
Former Prime Minister PV Narasimha Rao: ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహుభాషాకోవిదులు, న్యాయవాదిగా, దౌత్యవేత్తగా, రచయితగా భిన్న పార్శ్వాలను ప్రదర్శించగల అపరచాణక్యుడు ఆయన. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు నరసింహారావును బ్రిటిష్ ప్రభుత్వం అనేకసార్లు అరెస్టు చేసింది. వివిధ భాషలపై పట్టు ఉండటం వల్ల వలసవాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడంలో ప్రత్యేకంగా విజయం సాధించారాయన. ప్రధాని, ముఖ్యమంత్రిగానే కాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఎన్నో కీలక పదవులను చేపట్టారు. రచయితగా ఎన్నో రచనలు తెలుగులోకి అనువదించారు, స్వీయకథ రాసుకున్నారు.
తొలి తెలుగు భారత ప్రధానిగా చరిత్ర లిఖించారు. భారత్ ను ఆర్థిక మాంద్యం నుంచి తప్పించేందుకు నూతన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరుడైన పీవీ నరసింహారావు.. రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నేడు ఆయన 104వ జయంతి సందర్భంగా
పీవీ వ్యక్తిగత, రాజకీయ, సాహితీ విశేషాల గురుంచి తెలుసుకుందాం:
నేపథ్యం:
1921 జూన్ 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారు పి.వి.నరసింహారావు. తండ్రి సీతారామారావు, తల్లి రుక్నాబాయిలు. అయితే కరీంనగర్ జిల్లావాసులైన పాములపర్తి రంగారావు దంపతులు పి.వి.ను దత్తత తీసుకోవడంతో పాములపర్తి నరసింహారావుగా మారిపోయారు. స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. చిన్ననాటి నుంచి సంగీతం, సినిమా, నాటకాలంటే ఎంతో మక్కువ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ, నాగ్‌పూర్ యూనివర్సిటీలలో చదువుకున్నారు.
1938లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారి పాలనను ధిక్కరిస్తూ.. వందేమాతరం గేయాన్ని పాడారు. దీనివల్ల ఆయన చదువుకుంటున్న ఓయూ నుంచి ఆయన్ను బహిష్కరించారు. అనంతరం ఓ మిత్రుడి సాయంతో నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో చేరి, 1940-44 వరకు ఎల్.ఎల్.బీ చదివేందుకు నాలుగేళ్లు అక్కడే ఉన్నారు.
స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావుల స్పూర్తితో స్వాతంత్ర్యోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి, అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేశారు. తర్వాత 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు.
1931లో పీవీ నరసింహారావుకి, సత్యమ్మతో వివాహమైంది. వీరిద్దరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. ఈమె 1977లో చనిపోయారు. Former Prime Minister PV Narasimha Rao.
రచనా ప్రస్థానం:
భారతీయ ఫిలాసఫీ, భారతీయ సంస్కృతి, వ్యాసాలు రాయడం, రాజకీయ వ్యాఖ్యానం, తెలుగేతర భాషల్లోనూ కవితలు రాయడం.. ఇవి ఆయనకున్న వ్యాపకాలు. వీటితోపాటు ఇతర భాషలపైన పట్టు సాధించారు. ఎనలేని ప్రావీణ్యం పొందారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయి పడగలు’ నవలను ‘సహస్ర ఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. అలాగే శ్రీహరి నారాయణ్ అప్టే ‘పన్ లక్షత్ కోన్ గెటో’ అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువదించారు. ఇలా మరాఠీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోనూ అనేక అనువాద రచనలు చేశారు.
వివిధ పత్రికల్లో కలం పేరుతో అనేక వ్యాసాలు రాయడం.. అమెరికా, పశ్చిమ జర్మనీలోని యూనివర్సిటీల్లో రాజకీయాంశాలపై కీలక ప్రసంగాలు చేశారు.
