
Sheikh Hasina’s audio leak: బంగ్లాదేశ్… గతేడాది వరకు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దేశం. కానీ అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. షేక్ హసినాపై తిరుగుబాటు జరిగి.. ఆమె దేశాన్ని విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా అల్లర్ల సమయంలో షేక్ హసినా మాట్లాడిన ఒక్క ఆడియో లీక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఆడియోలో ఆమె పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఆ ఆడియోలో షేక్ హసినా ఏం అంది..? ఆమెపై ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదయ్యాయి..? ఆ సమయంలో అసలు ఏం జరిగింది..?
2024 జూలై 18… ఢాకాలోని గణభవన్ నుంచి షేక్ హసీనా ఒక సీనియర్ పోలీసు అధికారికి ఫోన్ చేశారు. ఆ కాల్‌లో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అలజడి రేపుతున్నాయి. ఎక్కడ కనిపించినా కాల్చేయండి… అవసరమైతే ఆయుధాలు వినియోగించండి అని ఆమె ఆదేశించినట్లు లీక్ అయిన ఆడియోలో ఉంది. ఆ ఆడియోను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి నిజమైనదే అని నిర్ధారించారు. ఆ ఆదేశాల తర్వాత కొన్ని గంటల్లోనే ఢాకా నగరంలో భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. యూనివర్సిటీలు, విద్యాసంస్థల వద్ద విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం… ఆ కాల్పుల్లో 1,400 మంది మరణించారు. Sheikh Hasina’s audio leak.
అల్లర్ల అసలు కారణం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై విద్యార్థుల వ్యతిరేకత వ్యక్తమైంది. 1971లో దేశ విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబాలకు 30% రిజర్వేషన్ ఇవ్వడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. 2018లోనూ ఇలాంటి ఉద్యమం జరిగింది కానీ 2024లో అది తీవ్రంగా మారింది. విద్యార్థులు, పౌర హక్కుల కార్యకర్తలు, సామాజిక వేత్తలు కలిసి ఉద్యమాన్ని పెద్దదిగా మార్చారు. హసీనా ప్రభుత్వం ఆందోళనను అణచివేయడానికి సైనిక స్థాయి ఆయుధాలు వినియోగించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.
ఆందోళనలు తీవ్రంగా మారిన తర్వాత… 2024 ఆగస్టు 5న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆమెను 45 నిమిషాల్లో దేశం విడిచిపెట్టి వెళ్లాలని సైన్యం అల్టిమేటం ఇచ్చింది. ఆమె తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఢాకా నుంచి సీ-130జే సైనిక విమానంలో బయలుదేరి భారత్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆమె పారిపోయే సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి, రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. ఆమె నివాసం, పార్టీ కార్యాలయం, కుటుంబ సభ్యుల ఇళ్లు దాడులకు గురయ్యాయి.
హసీనా పారిపోయిన తర్వాత… బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త పాలన మొదలైంది. హసీనా మీద ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ కేసులు నమోదు చేసింది. ఆమెపై క్రైమ్స్ అగెనెస్ట్ హ్యూమానిటీ , అణచివేతకు ఆదేశాలు ఇచ్చినందుకు, కోర్టు ధిక్కరణ వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై ఇప్పటికే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆమె పార్టీ అవామీ లీగ్‌ను తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది.
హసీనా పార్టీ నాయకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దేశవ్యాప్తంగా ఆందోళనకారులు అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. 29 మంది నాయకులు, వారి కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. జశోర్‌లో ఓ హోటల్‌కు నిప్పు పెట్టి 24 మంది సజీవ దహనమయ్యారు. పార్టీ కార్యాలయాలు, మ్యూజియంలు, ఆలయాలు ధ్వంసమయ్యాయి. హసీనా తండ్రి విగ్రహాన్ని కూడా కూల్చేశారు. ఇప్పుడు షేక్ హసీనా భారత్‌లో రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. ఆమెపై ట్రైబ్యునల్ విచారణ కొనసాగుతోంది. అవామీ లీగ్ పార్టీ నాయకులు కొంతమంది పరారీలో ఉన్నారు, కొంతమంది అరెస్టులో ఉన్నారు. హసీనా తన రాజకీయ జీవితం ముగిసిందని ఆమె కుమారుడు ప్రకటించారు. అవామీ లీగ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం యూనస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
యూనస్ పాలన ప్రారంభమైన ఆరు నెలల్లోనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలమయ్యారు. వ్యాపార రంగం, పరిశ్రమలు మూతపడుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచడంతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. 100కి పైగా వస్తువులపై వ్యాట్ పెంచడంతో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. బ్యాంకింగ్ రంగంలో డిఫాల్ట్ లోన్లు పెరిగాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థను వాడుకుంటున్నారన్నది యూనస్ పాలనపై మరో పెద్ద విమర్శ. పలు సంస్థలకు భారీగా పన్ను మాఫీలు ఇచ్చారు. 666 కోట్ల పన్ను బకాయిలను రద్దు చేశారు. పలు సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులు మళ్లించారు. ప్రెస్ స్వేచ్ఛపై యూనస్ పాలన తీవ్రంగా దాడి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 1,000కి పైగా జర్నలిస్టులను తొలగించారు. ప్రముఖ జర్నలిస్టులు అరెస్టు అయ్యారు. హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఇది మైనారిటీ భద్రతకు ప్రమాదమని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. భారత్‌తో సంబంధాలు… యూనస్ పాలనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూనస్ పాలనలో చైనా, పాకిస్తాన్‌తో సంబంధాలు బలపడుతున్నాయి. యూనస్ పాలనలో ఇస్లామిక్ గ్రూపులకు ప్రోత్సాహం అందుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత్ యూనస్ పై ఆగ్రహంగా ఉంది.