ISSకి చేరుకోవడం అంత కష్టమా..?

SpaceX’s Crew Dragon: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ నౌక 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ISSతో విజయవంతంగా డాకింగ్ చేసింది. 1984లో రాకేష్ శర్మ తర్వాత, ISSలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అయితే ఈ 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎందుకు 28 గంటలు పట్టింది? ISSలోకి వెళ్లడం అంత కష్టమా? డాకింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతోంది. అలాంటి ఒక కదిలే లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. శుభాంశు శుక్లా ఉన్న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ నౌక ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. ఈ నౌక ISSకి చేరడానికి 28 గంటలు పట్టింది. ఎందుకంటే, ఇది సరిగ్గా ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడం లాంటిది కాదు. ISS, డ్రాగన్ నౌక రెండూ భూమి చుట్టూ ఎగురుతూ ఉంటాయి, కాబట్టి రెండూ ఒకే కక్ష్యలో, ఒకే వేగంతో ఉండాలి. దీనికోసం డ్రాగన్ నౌక ఫాల్కన్-9 రాకెట్ ద్వారా మొదట తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుతుంది. అక్కడ నుంచి, 16 థ్రస్టర్‌లను ఉపయోగించి, క్రమంగా ఎత్తును పెంచుతూ, ISS కక్ష్యతో సమానంగా వెళ్తుంది. ISS భూమి చుట్టూ ఒక్కో రౌండ్‌కు 92 నిమిషాలు తీసుకుంటుంది, డ్రాగన్ మొదట 88 నిమిషాల్లో ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. క్రమంగా ఈ దూరం తగ్గించి, 18 ఆర్బిట్‌ల తర్వాత ISSని చేరుకుంటుంది.

అంతరిక్షంలో డాకింగ్ అనేది చాలా సంక్లిష్టమైన, ఖచ్చితమైన ప్రక్రియ. రెండు నౌకలు, ఒకటి ISS, మరొకటి డ్రాగన్, గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటాయి. వీటిని ఒకదానితో ఒకటి సమీపంగా తీసుకొచ్చి, కలపడం డాకింగ్. ఈ ప్రక్రియలో డ్రాగన్ నౌక ముందుగా ISSతో రెండు వైపులా ఒకే కక్ష్యలోకి రావాలి, దీన్ని రెండెజ్‌వస్ అంటారు. డ్రాగన్ ISSకి 30 కిలోమీటర్ల దూరంలోకి వచ్చిన తర్వాత, అది ISS చుట్టూ ఉన్న 200 మీటర్ల కీప్-అవుట్ స్ఫియర్ లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నుంచి, డ్రాగన్ ఆటోమేటిక్ డాకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. దీనికి GPS, కెమెరాలు సెన్సార్‌లు సహాయపడతాయి. ఈ సెన్సార్‌లు నౌక స్థానం, వేగం, దిశను ఖచ్చితంగా లెక్కిస్తాయి. డ్రాగన్ థ్రస్టర్‌లను ఉపయోగించి, ISS డాకింగ్ పోర్ట్‌తో సరిగ్గా అతుక్కుంటుంది. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియకు సుమారు 10 నిమిషాలు పడుతుంది. అయితే, డాకింగ్ పూర్తయినా, వెంటనే హ్యాచ్‌లు తెరవరు. రెండు నౌకల మధ్య ఒత్తిడిని సమానం చేయడం, లీక్‌ల కోసం తనిఖీలు చేయడం వంటివి జరుగుతాయి. ఈ ప్రక్రియకు మరో గంటన్నర లేదా రెండు గంటలు పడుతుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే హ్యాచ్‌లు తెరిచి వ్యోమగాములు ISSలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రక్రియ చాలా ఖచ్చితమైనది, ఒక్క చిన్న తప్పు జరిగినా ఇక అంతే. SpaceX’s Crew Dragon.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫుట్‌బాల్ మైదానం సైజులో ఉంటుంది, అందులో వివిధ దేశాల వ్యోమగాములు కలిసి పనిచేస్తారు. శుభాంశు శుక్లా వంటి వ్యోమగాములు ISSలోకి ప్రవేశించిన తర్వాత, వారు మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో జీవిస్తారు. దీని వల్ల వారు గాలిలో తేలుతూ ఉంటారు, ISSలో ఆక్సిజన్, నీరు, ఆహారం, విద్యుత్‌ను అందించే అధునాతన వ్యవస్థలుంటాయి. వ్యోమగాములు రోజూ 6-8 గంటలు పరిశోధనలు చేస్తారు, వ్యాయామం చేస్తారు, నిద్రపోతారు, ఆహారం తీసుకుంటారు. ISSలో ఆహారం ప్రత్యేకంగా ప్యాక్ చేసిన డీహైడ్రేటెడ్ ఫుడ్ రూపంలో ఉంటుంది, దీన్ని నీటితో కలిపి తింటారు. శుభాంశు శుక్లా 14 రోజుల పాటు ISSలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు, అందులో ఏడు భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించినవి. ఈ ప్రయోగాల్లో మైక్రోగ్రావిటీలో మొక్కలు, ఆల్గీ, టార్డిగ్రేడ్‌లు ఎలా పెరుగుతాయో అధ్యయనం చేయడం, భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఆహారం, ఇంధనం, జీవన వ్యవస్థల గురించి పరిశోధనలు ఉన్నాయి. ISSలో రోజూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కనిపిస్తాయి, ఎందుకంటే ఇది 92 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. వ్యోమగాములు స్పేస్‌సూట్‌లలో శిక్షణ పొందుతారు, ఎందుకంటే ISS వెలుపల స్పేస్‌వాక్‌లు చేయాల్సి రావచ్చు. ఈ పరిస్థితులు భూమిపై జీవనంతో పూర్తిగా భిన్నంగా ఉంటాయి, కాబట్టి వ్యోమగాములు శారీరక, మానసిక శిక్షణతో సిద్ధం చేయబడతారు.

శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు. 1984లో రాకేష్ శర్మ సోవియట్ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత, 41 సంవత్సరాలకు శుభాంశు ఈ చరిత్ర సృష్టించారు. యాక్సియం-4 మిషన్‌లో పైలట్‌గా ఉన్న శుభాంశు, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్ఞాన్స్కీ-విస్నివ్స్కీ, హంగరీకి చెందిన టిబోర్ కాపు అనే వ్యోమగాములతో కలిసి ఈ మిషన్‌లో భాగమయ్యారు. ఈ మిషన్ జూన్ 25, 2025న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బయలుదేరింది. శుభాంశు తన మొదటి సందేశంలో నమస్కార్, నా ప్రియమైన దేశవాసులారా, 41 సంవత్సరాల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి చేరుకున్నాం. ఈ ప్రయాణం నా ఒక్కడి ది కాదు, భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమం మొదటి అడుగు అని చెప్పారు. ఈ మిషన్ కోసం ISRO రూ. 500 కోట్లు ఖర్చు చేసింది.

Also Read: https://www.mega9tv.com/national/operation-chakra-v-cbi-raids-over-5-states-and-arrested-9-members-of-cyber-frauds/