అరేబియా సముద్రం మునిగిన షిప్.. కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు.. కేరళా తీరంలో హైఅలర్ట్..!!

అరేబియా సముద్రంలో ఓ భారీ షిప్ ప్రమాదానికి గురైంది. షిప్ లోని సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డు రక్షించింది. షిప్ లోకి నీరు చేరడంతో మొదట పక్కకు ఒరిగి.. ఆ తర్వాత సముద్రంలో పనికిపోయింది. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఈ షిప్ లో ఉన్న కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, ఆయిల్స్ ఉన్నాయి. దీంతో కొచ్చి తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు..? ఇంతకీ ఆ షిప్ లో ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు ఏంటి..? వాటిని ముట్టుకుంటే ఏమవుతుంది..? సముద్ర తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు..? దీని వల్ల సముద్ర ప్రాణులకు ఎలాంటి ప్రమాదం రానుంది..?

మీరు చూస్తున్న ఈ భారీ కంటైనర్ షిప్ పేరు MSC ఎల్సా 3. లైబీరియాకు చెందిన ఈ షిప్ కేరళలోని కొచ్చి తీరానికి సమీపంలో సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. ఈ షిప్ కేరళలోని విజిన్‌జం పోర్టు నుంచి కొచ్చి వైపు వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఒక కార్గో హోల్డ్‌లో నీరు చేరడం వల్ల ఈ షిప్ మొదట పక్కకు ఒరిగిపోయింది. ఆ తర్వాత ఆదివారం పూర్తిగా మునిగిపోయింది. షిప్‌లో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక రష్యన్ , 20 మంది ఫిలిప్పీన్స్ వాసులు, ఇద్దరు ఉక్రెయిన్ వాసులు, ఒక జార్జియన్ ఉన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. 21 మంది సిబ్బందిని శనివారమే రక్షించారు. మిగిలిన కెప్టెన్, చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ సాల్వేజ్ ఆపరేషన్ కోసం షిప్‌లోనే ఉన్నారు. కానీ ఆదివారం ఉదయం షిప్ మునిగిపోవడంతో వారిని ఇండియన్ నేవీ షిప్ INS సుజాత రక్షించింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య అక్కడే మొదలైంది. మునిగిపోయిన షిప్ లోని కంటైనర్స్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి.

ప్రమాదానికి గురైన MSC ఎల్సా 3 ఓడ అంతకుముందు 640 కంటైనర్‌లను తీసుకువెళ్తోంది. వీటిలో 13 కంటైనర్‌లలో హానికరమైన కార్గో, 12 కంటైనర్‌లలో కాల్షియం కార్బైడ్ ఉన్నాయి. షిప్‌లో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నాయి. అలాగే మెరైన్ గ్యాస్ ఆయిల్, వెరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్ కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీటి లీకేజ్ సముద్ర ప్రాణులకు చాలా ప్రమాదకరం. హానికరమైన కార్గోలో సల్ఫర్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్షియం కార్బైడ్ నీటితో కలిస్తే అసిటిలీన్ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పేలుడు ప్రభావాన్ని కలిగిస్తుంది. మెరైన్ గ్యాస్ ఆయిల్, వెరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్ సముద్ర జీవులకు హానికరం, ఎందుకంటే ఇవి సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తాయి, జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి. సముద్రంలో కెమికల్స్ కలవడం వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. సముద్ర జీవుల శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి, చేపలు, ఇతర సముద్ర జీవులు చనిపోతాయి. ఈ కెమికల్స్ ఒడ్డుకు చేరితే, కేరళ తీరంలోని పర్యాటక ప్రాంతాలు, జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఈ ప్రమాదకరమైన కెమెకల్స్, ఆయిల్స్ ఉన్న కంటైనర్‌లు అలప్పుజా, అంబలప్పుజా, కరుణాగప్పల్లి వంటి తీర ప్రాంతాలను 36-48 గంటల్లో చేరొచ్చని అంచనా వేశారు.

షిప్ ప్రమాదం నేపథ్యంలో కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో పడిన కంటైనర్‌లు, ఆయిల్ ఒడ్డుకు చేరితే, వాటిని ఎవరూ తాకవద్దని, సమీపంలోని కోస్టల్ పోలీస్ స్టేషన్‌కు లేదా 112 ఎమర్జెన్సీ నంబర్‌కు తక్షణం సమాచారం ఇవ్వాలని సూచించింది. మత్స్యకారులు, బీచ్‌లకు వచ్చే పర్యాటకులు, తీరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొచ్చి, త్రిస్సూర్, అలప్పుజా, ఎర్నాకులం, తిరువనంతపురం, కాసర్‌గోడ్ వంటి తీర ప్రాంతాల్లో నిఘా బలోపేతం చేశారు. ICG షిప్ సక్షమ్ ను ఆయిల్ లీకేజీని అడ్డుకోవడానికి సిద్ధం చేశారు. అలాగే అడ్వాన్స్‌డ్ ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ విమానాలను రంగంలోకి దించారు. క్లీనప్ టీమ్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు.

