అదే జరిగితే భారత్ పరిస్థితేంటి..?

Iran-Israel war tensions: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఒక వేళ ఈ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తే భారత్ లో పెట్రోల్ ధరలు రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ జలసంధి ఎందుకంత కీలకం? ఇక్కడి నుంచి ఏ దేశాలకు చమురు ఎగుమతులు జరుగుతాయి? ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే భారత్‌ ఎందుకు కష్టాల్లో పడుతుంది? అమెరికా, యూరప్ దేశాలు ఈ జలసంధిని ఎందుకు కాపాడతాయి? రవాణా నిలిచిపోతే వాటి పరిస్థితి ఏంటి?

ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తత వేళ ఇప్పుడు ఓ కొత్త అంశం భారత్ తో పాటు ప్రపంచంలోని అగ్రదేశాలను భయపెడుతోంది. అదే హోర్ముజ్ జలసంధి. ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రంతో కలుపుతుంది. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ప్రపంచ చమురు సరఫరాలో 20%, అంటే రోజుకు 20.9 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. ప్రపంచంలోని మూడింట ఒక వంతు లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతర్, ఇరాన్ వంటి దేశాల నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులు ఈ జలసంధి ద్వారానే జరుగుతాయి. 83% చమురు ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాకు వెళ్తుంది. అలాగే అమెరికా, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచి చమురు ఎగుమతి అవుతుంది. ఈ జలసంధిని కాని ఇరాన్ అడ్డుకుంటే.. ఇక చమురు దిగుమతి దేశాల్లో అల్లకల్లోలమే అంటున్నారు విశ్లేషకులు.

సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతర్, ఇరాన్‌ల నుంచి చమురు, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ఎగుమతులు ఈ మార్గం ద్వారా ఆసియా, యూరప్, అమెరికాలకు చేరతాయి. 2024లో, ఈ జలసంధి ద్వారా వెళ్లిన 84% చమురు, 83% LNG ఆసియా మార్కెట్లకు చేరింది. భారత్‌కు 90% చమురు దిగుమతుల్లో 40% ఈ గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఖతర్ నుంచి భారత్‌కు 80% LNG ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఇరాన్ స్వయంగా 2.1 మిలియన్ బ్యారెల్స్ చమురును, ముఖ్యంగా చైనాకు, ఈ జలసంధి ద్వారా ఎగుమతి చేస్తుంది. ఈ మార్గం బ్లాక్ అయితే, గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోతాయి, దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది. Iran-Israel war tensions.

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తే భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా? భారత్ తన చమురు అవసరాల్లో 90% దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 40% గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. జలసంధి బ్లాక్ అయితే, చమురు సరఫరా తగ్గి, క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $120-$150కి చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గిపోతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని కఠినం చేయవచ్చు. రవాణా ఖర్చులు, షిప్పింగ్ ఇన్సూరెన్స్ రేట్లు కూడా పెరుగుతాయి. భారత్‌లో 74 రోజుల చమురు నిల్వలు ఉన్నాయి, అయితే దీర్ఘకాలిక సంక్షోభం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో భారత్ రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటోంది.

అమెరికా, యూరప్ దేశాలు హోర్ముజ్ జలసంధిని ఎందుకు కాపాడతాయి? ఈ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరా కీలకం. అమెరికా, గతంలో గల్ఫ్ చమురుపై ఆధారపడినా, ఇప్పుడు ఫ్రాకింగ్ వంటి సాంకేతికతలతో చమురు ఉత్పత్తి పెంచింది. అయినా, ఈ జలసంధి బ్లాక్ అయితే, ప్రపంచ చమురు ధరలు పెరిగి, అమెరికా ఆర్థిక వ్యవస్థపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. యూరప్, ముఖ్యంగా ఖతర్ నుంచి 20% LNG దిగుమతి చేసుకుంటుంది, ఇది ఈ మార్గం గుండానే వస్తుంది. అయితే యూఎస్ నావికా దళం బహ్రెయిన్‌లో ఉండి, ఈ మార్గాన్ని సురక్షితంగా కాపాడుతుంది. 1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సమయంలో అమెరికా ఈ మార్గాన్ని తెరిచే ఉంచింది. ఇరాన్ బ్లాక్ చేస్తే, అమెరికా, నాటో, యూరప్ సైనిక జోక్యం చేసే అవకాశం ఉంది.

హోర్ముజ్ జలసంధి బ్లాక్ అయితే అమెరికా, యూరప్ పరిస్థితి? అమెరికా చమురు దిగుమతుల్లో గల్ఫ్ వాటా 7% మాత్రమే, కానీ ధరల పెరుగుదల వినియోగదారులపై, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. యూరప్‌కు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఖతర్, యూఏఈ నుంచి LNG సరఫరా నిలిచిపోతే, శీతాకాలంలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది. సౌదీ అరేబియా, యూఏఈలలో కొన్ని పైప్‌లైన్ మార్గాలు ఉన్నాయి, కానీ అవి కేవలం 4.2 మిలియన్ బ్యారెల్స్ చమురును మాత్రమే రవాణా చేయగలవు, ఇది జలసంధి నుంచి సరఫరా అయ్యే సామర్థ్యంలో నాలుగో వంతు మాత్రమే. ఒక వేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే యూరప్ కు షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ రేట్లు పెరిగి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.

ఇరాన్ నిజంగా హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తుందా? చరిత్ర చూసుకుంటే ఇరాన్ ఎప్పుడూ కూడా ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయలేదు. 1980-88 ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా అడ్డుకోలేదు. 2011, 2018లో సంక్షోభాల సమయంలో ఇరాన్ బెదిరించింది మాత్రమే. ఇరాన్ స్వయంగా తన చమురు ఎగుమతుల కోసం ఈ మార్గంపై ఆధారపడుతుంది. ఒక వేళ ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే, చైనా ఒత్తిడి తెస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోదని అంటున్నారు. అయితే అత్యవసరమైతే అమెరికా, యూరప్ కు ఓమన్, యూఏఈ నుంచి చమురు రవాణా మార్గాలు బ్లాక్ చేసే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు భారత్ కూడా కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది.

Also Read: https://www.mega9tv.com/international/trump-nominated-for-nobel-peace-prize-but-very-next-day-america-attacks-iran/