రాజకీయాలు, రచనలతోపాటు, కంప్యూటర్ ను విరివిరిగా ఉపయోగించారు పీవీ. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.
‘ఇన్‌సైడర్’ ఆయన రాసుకున్న స్వీయ ఆత్మకథ. లోపలి మనిషి దీనికి తెలుగు అనువాదం.
‘సహస్రఫణ్’కు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బహుమతి వచ్చింది.
‘పన్ లక్షత్ కోన్ ఘెట్’తో అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
ప్రముఖ రచయిత్రి ‘జయప్రభ’ రాసిన కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
ఇవేగాక ఆ తర్వాత మరెన్నో వ్యాసాలు ఆయన కలం పేరుతో వచ్చాయి.
రాజకీయాల్లోకి..
- 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం విశేషం.
- 1962-64 న్యాయ, సమాచార శాఖ మంత్రి,
- 1964-67 న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి,
- 1967లో ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి,
- 1968-71 విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
- 1971-73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
- 1972 నుంచి మద్రాస్‌లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షుడిగా,
- 1968-74 ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్మన్,
- 1975-76 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,
- 1957-77 మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు.
- 1977-84 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు.
- 1984 డిసెంబర్‌లో రామ్‌టెక్ నుంచి 8వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- 1978-79లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా లండన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఆసియన్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నిర్వహించిన దక్షిణాసియా సదస్సులో పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.
- 1980 జనవరి 14 నుంచి 1984 జులై 18వరకు విదేశాంగమంత్రిగా పని చేశారు.
- 1984 జులై 19న హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- 1984 నవంబర్ 5న ఆయనకు ప్రణాళికా శాఖను కూడా అప్పగించారు.
- 1984, డిసెంబర్ 31 నుంచి 1985, సెప్టెంబర్ 25 వరకు రక్షణమంత్రిగా ఉన్నారు.
- 1985, సెప్టెంబర్ 25 మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సీఎంగా…
అధికారపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ప్రజలు, ఉద్యమనేతల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిని చెయ్యడం అనివార్యమైంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారు లేకపోలేదు. వివాదాలకు ఆమడదూరంలో ఉండే ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకు చెందని ఆయన రాజకీయ నేపథ్యమే 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని చేపట్టేలా చేశాయి. ఇంతలోనే పార్టీలో అసమ్మతి నెలకొంది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ లకు ఆయన తిరగాల్సి వచ్చింది. Former Prime Minister PV Narasimha Rao.
ఈ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించని కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఓ ఉద్యమాన్ని చేపట్టారు. అదే ‘జై ఆంధ్ర ఉద్యమం’.
పీవీని పక్షపాతిగా భావించిన ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఉద్యమంలో భాగంగా రాజీనామాలకు పాల్పడ్డారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానాలను భర్తీ చేసే ఉద్దేశంతో 1973 జనవరి 8న కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
అయితే పార్టీ అధిష్టానం ఆలోచన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరుసటి రోజే కేంద్రం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఈ రకంగా పీవీ ముఖ్యమంత్రి శకం ముగిసింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలను అమలుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం ఆయన వల్లే వచ్చిందనడంలో సందేహం లేదు.
- 1972 నుంచి మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భూ సంస్కరణలు, భూ సీలింగ్ చట్టాన్ని అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
కేంద్రంలో…
సీఎం పదవి అనంతరం.. పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం ఒకేసారి జరిగాయి. మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండోసారి కూడా ఎన్నికయ్యారు. మూడో పర్వం.. ఎనిమిది, తొమ్మిదో లోక్‌సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎన్నికయ్యారు. Former Prime Minister PV Narasimha Rao.
- 1991లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికవ్వడంతో.. పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు.
- 1980-89 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాలశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను అధిరోహించాడు.
- 1974లో.. విదేశీ వ్యవహారాలమంత్రి హోదాలో
- బ్రిటన్, పశ్చిమ జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు.
