జ్యోతి గూఢచర్యం.. ISI ఏం ప్లాన్ చేసింది..?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు చేసేకొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. పాకిస్థాన్ అధికారులతో ఆమెకున్న సంబంధాలు.. పాకిస్థాన్ ఐఎస్ఐ భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయంజర్స్ ను ఎలా వాడుకుంటుందో.. జ్యోతి కేసు ద్వారా తెలుస్తోంది. అసలు విచారణలో జ్యోతి మల్హోత్రా చెప్పిన నిజాలేంటి..? ఇంకా ఎంతమందితో పాకిస్థాన్ నిఘా వర్గాలకు సంబంధం ఉంది..? భారత్ కు చెందిన ఏఏ సమాచారం జ్యోతి .. పాకిస్థాన్ కు చేరవేసింది..? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆమె టూర్ వీడియలో ఏ విషయాలు బయటపడ్డాయి..? హైదరాబాద్ రక్షణ విషయాలు జ్యోతి మల్హోత్రాకు పాకిస్థాన్ కు పంపిందా..?

హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనం సృష్టించింది. మే 17న ఆమెను పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి అప్పగించారు. NIA ఆమెను ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకుని, దాదాపు 7 గంటలపాటు ప్రశ్చించింది. దర్యాప్తులో ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఈ విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌తో సంబంధాలు, భారత సైనిక స్థావరాల గురించిన సమాచారం లీక్ చేసిన వివరాలు బయటపడ్డాయి. NIA విచారణలో జ్యోతి మల్హోత్రా 2023 నుంచి పాకిస్థాన్ అధికారి డానిష్ తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సమాచారం పంపింది. భారత సైనిక స్థావరాలు, సరిహద్దు కదలికల గురించిన కీలక వివరాలు ఆమె ISIకి చేరవేసినట్లు గుర్తించారు. ఆమె ఫోన్‌లోని చాట్ లాగ్‌లు డిలీట్ చేసినా, ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా కొన్ని కీలక మెసేజులను తిరిగి రాబట్టారు. ఆమె పాకిస్థాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందు గురించి వీడియో కూడా తీసినట్లు బయటపడింది. ఇది ఆమెకు పాక్ అధికారులతో సంబంధాలను బయటపెడుతోంది.

జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానెల్ ట్రావెల్ విత్ జోని ఉపయోగించి, ట్రావెల్ వ్లాగర్‌గా ప్రయాణాలు చేస్తూ సమాచారం సేకరించింది. ఆమె పాకిస్థాన్‌ను మూడుసార్లు, అలాగే చైనా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌లను సందర్శించింది. ఈ పర్యటనల సమయంలో ఆమె ISI ఏజెంట్లతో సంప్రదింపులు జరిపింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో ఆమె సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఆమె సైనిక స్థావరాల సమాచారాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సేకరించి, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా పంపింది. ఈ సమాచారం పహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనలకు సహాయపడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్ లో మెట్రో రైలు ప్రారంభించినప్పుడు కూడా అమె ఇక్కడకు వచ్చింది. మొత్తం వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. అప్పుడు జ్యోతి ఎక్కడెక్కడ ఉంది.. ఎవరిని కలిసింది అనే విషయాలు రాబడుతున్నారు. హైదరాబాద్ లోని కీలక రక్షణ సంస్థలకు సంబంధించిన సమాచారం ఏమైనా జ్యోతి పాకిస్థాన్ చేరవేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఆమె లగ్జరీ లైఫ్ గడుపుతోంది. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సరిగ్గా చెప్పడం లేదు. జ్యోతి యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే.. ఆమె ఖరీదైన హోటళ్లలో బస చేయడం, విదేశీ పర్యటనలు, లగ్జరీ బ్రాండ్ ఉత్పత్తుల వాడకాన్ని తెలియజేస్తాయి. దర్యాప్తులో ఆమెకు ISI నుంచి వచ్చిన నిధులతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలను NIA పరిశీలిస్తోంది. ఇందులో పాకిస్థాన్ నుంచి డబ్బు బదిలీలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆమె సోషల్ మీడియాలో చూపించిన లగ్జరీ జీవనం, ఆమెకు వచ్చే ఆదాయంతో సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు.

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా పహల్గాంను సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె ఈ ప్రాంతంలో సైనిక కదలికలు, భద్రతా ఏర్పాట్ల గురించి సమాచారం సేకరించి, ISIకి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె పర్యటన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలుగా మారాయి. అలాగే జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌కు మూడుసార్లు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ISI ఏజెంట్లతో సమావేశమైనట్టు తెలిసింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్న వీడియో వైరల్ అయింది. ఈ సందర్భంలో ఆమె డానిష్ అనే అధికారితో సన్నిహితంగా మాట్లాడినట్లు గుర్తించారు. ఆమె ట్రావెల్ వీడియోలు సాధారణ టూరిస్ట్ కంటెంట్‌లా కనిపించినప్పటికీ, వాటిలో దాగి ఉన్న సమాచారం డానిష్ లాంటి వారి ద్వారా ISIకి చేరినట్లు దర్యాప్తులో తేలింది. జ్యోతి మల్హోత్రా భారత సైనిక స్థావరాలు, సరిహద్దు భద్రతా ఏర్పాట్ల గురించిన సమాచారాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సేకరించి, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ISIకి పంపింది. ఆమె జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పర్యటించి, సైనిక కార్యకలాపాల గురించి వివరాలు సేకరించింది. ఆమె సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి, సాధారణ ట్రావెల్ కంటెంట్‌గా ఈ సమాచారాన్ని పంపినట్లు తెలిసింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక సమాచారం కూడా ఆమె ద్వారా లీక్ అయినట్లు NIA గుర్తించింది. జ్యోతి మల్హోత్రా కేసును హరియాణా పోలీసులు మొదట దర్యాప్తు చేసినా.., దాని తీవ్రతను గమనించి ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి అప్పగించారు. NIAతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ కేసు దర్యాప్తులో పాల్గొంటోంది. జ్యోతి ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా కార్యకలాపాలు, విదేశీ పర్యటనలపై లోతైన విచారణ చేస్తున్నాయి.

జ్యోతి మల్హోత్రాతో పాటు ఆరుగురు భారతీయులను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 14 మందిని హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు కూడా పాకిస్థాన్ ISI కోసం గూఢచర్యం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో సెక్యూరిటీ గార్డ్, విద్యార్థి, వ్యాపారి వంటి విభిన్న నేపథ్యాల వ్యక్తులు ఉన్నారు. పాకిస్థాన్ ISI జ్యోతి మల్హోత్రాను ఆమె సోషల్ మీడియా ప్రభావాన్ని, ట్రావెల్ వ్లాగర్‌గా ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకుంది. ఆమె యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా సాధారణ పర్యాటకురాలిగా కనిపిస్తూ, సైనిక స్థావరాల సమీపంలో సమాచారం సేకరించింది. ఆమెను ISI ఏజెంట్ డానిష్ ద్వారా కంట్రోల్ చేశారని, ఆమెకు ఆర్థిక ప్రోత్సాహకాలు, విదేశీ పర్యటనలకు సహాయం అందించారని తెలిసింది. ఆమె సోషల్ మీడియా కంటెంట్‌లో దాగి ఉన్న సమాచారాన్ని ISI డీకోడ్ చేసి ఉపయోగించుకుంది. ఈ విధంగా, ఆమెను ఒక సాధారణ యూట్యూబర్‌గా ఉపయోగించి, భారత భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని సేకరించారని అనుమానిస్తున్నారు.