూడా కోరారు. రాష్ట్రపతి విధులకు సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పడమే ఈ ప్రతిస్పందనకు కారణంగా చెప్పొచ్చు.. ఇంతకీ సుప్రీం కోర్టుపై మర్ము రియాక్షన్ ఏంటి..? అసలు ఇది ఏ కేసు..? దీనిపై దేశ వ్యాప్తంగా ఎలా చర్చ జరుగుతోంది..? అసలు రాష్ట్రపతి విధుల గురించి రాజ్యాంగం ఏం చెబుతోంది..? రాష్ట్రపతి పనులపై సుప్రీం కోర్టు తీర్పులను ఇవ్వడాన్ని రాజ్యాంగం అంగీకరిస్తుందా..?
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని ఉత్తర్వులపై రాష్ట్రపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఎటువంటి కాలపరిమితి లేనప్పుడు, కోర్టు అలాంటి నిర్ణయం ఎలా ఇవ్వగలదని రాష్ట్రపతి సుప్రీంకోర్టును నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు న్యాయ నిపుణులలో చర్చనీయాంశంగా మారతాయి. ఎందుకంటే ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ కాదు, రాజ్యాంగ అధికారాల సమతుల్యతకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. దీనిపై ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించారు. ఏప్రిల్ 8న తమిళనాడు ప్రభుత్వం vs గవర్నర్ కేసులో, సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు.
ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. గవర్నర్, రాష్ట్రపతి ఇద్దరికీ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 200, 201 అధికరణలు గవర్నర్, రాష్ట్రపతి బిల్లులను పరిశీలించడానికి ఎటువంటి కాలపరిమితిని లేదా విధానాన్ని నిర్దేశించలేదని రాష్ట్రపతి తన లేఖలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు అనేక అంశాలపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఇందులో సమాఖ్యవాదం, చట్టాల ఏకరూపత, దేశ భద్రత, అధికారాల విభజన వంటి సూత్రాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు డీమ్డ్ అసెంట్ అనే భావన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని రాష్ట్రపతి పేర్కోన్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు నుంచి ఆర్టికల్ 143(1) కింద కోరారు. ఇది అసాధారణ రాజ్యాంగ అధికారం. ఈ నిర్ణయంపై సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేస్తే, తీర్పు ఇచ్చిన బెంచ్ దానిని తిరస్కరించవచ్చని రాష్ట్రపతికి తెలుసు. అటువంటి పరిస్థితిలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ వివరణకు సంబంధించిన 14 ముఖ్యమైన ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు పరిశీలిస్తే.. రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? వంటి ప్రశ్నలు రాష్ట్రపతి అడిగారు. వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.
అయితే, కొన్ని అసాధారణ పరిస్థితులలో, బిల్లు ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రమాదకరం అనే కారణంతో రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును గవర్నర్ రిజర్వ్ చేయవచ్చు. అటువంటి చట్టానికి అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ధారించడానికి రాజ్యాంగం వివరణ అవసరం. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేకపోవడం, రాజ్యాంగ చెల్లుబాటు ప్రశ్నలను కలిగి ఉండటం అనే కారణంతో బిల్లును ప్రధానంగా రిజర్వ్ చేసిన సందర్భాలలో, కార్యనిర్వాహకుడు సంయమనం పాటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో రాష్ట్రపతి పేర్కొన్నారు.
అయితే, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి బిల్లులు రాజ్యాంగబద్ధమైనవా కాదా అన్న విషయాన్ని తేల్చడం మాత్రం న్యాయస్థానాల హక్కు. రాజకీయ విధానాలకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు. ఏదైనా గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు కేటాయించినా.. అది రాజ్యాంగ విరుద్ధత అనే న్యాయపరమైన కారణాలపైనే ఆధారపడాలనీ, అటువంటి సందర్భాల్లో రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయస్థానం పునఃపరిశీలించవచ్చని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ గవాయ్ నేతృత్వంలో బెంచ్ ఏర్పడుతుందా, లేక ఇప్పటికే ఇచ్చిన రెండు న్యాయమూర్తుల తీర్పును పునరుద్ఘాటిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.