
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో దాణా కుంభకోణం, ఇతర కేసుల్లో జైలు జీవితం అనుభవించిన లాలూ.. తన కుమారికే ఇప్పుడు శిక్ష విధించారు. తన పెద్ద కొడుకు తేజ్ ప్రసాద్ యాదవ్ ను పార్టీ నుంచి అలాగే కుటుంబం నుంచి వెలి వేశారు లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు లాలూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అసలు తేజ్ ప్రసాద్ యాదవ్ చేసిన తప్పేంటి..?
రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి తొలగించారు. అంతే కాదు, అతడిని కుటుంబం నుంచి కూడా వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలతో పాటు బిహార్ లోని సాధారణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తేజ్ ప్రతాప్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, కుటుంబ విలువలకు విరుద్ధంగా నడుచుకోవడమే ఈ నిర్ణయానికి కారణమని లాలూ తెలపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని లాలూ ప్రకటిస్తూ, వ్యక్తిగత జీవితంలో నీతి విలువలను పట్టించుకోకపోతే, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న పోరాటం బలహీనమవుతుందని ఆయన అన్నారు. తేజ్ ప్రతాప్ ఇకపై పార్టీలో ఎలాంటి పాత్ర పోషించడు, కుటుంబంలో భాగం కాదని కూడా స్పష్టం చేశారు.
అసలు లాలూ తన కుమారుడి గురించి ఏం అన్నారు..?
తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ సంప్రదాయాలకు, విలువలకు సరిపోలేదని లాలూ ఎక్స్‌లో రాసిన పోస్ట్‌లో తెలిపారు. వ్యక్తిగత జీవితంలో నీతి విలువలను పట్టించుకోకపోవడం తమ సామాజిక న్యాయ పోరాటాన్ని బలహీనపరుస్తుందని లాలూ తెలిపారు. తన పెద్ద కొడుకు చేస్తున్న పనులు, అతని ప్రవర్తన, బాధ్యతారహిత వైఖరి తమ కుటుంబ విలువలకు, సంస్కారానికి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. అందుకే, అతడిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి బయటకు పంపేస్తున్నానన్నారు. ఇకపై తేజ్ ప్రతాప్ కి పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదన్నారు. ఆరు సంవత్సరాల పాటు అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని లాలూ పోస్ట్ లో రాశారు. అంతే కాదు, తేజ్ ప్రతాప్‌తో సంబంధాలు కొనసాగించాలనుకునే వారు తమ విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించారు. పబ్లిక్ లైఫ్‌లో తప్పు చేస్తే బహిరంగంగా సిగ్గుపడాలని తాను ఎప్పుడూ చెబుతానని, కుటుంబ సభ్యులు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తారని ఆయన అన్నారు.
లాలూ నిర్ణయాన్ని తేజ్ ప్రతాప్ తమ్ముడు తేజస్వీ యాదవ్ సమర్థించారు. రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరుగా ఉండాలని, తేజ్ ప్రతాప్ తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి స్వతంత్రుడని తేజస్వీ అన్నారు. తాము బీహార్ ప్రజల కోసం పని చేస్తున్నామని.. ఇలాంటి విషయాల్ని సహించలేమని తెలిపారు. అన్నయ్య వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నాడని ఎవరూ అడగగరని.. అయితే పార్టీ అధ్యక్షుడు చెప్పినప్పుడు పాటించాలని తేజస్వీ చెప్పారు. లాలూ కూతురు, తేజ్ ప్రతాప్ సోదరి రోహిణి ఆచార్య కూడా తండ్రి నిర్ణయాన్ని సమర్థించారు. కుటుంబం, సంప్రదాయం, సంస్కారాన్ని కాపాడుకునే వాళ్లను ఎవరూ ప్రశ్నించరని.. ఎవరైనా వివేకాన్ని వదిలేసి, కుటుంబ గౌరవాన్ని మీరితే, వాళ్లు విమర్శలకు గురవుతారని అన్నారు. తమ తండ్రి దేవుడితో సమానమని.. కుటుంబం తమకు గుడి, పార్టీ తమ ఆరాధన అని… ఈ మూడింటి గౌరవం ఎవరి వల్లా దెబ్బతినడాన్ని తాము ఒప్పుకోమని రోహిణి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
అసలు సమస్య ఎక్కడ మొదలైంది…?
తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్ట్ ఈ వివాదానికి అసలు కారణం. అందులో తాను అనుష్కా యాదవ్ అనే యువతితో 12 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నానని, ఆమెను ప్రేమిస్తున్నానని ప్రకటించారు. అలాగే ఆ పోస్ట్‌లో అనుష్కాతో ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ పోస్ట్ వైరల్ కావడంతో, తేజ్ ప్రతాప్ గతంలో చేసుకున్న వివాహం, దానికి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. ఎందుకంటే గతంలోనే తేజ్ ప్రతాప్ కు వివాహం కావడం.. ఇతడి తీరుతో భార్య వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. దీనిపై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది. తేజ్ ప్రతాప్ తాజా పోస్టుతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని, తనను, కుటుంబాన్ని అవమానించేందుకు ఈ పోస్ట్ చేశారని తేజ్ ప్రతాప్ చెప్పడం మొదలు పెట్టారు. తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి, తన ఫొటోలను తప్పుగా ఎడిట్ చేసి, తనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు, అవమానించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన శ్రేయోభిలాషులు, ఫాలోవర్లు ఈ రూమర్లను పట్టించుకోవద్దని కోరుతున్నానని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయం లాలూ ప్రసాద్ యాదవ్ కు చేరిపోయింది. ఆయన తేజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు..
అయితే లాలూ ఆగ్రహం వెనుక ఒక కారణం ఉంది. 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని నెలల్లోనే ఐశ్వర్య ఇంటిని వదిలి వెళ్లిపోయింది. తనను భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారని ఆమె ఆరోపించారు. ఐశ్వర్య తండ్రి, మాజీ మంత్రి చంద్రికా రాయ్, ఆర్జేడీని వీడి, తన కూతురి పోరాటాన్ని రాజకీయంగా, చట్టపరంగా కొనసాగిస్తానని చెప్పారు. ఈ జంట విడాకుల కేసు పాట్నాలోని ఫ్యామిలీ కోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తేజ్ ప్రతాప్ తన భార్య అత్యధిక మొత్తంలో భరణం డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తే, ఐశ్వర్య తన భర్త మాదక ద్రవ్యాలు సేవిస్తాడని, ఇంట్లో ఆడవాళ్ల బట్టలు వేసుకుంటాడని ఆరోపించింది. ఈ కేసు నడుస్తుండగానే.. తేజ్ ప్రసాత్ సోషల్ మీడియా పోస్టు వైరల్ అయ్యింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా లాలూ కుమారుడిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించారు. అయితే పూర్తికారణం మాత్రం బయటకు రానివ్వలేదు. అయితే కుటుంబ సభ్యులు లాలూ నిర్ణయాన్ని సమర్థించడం, పార్టీ విలువలను, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలనే వారి ప్రయత్నం వెనుక బలమైన కారణమే ఉంటుందని అంటున్నారు. ఈ సంఘటన బీహార్ రాజకీయాల్లో, ఆర్జేడీలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.