
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంది..? అసలు ఈ కేసు విషయంలో ఎలాంటి రాజకీయ రగడ కొనసాగుతోంది..?
నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈడీ ఈ కేసులో దూకుడు పెంచింది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ, ముంబై, లక్నోలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొంత మందిపై రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో రూ.2,000 కోట్ల విలువైన AJL ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ రూ.50 లక్షలకు స్వాధీనం చేసుకుందని, ఇది మనీ లాండరింగ్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈడీ చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల స్వాధీనం, ఛార్జ్‌షీట్ దాఖలు ప్రధాని మోదీ, అమిత్ షా నడిపిన రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యలని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఆరోపించారు. ఈ చర్యలకు తమ నాయకత్వం లొంగబోదని, సత్యమేవ జయతే అని కాంగ్రెస్ పేర్కొంది. ఈ కేసుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ యూత్ విభాగం నిర్ణయించుకుంది. అటు బీజేపీ సైతం ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. గాంధీ కుటుంబం నేషనల్ హెరాల్డ్ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
ఈ కేసు 2012లో బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఢిల్లీ కోర్టులో వేసిన పిటిషన్ తో మొదలైంది. నేషనల్ హెరాల్డ్ అనేది 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన వార్తాపత్రిక, దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. 2008లో ఆర్థిక ఇబ్బందులతో పత్రిక మూతపడింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి AJLరూ.90.25 కోట్ల రుణం బాకీ ఉంది. 2010లో యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించబడింది. దీనిలో సోనియా, రాహుల్ గాంధీలకు 76% షేర్లు ఉన్నాయి. YIL రూ.50 లక్షలకే రూ.2,000 కోట్ల విలువైన AJL ఆస్తులను స్వాధీనం చేసుకుందని ప్రధాన ఆరోపణ. దీని వల్ల సోనియా, రాహుల్ ఆర్థికంగా లబ్ధి పొందరని ఈడీ ఆరోపిస్తోంది.
2014లో ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు మరికొంతమందికి సమన్లు జారీ చేసింది. YIL అనేది AJL ఆస్తులను రూ.50 లక్షలకు స్వాధీనం చేసుకోవడానికి ఒక సాకుగా సృష్టించబడిందని కోర్టు తెలిపింది. ఇది మోసం, నిధుల దుర్వినియోగం కిందకు లెక్కకు వస్తుందని తెలిపింది. 2015లో సోనియా, రాహుల్ ఈ నోటీసులను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. కానీ హైకోర్టు వారి అప్పీల్‌ను తిరస్కరించింది. డిసెంబర్ 2015లో, సోనియా, రాహుల్ తో పాటు ఇతరులకు పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2021లో ED ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో దర్యాప్తు మొదలుపెట్టింది. AJL ఆస్తుల స్వాధీనం ద్వారా రూ.988 కోట్ల నిధులు మనీ లాండరింగ్‌కు గురయ్యాయని ఆరోపించింది.
ఈ కేసులో గతంలో కూడా ఆస్తుల స్వాధీన చర్యలు జరిగాయి. 2019 మేలో, గురుగ్రామ్‌లో రూ.64 కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను శాశ్వతంగా అటాచ్ చేసింది ED. 2020లో ముంబైలో రూ.16.38 కోట్ల ఆస్తిని అటాచ్ చేసింది. 2023 నవంబర్‌లో ఢిల్లీ, ముంబై, లక్నోలోని రూ.751.9 కోట్ల విలువైన AJL ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. ఈ చర్యలు కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాయి. అయితే కాంగ్రెస్ వీటిని రాజకీయ దురుద్దేశంగా అభివర్ణించింది.
ED ఛార్జ్‌షీట్ ప్రకారం, ఈ కేసులో A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు ఇతర కాంగ్రెస్ నాయకులు AJL ఆస్తులను కుట్ర ద్వారా స్వాధీనం చేసుకుందని ఈడీ పేర్కొంది. రూ.90.25 కోట్ల కాంగ్రెస్ రుణాన్ని రూ.9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి, 99% షేర్లను YILకి బదిలీ చేశారని, దీని ద్వారా రూ.2,000 కోట్ల ఆస్తులు రూ.50 లక్షలకు స్వాధీనమయ్యాయని ED ఆరోపించింది. ఈ ప్రక్రియలో రూ.18 కోట్ల నకిలీ డొనేషన్లు, రూ.38 కోట్ల అడ్వాన్స్ రెంట్, రూ.29 కోట్ల ప్రకటనల ద్వారా నిధులు సమీకరించినట్లు ED తెలిపింది.
సోనియా, రాహుల్ గాంధీ ఈ ఆరోపణలను ఎప్పటి నుంచో ఖండిస్తున్నారు. YIL ఒక నాన్-ప్రాఫిట్ కంపెనీగా, నేషనల్ హెరాల్డ్‌ను నిర్వహించడానికి స్థాపించబడిందని, దీనిలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని వారు వాదిస్తున్నారు. ఈ కేసులో డబ్బు లావాదేవీలు, ఆస్తుల బదిలీ జరగలేదని, ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణలని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. సామ్ పిట్రోడా, సుమన్ దూబే కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మాకరింది. ఢిల్లీ హైకోర్టు నోటీసులు కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, వారు ఈ చర్యలను రాజకీయ కుట్రగా చెబుతున్నారు. ఈ కేసు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.