విమాన ప్రమాదంపై కీలక నిర్ణయాలు..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని షాక్‌లోకి నెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని వేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు ఏంటి..? బోయింగ్ విమానాల విషయంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది..? డీఎన్ఏ పరీక్షల పురోగతి ఏంటి? అటు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ చూస్తోన్న టర్కీ సంస్థపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి..?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలైంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫోరెన్సిక్ టీమ్‌లు ప్రమాద స్థలాన్ని సూక్ష్మంగా పరిశీలించాయి. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటి డీకోడింగ్ పని జరుగుతోంది. విమాన శకలాలు, ఇతర శాంపిల్స్ సేకరించారు. ఫోరెన్సిక్ టీమ్ సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కోణాలను చూస్తోంది. పైలట్ టేకాఫ్‌కు ముందు మేడే కాల్ చేశాడని, ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కాంటాక్ట్ తెగిపోయిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. సాంకేతిక లోపం, మానవ తప్పిదం, లేదా బయటి కారణాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ దర్యాప్తు పారదర్శకంగా, పూర్తిగా జరుగుతుందని అధికారులు హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం హోం సెక్రటరీ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి మల్టీ-డిసిప్లినరీ కమిటీని వేసింది. ఈ కమిటీలో విమానయాన నిపుణులు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, భద్రతా నిపుణులు ఉన్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనిపెట్టడం, ప్రస్తుత విమాన భద్రతా ప్రమాణాలు, ఆపరేటింగ్ విధానాలను సమీక్షించడం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి కఠినమైన భద్రతా నిబంధనలు రూపొందించడం ఈ కమిటీ లక్ష్యం. ఈ కమిటీ మూడు నెలల్లో తన రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది. ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తూ, AAIB, DGCA దర్యాప్తులతో సమాంతరంగా సాగుతుంది. దీనివల్ల దర్యాప్తు పూర్తి నీతితో జరుగుతుందని అంటున్నారు.

ఘటన జరిగిన రోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆ సమయంలో ఉన్నతాస్థాయి అధికారులతో మాట్లాడారు. తాజాగా ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. DGCA, AAIB, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదట, సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి కమిటీ వేశారు. రెండోది, బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణను వేగం చేయడం. మూడోది, దేశవ్యాప్తంగా విమాన భద్రతా ప్రమాణాలను, ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ విధానాలను తనిఖీ చేయడం. నాలుగోది, బాధిత కుటుంబాలకు వెంటనే సహాయం, పరిహారం ఇవ్వడం. ఐదోది, హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి, సహాయక చర్యలను వేగం చేయడం. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. తన తండ్రి కూడా ప్రమాదంలోనే చనిపోయారని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు.

ఈ ప్రమాదంలో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కూలిపోవడంతో, బోయింగ్ విమానాల నాణ్యత, భద్రతపై పెద్ద ప్రశ్నలు ఎదురయ్యాయి. DGCA ఆధ్వర్యంలో బోయింగ్ విమానాలపై పెద్ద ఎత్తున తనిఖీలు మొదలయ్యాయి. ఈ తనిఖీల్లో రెక్కల డిజైన్, క్యాబిన్ సెటప్, ఏరోడైనమిక్ సిస్టమ్స్, టేకాఫ్ సమయంలో కీలకమైన స్లాట్‌లు, ఫ్లాప్‌ల సెట్టింగ్‌లు, ఇంజన్ పనితీరు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెయింటెనెన్స్ రికార్డులను చెక్ చేస్తున్నారు. బోయింగ్ 787 సిరీస్ విమానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఎందుకంటే గతంలో ఈ సిరీస్‌లో కొన్ని సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. బోయింగ్ సంస్థ సానుభూతి చూపిస్తూ, ఎయిర్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నామని, దర్యాప్తుకు పూర్తి సహాయం చేస్తామని చెప్పింది. కానీ ఈ ప్రమాదం బోయింగ్ షేర్లపై బాగా ప్రభావం చూపింది. అమెరికా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ షేర్లు 8% పడిపోయాయి.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విమాన భద్రతా తనిఖీలు సరిగా జరగలేదని, టర్కీకి చెందిన ఒక భద్రతా సంస్థ బాధ్యతలో లోపాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ అహ్మదాబాద్ విమానాశ్రయంలో భద్రతా సేవలు అందిస్తోంది. ప్రయాణికుల స్క్రీనింగ్, లగేజ్ తనిఖీల్లో నిర్లక్ష్యం చూపిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై టర్కీ సంస్థ వివరణ ఇస్తూ, అహ్మదాబాద్ విమానాశ్రయంలో అన్ని భద్రతా నిబంధనలనూ ఖచ్చితంగా పాటించామని, DGCA, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ మార్గదర్శకాలను అనుసరించామని చెప్పింది. ఈ ప్రమాదానికి భద్రతా తనిఖీలతో సంబంధం లేదని, ఇది సాంకేతిక లేదా ఆపరేషనల్ సమస్య కావచ్చని చెప్పింది. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ ఆరోపణలపై NIA, BCAS దర్యాప్తు చేస్తున్నాయి. భద్రతా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది చనిపోయారని అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ చెప్పారు. చనిపోయిన వారిలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 మంది పోర్చుగల్ వాసులు, ఒక కెనడియన్, 10 మంది చిన్నారులు, ఇద్దరు పసిపాపలు ఉన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి అహ్మదాబాద్ సిటీ ఆస్పత్రులకు తరలించారు. డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోంది, ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నారు. మృతుల గుర్తింపు పూర్తయిన తర్వాత, శవాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ కష్టంగా ఉన్నప్పటికీ, అధికారులు త్వరగా పూర్తి చేయడానికి కష్టపడుతున్నారు.

ప్రమాద స్థలంలో NIA, AAIB, DGCA, ఫోరెన్సిక్ టీమ్‌లు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నాయి. విమాన శకలాలు, ఇంజన్ భాగాలు, బ్లాక్ బాక్స్ డేటా, పైలట్ల శిక్షణ, ఆరోగ్యం, ఆపరేషనల్ నిర్ణయాలు, విమానాశ్రయ భద్రతా తనిఖీలు, లగేజ్ స్క్రీనింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ రికార్డులు, ఉగ్రవాద కోణం, వాతావరణ కారణాలను పరిశీలిస్తున్నారు. విమానం ఢీకొన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పూర్తిగా కాలిపోయి, కూలిపోయే ప్రమాదం ఉందని అగ్నిమాపక అధికారులు హెచ్చరించారు. అందుకే సహాయక చర్యలను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. దర్యాప్తు రిపోర్ట్ వచ్చే వరకు, అన్ని కోణాలను పూర్తిగా చెక్ చేస్తున్నారు.