రాష్ట్రపతి vs సుప్రీంకోర్టు…!!

President Murmu Asks 14 Questions to supreme court

రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణ మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లు పెండింగ్ బిల్లుల్ని 3 నెలల్లో ఆమోదించాలన్న సుప్రీం తీర్పుతో చర్చ చాలా వరకు పెరిగింది. శాసన, కార్యనిర్వాహక పరిధిలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటోందని కొందరు పొలిటీషియన్లు మాట్లాడారు. అయితే తాజాగా రాష్ట్రపతి కూడా 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలను సుప్రీం కోర్టు ముందు ఉంచారు. సలహాలు కోరారు. ఈ వ్యవహారంతో రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా అన్న టాపిక్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఒక బిల్లు గవర్నర్ వద్ద ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంటే, దాన్ని ఆటోమేటిక్ గా ఆమోదించినట్లుగానే పరిగణించాలని సుప్రీం కోర్టు ఇటీవలి తీర్పు సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ RN రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 415 పేజీల తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలన్నది. బిల్లులను వెనక్కి తిప్పి పంపితే ఎందుకు ఎలా చేశారనే కారణాలు కూడా చెప్పాలన్నది. తేల్చకపోతే 3 నెలల్లో అవి ఆమోదించినట్లుగానే చూడాలన్నది. గవర్నర్ల పనితీరు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని, రాజ్యాంగలోని 142వ అధికరణం సుప్రీంకు సంపూర్ణ అధికారం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.

అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా సుప్రీం కోర్టుకు 14 రాజ్యాంగ అంశాలపై ప్రశ్నలను సంధించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర అసెంబ్లీ పంపించిన బిల్లును.. గవర్నర్ స్వీకరించిన తర్వాత ఆర్టికల్ 200 కింద రాజ్యాంగం సూచించిన నిబంధనలు ఏంటి..? రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్.. కేబినెట్ నిర్ణయం, సలహాల ప్రకారమే వ్యవహరించాలా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలు కోర్టుల సమీక్ష, విచారణల నుంచి ఆర్టికల్ 361 కాపాడుతుందా? గవర్నర్ ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయంపై రాజ్యాంగంలో స్పష్టమైన కాల పరిమితి లేనప్పుడు.. బిల్లులపై నిర్ణయం తీసుకోవటానికి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించవచ్చా? అని రాష్ట్రపతి పంపిన నోట్ లో ఉంది.

అటు ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని న్యాయ పరంగా సమీక్షించవచ్చా? రాజ్యాంగబద్దమైన ఆదేశాలు లేనప్పుడు.. న్యాయపరంగా సూచించిన గడువుకు, కాలానికి రాష్ట్రపతి కట్టుబడి ఉంటారా? రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు.. నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా? బిల్లు చట్టంగా మారే ముందు.. గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలను తీసుకోవటానికి లేదా మార్పులు చేయటానికి ఆర్టికల్ 142 కింద అనుమతి ఉందా? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా? రాజ్యాంగ సవరణ ప్రశ్నలను ఆర్టికల్ 145(3) కింద ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలా? ఆర్టికల్ 142 కింద రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా.. కోర్టు తీర్పులను అనుమతిస్తుందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలను.. సుప్రీంకోర్టు పరిధిని నిర్దేశించే ఆర్టికల్ 131 పరిధిలో కాకుండా పరిష్కరించవచ్చా? ఈ 14 ప్రశ్నలపై అభిప్రాయాలను తెలియజేయాలని సుప్రీంకోర్టును రాష్ట్రపతి భవన్ అడిగింది. దీంతో సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టికల్ 200 ప్రకారం సాధ్యమైనంత త్వరగా బిల్లుల్ని క్లియర్ చేయాలని రాజ్యాంగంలో చెబితే.. అది 3 నెలలు అని సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించింది. ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాలపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.