భారతదేశ సముద్ర జలాల్లో గతంలో నౌకా ప్రమాదాలు, ముఖ్యంగా కంటైనర్ షిప్‌లు మునిగి కంటైనర్లు సముద్రంలో పడిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. 2010 ఆగస్టులో, ముంబై తీరంలో MSCచిత్రా అనే కంటైనర్ షిప్ మరో షిప్‌ను ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 800 టన్నుల ఆయిల్ సముద్రంలో కలిసింది, పలు కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. దీని వల్ల ఆయిల్ లీక్ అయ్యి ముంబై తీరంలోని మాంగ్రోవ్ అడవులు, సముద్ర జీవులు తీవ్రంగా నష్టపోయాయి. చేపలు, రొయ్యలు చనిపోవడంతో మత్స్యకారుల జీవనాధారం దెబ్బతింది. సముద్రంలో పడిన కంటైనర్ల నుంచి హానికరమైన రసాయనాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండటంతో భారత కోస్ట్ గార్డ్, నేవీ కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. అలాగే 2017 జనవరిలో, చెన్నైలోని ఎన్నోర్ తీరంలో రెండు కార్గో షిప్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 100 టన్నుల ఆయిల్ సముద్రంలో కలిసిపోయింది. ఈ ఆయిల్ వల్ల ఎన్నోర్ తీరం వెంబడి 30 కిలోమీటర్ల పరిధిలో సముద్ర జీవులు, పక్షులు, తాబేళ్లు చనిపోయాయి. ఆయిల్‌లోని పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ సముద్రంలో కలవడంతో చేపలు విషపూరితంగా మారాయి.. దీంతో మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయాయి. 2021లో శ్రీలంకలోని కొలంబో తీరంలో ఓ కంటైనర్ షిప్‌లో మంటలు చెలరేగి, 1,486 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. ఈ కంటైనర్లలో నైట్రిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నాయి. ఈ ప్రమాదం భారతదేశ తీర ప్రాంతాలు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ తీరాలపై ప్రభావం చూపింది. ఈ ఘటన వల్ల సముద్రంలో ప్లాస్టిక్ గుళికలు, రసాయనాలు కలిసిపోయాయి. ఇవి భారత తీరాలకు చేరాయి. కేరళ, తమిళనాడు తీరాల్లో చేపలు, ఇతర సముద్ర జీవులు చనిపోయాయి. మత్స్యకారులు ఫిషింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది, దీనివల్ల వారి జీవనాధారం దెబ్బతింది. శ్రీలంక ప్రభుత్వం, భారత కోస్ట్ గార్డ్ కలిసి శుభ్రం చేసే పనులను చేపట్టాయి. తాజా ఇప్పుడు MSC ఎల్సా 3 షిప్ ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదంలో వల్ల ఏదైనా రసాయనాలు లీకైతే ఎంత ప్రమాదం సంభవిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఒక్క సముద్ర జీవులకే కాదు.. ఆయిల్, రసాయనాల వల్ల మనుషులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. చర్మ, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆయిల్, కెమికల్స్ సముద్ర గర్భంలో స్థిరపడితే, దశాబ్దాల పాటు పర్యావరణంపై ప్రభావం చూపుతాయి. 2017 చెన్నై ఆయిల్ లీకేజీ ఘటనలో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ 62 రోజుల తర్వాత కూడా అలాగే ఉంది. ఇది సముద్ర జీవులపై దీర్ఘకాలిక విష ప్రభావాన్ని చూపింది. కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ నీటితో కలిస్తే పేలుడు స్వభావం ఉండే వాయువు ఏర్పడి.. ప్రమాదాలకు కారణం కావచ్చు. ఇది తీరు ప్రాంత ప్రజలకు చాలా ప్రమాదం. అందుకే MSC ఎల్సా 3 షిప్ మునిగిన ప్రమాదం కంటే.. ఆ కంటైనర్స్ లోని కెమికల్స్ లీకైతే జరిగే ప్రమాదమే ఎక్కువని ఆందోళన చెందుతున్నారు.