పాకిస్థాన్ అధికారిక కార్యక్రమాల్లో ఉగ్రవాదులు.. సాక్ష్యం ఇదే.. ట్రంప్ ఇప్పుడు చెప్పాలి..?

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు సాధారణ ప్రజల్లో కలిసిపోయి తిరుగుతున్నారు. అయినప్పటికీ ఆ దేశం మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా పాకిస్థాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీ పాల్గొన్నాడు. అతనితో పాటు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా హాజరయ్యాడు. పాకిస్థాన్ బరితెగింపును ఏం అనాలి… ? పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? హఫీజ్ సయీద్‌ ఎలాంటి రాజభోగాలు అనుభవిస్తున్నాడు? ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ఎంపీలు ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ను ఎలా ఎండగడుతున్నారు..?

పాకిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డా అని భారత్ ఎప్పుడూ చెబుతూనే ఉంది. ప్రపంచం ముందు పాకిస్థాన్ తీరును ఎండగడుతూనే ఉంది. అయినా పాకిస్థాన్ బరితెగింపునకు హద్దు అదుపు ఉండటం లేదు. అక్కడ ఉగ్రవాదులు పబ్లిక్ గా తిరుగుతున్నారు. ప్రబుత్వ కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు. పాకిస్థాన్‌లోని కసూర్‌లో పీఎంఎంఎల్ ఆధ్వర్యంలో ఓ ర్యాలీ జరిగింది. ఇది పాకిస్థాన్ అణు పరీక్షల వార్షికోత్సవం ర్యాలీ. ఈ కార్యక్రమానికి పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీ, హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ హాజరయ్యారు. ఈ ర్యాలీ భారత వ్యతిరేక నినాదాలు, జిహాదీ పిలుపులతో నిండిపోయింది. సైఫుల్లా కసూరీ, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్‌గా, పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను చంపిన దాడిని సమన్వయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తల్హా సయీద్, భారత్‌లో అత్యంత వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 32వ స్థానంలో ఉన్నాడు. ఈ ర్యాలీలో పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మలిక్ అహ్మద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు, ఇది ఉగ్రవాదులకు పాకిస్థాన్ లో రాజకీయ మద్దతు ఉన్నట్టు క్లియర్ కట్ గా తెలియజేస్తోంది.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఈ ర్యాలీలో పాల్గొనడమే భారతకు వ్యతిరేకంగా విషాన్ని కక్కుతున్నారు. వారు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, భారత వ్యతిరేకతను రెచ్చగొట్టడం చేస్తున్నారు. పహల్గామ్ దాడికి తనను నిందించారని.., ఇప్పుడు తన పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందని సైఫుల్లా కసూరీ వ్యాఖ్యానించాడు. అతను ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట అలహాబాద్‌లో రోడ్డు, ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించాడు. తల్హా సయీద్ జిహాదీ నినాదాలతో రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. ఎల్‌ఈటీ ఆధ్వర్యంలోని పీఎంఎంఎల్ ఈ ర్యాలీని నిర్వహించడం ద్వారా ఉగ్రవాదులకు రాజకీయ వేదికను కల్పించింది. ఈ ర్యాలీలో ఉగ్రవాదులు పాల్గొనడం వారికి పాకిస్థాన్‌లో రక్షణ, స్వేచ్ఛ ఉన్నాయని తెలియజేస్తోంది. ఈ సంఘటన భారత్‌పై దాడులు చేసే ఉగ్రవాదులకు పాకిస్థాన్ సేఫ్ హౌస్ గా మారిందని నిరూపిస్తోంది.

ఉగ్రవాదులకు పాకిస్థాన్ అనేక రాజభోగాలు కల్పిస్తోంది. సైఫుల్లా కసూరీ వంటి వారు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ జిహాదీ ప్రసంగాలు ఇస్తున్నారు. అతను పాకిస్థాన్ సైన్యం ఆహ్వానంపై కంగన్‌పూర్‌లో సైనికులకు మోటివేషన్ స్పీచ్ లు ఇచ్చాడు. ఉగ్రవాదులకు శిక్షణ క్యాంపులు, ఆధునిక ఆయుధాలు, రవాణా సౌకర్యాలు అందిస్తున్నారు. అబ్బొటాబాద్‌లో శిక్షణ క్యాంపులు నిర్వహించి, యువతను రెచ్చగొట్టి, సరిహద్దు దాటి భారత్ లోకి పంపుతున్నారు. పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ ఈ కార్యకలాపాలకు లాజిస్టికల్, ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాద నాయకులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత, హఫీజ్ సయీద్‌కు భారత్ నుంచి ముప్పు ఉందని భావించి, పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతని భద్రతను పెంచాయి. మాజీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను అతని రక్షణకు నియమించారు.