- ఇదే సమయంలో అంతర్జాతీయ దౌత్యవేత్తగా ఆయన ప్రజ్ఞాపాటవాలను చూపారు.
- 1980 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన యునిడో 3వ సదస్సుకు అధ్యక్షత వహించారు. అదే ఏడాది మార్చిలో న్యూయార్క్ వేదికగా 77 దేశాల సమావేశానికి కూడా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
- 1981 ఫిబ్రవరిలో అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్న తీరు ప్రశసనీయమనే చెప్పాలి.
- జాతీయ, అంతర్జాతీయ ఆర్థికాంశాలపై వ్యక్తిగత శ్రద్ధ కలిగిన పీవీ 1981లో కారకస్‌లో జరిగిన 77 దేశాల ఈసిడిసి సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించారు.
- ముఖ్యంగా, భారతదేశానికి, భారత విదేశాంగ విధానానికి 1982, 1983 సంవత్సరాలు అనేవి ఎంతో కీలకమైనవి.
- గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భాగంగా, అలీనోద్యమం 7వ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాల్సిందిగా భారత్‌ను కోరడమైంది. దీంతో అలీనోద్యమ అధ్యక్ష స్థానాన్ని భారత్ అలంకరించగా, ఇందిరాగాంధీ అలీనోద్యమానికి ఛైర్ పర్సన్ కాగా, పీవీ అధ్యక్షత వహించారు.
- 1983 నవంబర్‌లో పాలస్తీనా సమస్యకు, పశ్చిమాసియా దేశాల్లో పర్యటించిన నరసింహారావు, అలీన దేశాల ప్రత్యేక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.
- సైప్రస్ అంశానికి సంబంధించి కార్యాచరణ బృందం సమావేశంలో, న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సులో కూడా ఈయన క్రియాశీలక పాత్ర పోషించారు.
- విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో అమెరికా, రష్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం, టాంజానియా మొదలైన దేశాలతో సంయుక్త కమిషన్లకు భారత్ తరపున నరసింహారావు నాయకత్వం వహించడం విశేషం.
పీఎంగా…
రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో 1991లో, అనుకోకుండా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పీవీ. ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీలేని పరిస్థితి అది. ఈ తరుణంలో కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకున్న అపార అనుభవం ఇక్కడ ప్లస్ అయింది. ఏకంగా ఐదు సంవత్సరాల పూర్తికాల పరిపాలనను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల జాబితాలో పీవీ చేరారు.
పీవీ సాధించిన విజయాలు:
- పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయి.
- భారతదేశ ఆర్థిక సంస్కరణల కోసం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్థిక సరళీకరణలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. నరసింహారావు ఆర్థిక మంత్రి డా. మన్మోహన్ సింగ్‌తో కలిసి 1991 కొత్త ఆర్థిక విధానాన్ని రూపొందించారు. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం, స్థానిక వ్యాపారాలను క్రమబద్ధీకరించడం, మూలధన మార్కెట్‌ను సంస్కరించడం, దేశం ద్రవ్య లోటును తగ్గించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను దేశంలో ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో ఈ ఆర్థిక విధానం ముఖ్యమైన పాత్ర పోషించింది. సరళీకరణ(లిబరలైజేషన్), ప్రైవేటీకరణ(ప్రైవైటైజేషన్), ప్రపంచీకరణ(గ్లోబలైజేషన్)ను వీరు అనుసరించిన LPG విధానాల నేపథ్యంలో, భారతదేశం ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా స్థిరపడింది. ఈ విషయాల కారణంగానే పీవీని ‘ఆర్థిక సంస్కరణల పితామహుడి’గా అభివర్ణిస్తారు.
- ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు,
- తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు కలిగి ఉండడం, చైనా-ఇరాన్ లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి, విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన విజయాలుగా చెప్పవచ్చు.
- 1998లో వాజ్ పేయి ప్రభుత్వం నిర్వహించిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే.