దోస్త్ మేరా దోస్త్.. రష్యా కొత్త ప్లాన్ .. చైనా, భారత్ ను కలిపే ప్రయత్నం.. అమెరికాకు భయం

భారత్ కు రష్యా మిత్రదేశం.. రష్యాకు చైనా మిత్రదేశం.. కాని చైనాకు, భారత్ కు అంతగా పడదు. పాకిస్థాన్ విషయంలో కాని.. సరిహద్దుల విషయాల్లో కాని భారత్, చైనా మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు నేరుగా గొడవపడకపోయినా..ఏదో ఒక గీత రెండు దేశాలను వేరు చేస్తుంటుంది. అయితే ఈ గీతను చెరిపేసి.. భారత్, చైనాలను కలపాలని రష్యా భావిస్తోంది. దీని కోసం రష్యా ఒక పెద్ద ప్రతిపాదన చేసింది. రష్యా-భారత్-చైనా మధ్య త్రైపాక్షిక సమావేశాలు, అంటే RIC ఫార్మాట్‌ను తిరిగి ప్రారంభించాలని రష్యా అంటోంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రష్యా ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చింది? ఈ సమావేశాలు భారత్‌కు ఎలా ఉపయోగపడతాయి? భారత్, చైనా పూర్తి స్నేహంతో కలుస్తాయా..? ఈ మూడు దేశాలు బలంగా కలిస్తే.. ఆసియాలో పరిస్థితి ఎలా ఉంటుంది..?

భారత్, రష్యా, చైనా.. ఈ మూడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలు.. ఇందులో భారత్, రష్యా మధ్య బంధం చాలా బలమైంది. అలాగే రష్యా, చైనా మధ్య కూడా మైత్రి అంతే ధృడంగా ఉంది. కాని చైనా, భారత్ మధ్య సంబంధాలు పైపైనే ఉన్నాయన్న మాట అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా సరిహద్దు సమస్యలు, పాకిస్థాన్ తో చైనా సంబంధాల నేపథ్యంలో డ్రాగెన్ కంట్రీతో భారత్ కాస్త డిస్టెన్స్ మేయింటేన్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ దూరం తొలగిపోయి స్నేహం చిగురిస్తే బలమైన శక్తులుగా ఎదిగే అశకాశం ఉంది. దీనికోసం రష్యా RIC ఫార్మాట్ ప్రతిపాదన తీసుకొచ్చింది. RIC అంటే రష్యా-భారత్-చైనా త్రైపాక్షిక సమావేశాలు. దీన్ని 1990ల చివర్లో రష్యా మాజీ ప్రధాని యెవ్‌గెనీ ప్రిమకోవ్ ప్రతిపాదించారు. ఈ మూడు దేశాలు కలిసి ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని సమతూకం చేయాలని, అంటే ప్రపంచంలో ఒకే దేశం ఆధిపత్యం లేకుండా, బహుళ-కేంద్ర ప్రపంచాన్ని సృష్టించాలనే ఆలోచనతో ఈ ఫార్మాట్ ప్రారంభమైంది. ఈ సమావేశాలు ఇప్పటివరకు 20 సార్లు జరిగాయి. ఈ మీటింగ్‌లలో మూడు దేశాల విదేశాంగ మంత్రులు, ఆర్థిక, వాణిజ్య, భద్రతా నిపుణులు కలిసి చర్చలు జరుపుతారు. ప్రపంచ సమస్యలు, ఆర్థిక సహకారం, భద్రతా విషయాలపై చర్చించుకుంటారు. కానీ 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సమావేశాలు నిలిచిపోయాయి.

ఇప్పుడు రష్యా ఈ సమావేశాలను ఎందుకు తిరిగి ప్రారంభించాలనుకుంటోంది? దీని వెనక కొన్ని కారణాలున్నాయి. మొదటిది, భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గాయి. 2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సరిహద్దు వివాదాలను తగ్గించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సానుకూల పరిణామాన్ని రష్యా ఒక అవకాశంగా చూస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఇప్పుడు భారత్-చైనా మధ్య సరిహద్దు పరిస్థితి ప్రశాంతంగా ఉంది కాబట్టి, RIC సమావేశాలు తిరిగి ప్రారంభించే సమయం వచ్చింది అని అన్నారు. రష్యా ఈ సమావేశాల ద్వారా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో మధ్యవర్తిగా ఉండాలని చూస్తోంది.