హఫీజ్ సయీద్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు కాగితాలపై చూపిస్తున్నా, గత మూడేళ్లలో 20 సార్లకు పైగా ప్రజల మధ్య కనిపించాడు. లాహోర్‌లోని అతని నివాసంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. అతను పీవోకేలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లు, మురిద్కే, బహవల్పూర్ క్యాంపుల్లో తరచూ కనిపిస్తున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లో హఫీజ్ సయీద్‌తో పాటు అనేక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారు. అల్-ఖైదా, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ ః, జైష్-ఎ-మహ్మద్ వంటి సంస్థల నాయకులు పాకిస్థాన్‌లో సురక్షితంగా ఉన్నారు. ఈ ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేసినా, పాకిస్థాన్ వారికి రక్షణ అందిస్తోంది. అంటే నేరుగానే వారిని దాడులకు ఉసిగొల్పుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఐసీ-814 హైజాకింగ్‌లో పాల్గొన్న యూసుఫ్ అజార్, పుల్వామా బాంబు దాడిలో పాల్గొన్న అబ్దుల్ మాలిక్ రవూఫ్ వంటి ఉగ్రవాదులు కూడా పాకిస్థాన్‌లో ఉన్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ సైన్యం హాజరవ్వడం, ర్యాలీల్లో ఉగ్రవాదులు పాల్గొనడం ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనడానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. చనిపోయిన ఉగ్రవాదుల శవాలను పాకిస్థాన్ జాతీయ జెండాలో చుట్టి, సైన్యం గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపింది. ఎల్‌ఈటీ రాజకీయ విభాగం అధ్యక్షుడు ఫైసల్ నదీమ్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ సంఘటనలు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఎలా ప్రోత్సహిస్తుందో తెలియజేస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లింది. భారత్ పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ప్రపంచ దేశాలకు వివరిస్తోంది. దీనికి ఆధారాలుగా ఈ ర్యాలీలు, అంత్యక్రియల వీడియోలను చూపిస్తోంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత ఎంపీలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతును బయటపెడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సింగపూర్‌ పర్యాటనలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైనిక అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవ్వడం ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. భారత ఎంపీలు అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల్లో పర్యటిస్తూ, పాకిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గంగా ఎలా మారిందో వివరిస్తున్నారు. వారు ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్ వంటి సంస్థలను కలుస్తూ, పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం చేస్తే ఆ నిదులు ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని ఆధారాలతో వివరిస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా, భారత్ పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతోంది, అంతర్జాతీయంగా దాని పాక్ ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తోంది.

పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని ప్రపంచ దేశాలకు భారత ఎంపీలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ నేరుగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని ఆధారాలు చూపిస్తున్నారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌లో చంపబడిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు సైన్యం హాజరైన వీడియోలను, ర్యాలీల్లో సైఫుల్లా కసూరీ, తల్హా సయీద్ పాల్గొన్న ఫొటోలను ఆధారాలుగా చూపిస్తున్నారు. ఇండస్ వాటర్స్ ట్రీటీని భారత్ రద్దు చేసినందుకు వాటర్ అగ్రెషన్ అని పాకిస్థాన్ ఆరోపిస్తోందని, కానీ అది ఉగ్రవాదంపై దృష్టి మళ్లించే ప్రయత్నమని ఎంపీలు వివరిస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా, అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించి, పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించేలా చేయడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా, భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన నిబద్ధతను, పాకిస్థాన్ దుర్మార్గాన్ని అంతర్జాతీయంగా బహిర్గతం చేస్తోంది.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరగడం, ర్యాలీల్లో పాల్గొనడం ఆ దేశం ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును స్పష్టంగా చూపిస్తోంది. సైఫుల్లా కసూరీ, తల్హా సయీద్ వంటి వారు ర్యాలీల్లో భారత వ్యతిరేక నినాదాలు చేయడం, ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు సైన్యం గౌరవం ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాద స్వర్గంగా మారింది. భారత్ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తూ, ఎంపీల ద్వారా ప్రపంచ దేశాల్లో పర్యటనలు చేస్తూ, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. ఈ సంఘటనలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అంతర్జాతీయ సహకారం ఎంత అవసరమో చూపిస్తున్నాయి. భారత్ ఈ దిశగా చేస్తున్న కృషి ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కీలకమైన అడుగు.