అయితే రష్యా ఈ సమావేశాలను ఇప్పుడు ప్రారంభించాలనుకోవడానికి మరో కారణం ఉంది. పశ్చిమ దేశాల ప్రభావాన్ని తగ్గించడం రష్యాకు ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అనేక ఆంక్షలను ఎదుర్కుటోంది. ఈ ఆంక్షల వల్ల రష్యా ఒంటరిగా మిగిలిపోయింది. అందుకే, రష్యా తన స్నేహ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. భారత్, చైనా రష్యాకు ముఖ్యమైన స్నేహితులు. ఈ మూడు దేశాలు కలిస్తే, అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రపంచంలో కొత్త శక్తి కేంద్రాన్ని సృష్టించవచ్చని రష్యా భావిస్తోంది. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు భారత్‌ను చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని రష్యా అంటోంది. ముఖ్యంగా ఇటీవల అమెరికా నిఘా వర్గాల నివేదికలో చైనానే భారత్ కు అతిపెద్ద శత్రువు అని చెప్పుకొచ్చింది. ఆ దేశంతో భారత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అయితే ఇలా భారత్ ను అమెరికా తప్పుదారి పట్టిస్తోందని రష్యా భావిస్తోంది. అందుకే, రష్యా RIC ఫార్మాట్ ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, సహకారాన్ని పెంచాలని చూస్తోంది. ఈ చర్చల ద్వారా భారత్, చైనా మధ్య దూరం తగ్గుతుందని భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ సమావేశాలు భారత్‌కు ఎలా ఉపయోగపడతాయి? భారత్‌కు ఈ RIC ఫార్మాట్ చాలా ముఖ్యమైన అవకాశం. ఎందుకంటే, భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఇంకా పూర్తిగా తీరలేదు. ఈ సమావేశాల ద్వారా రష్యా మధ్యవర్తిగా ఉండి, ఈ ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడవచ్చు. గతంలో 2017లో డోక్లాం వివాదం, 2020లో గల్వాన్ ఘర్షణ సమయంలో రష్యా ఇలాంటి పాత్ర పోషించింది. అలాగే, ఈ సమావేశాల ద్వారా భారత్ తన ఆర్థిక, వాణిజ్య సంబంధాలను రష్యా, చైనాతో బలోపేతం చేసుకోవచ్చు. రష్యాతో భారత్‌కు రక్షణ రంగంలో ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయి. ఈ సమావేశాలు ఆ సంబంధాలను మరింత బలపరుస్తాయి.

కానీ, ఈ సమావేశాలు భారత్‌కు కొన్ని సవాళ్లను కూడా తెస్తాయి. మొదటి సవాలు, చైనాతో సంబంధాలు. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు పూర్తిగా పరిష్కారం కాలేదు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉన్నా, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రెండో సవాలు, అమెరికాతో సంబంధాలు దెబ్బతీసే అవకాశం. అమెరికా, భారత్‌ను తన ఫ్రెండ్ గా చూస్తోంది. కానీ, ఈ RIC సమావేశాల్లో భారత్ పాల్గొంటే, అమెరికా దీన్ని చైనాకు మద్దతుగా భావించవచ్చు. అమెరికా, చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు భారత్‌కు సమస్య కావచ్చు. అందుకే, భారత్ ఈ సమావేశాల్లో పాల్గొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

రష్యా ఈ సమావేశాల ద్వారా ఏం సాధించాలనుకుంటోంది? రష్యాకు ఇప్పుడు చైనాతో సంబంధాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఆర్థికంగా, రాజకీయంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ సమావేశాల ద్వారా రష్యా తన ప్రాంతీయ ప్రభావాన్ని పెంచుకోవాలనుకుంటోంది. అలాగే, భారత్-చైనా మధ్య సంబంధాలను మెరుగుపరిచి, ఆసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని రష్యా ఆలోచిస్తోంది. ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తే, ఆర్థిక, భద్రతా విషయాల్లో కలిసి పనిచేయడం సులభమవుతుందని రష్యా భావిస్తోంది. అంతేకాక, ఈ సమావేశాలు బ్రిక్స్, SCO వంటి ఇతర అంతర్జాతీయ వేదికల్లో కూడా మూడు దేశాల సహకారాన్ని పెంచుతాయి.

ఈ సమావేశాలు భవిష్యత్తులో ఏ విధంగా ప్రభావం చూపుతాయి? RIC సమావేశాలు తిరిగి ప్రారంభమైతే, ఆసియా ప్రాంతంలో శాంతి, సహకారం పెరిగే అవకాశం ఉంది. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గితే, ఈ రెండు దేశాలు ఆర్థికంగా, వాణిజ్యపరంగా మరింత సహకరించుకోవచ్చు. అలాగే, రష్యా ఈ సమావేశాల ద్వారా పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయవచ్చు. కానీ, ఈ సమావేశాలు విజయవంతం కావాలంటే, భారత్-చైనా మధ్య నమ్మకం పెరగాలి. లేకపోతే, ఈ సమావేశాలు కేవలం చర్చలకే పరిమితమవుతాయి. భారత్ ఈ సమావేశాల్లో పాల్గొనేటప్పుడు తన జాతీయ ప్రయోజనాలను, అమెరికాతో సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలి.