
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా విషయంలో కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తప్పుపట్టింది.. ఇలాంటి తీర్పు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ సుప్రీం కోర్టు ఎందుకు సీరియస్ అయ్యింది..? అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది..? తన వ్యాఖ్యలకు కమల్ హాసన్ ఎందుకు సారీ చెప్పలేదు..? ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయినట్టేనా..?
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆమోదం పొందిన సినిమాను ఎవరూ ఆపలేరని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్‌ల బెంచ్ స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు కమల్‌ను క్షమాపణ చెప్పమనడం తప్పని, అది కోర్టు పని కాదని విమర్శించింది. సినిమా థియేటర్లకు నిప్పు పెడతామని బెదిరిస్తే, అది చట్ట వ్యవస్థకు వ్యతిరేకమని.. కర్ణాటక ప్రభుత్వం సినిమా విడుదలకు రక్షణ కల్పించాలి అని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమల్ వ్యాఖ్యలు తప్పని భావిస్తే, చర్చలతో సమాధానం చెప్పాలి, హింసతో కాదని కోర్టు నొక్కిచెప్పింది. కర్ణాటక ప్రభుత్వానికి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీసు జారీ చేసింది.
అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? ఈ ఏడాది మే 24న చెన్నైలో ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో లాంచ్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలోని కన్నడ భాషాభిమానులను, సంస్థలను ఆగ్రహానికి గురిచేసింది. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, కమల్ మాటలు దాన్ని కించపరిచాయని వాళ్లు ఆరోపించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమాను రాష్ట్రంలో నిషేధించింది. కమల్ క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదల చేయమని ప్రకటించింది. బెంగళూరులోని విక్టరీ సినిమా థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు ప్రకటనలు వచ్చినప్పుడు, కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు టీఏ నారాయణ గౌడ, కమల్ సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్లకు నిప్పు పెడతాం అని బెదిరించారు. ఈ బెదిరింపులతో జూన్ 5న సినిమా కర్ణాటకలో రిలీజ్ కాలేదు.
అయితే కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. తాను తప్పు చేస్తేనే క్షమాపణ చెప్తానని… తన మాటల్లో దురుద్దేశం లేదని… కన్నడ భాషపై తనకు గౌరవం ఉందని కమల్ క్లారిటీ ఇచ్చారు. సికమల్ తన వ్యాఖ్యలు సరైనవేనని, జనం తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తాను చరిత్రకారుడ్ని కాదు, భాషా నిపుణుడిని కాదు, కానీ తన మాటల్లో భాషల మధ్య సౌహార్దం కోసమే చెప్పానని అని వాదించారు. నిమా నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, KFCCకి లేఖ రాసి, కమల్ వ్యాఖ్యలు ప్రేమతో, గౌరవంతో చెప్పినవేనని వివరించింది. కానీ ఈ లేఖలో సారీ అనే పదం లేదు.
దీంతో కర్ణాటకలో కన్నడ రక్షణ వేదిక వంటి సంస్థలు బెంగళూరు, హుబ్బళ్లి, మైసూరులో నిరసనలు చేశాయి. కమల్ సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్లను తగలబెడతాం అని KRV నాయకుడు టీఏ నారాయణ గౌడ హెచ్చరించారు. బెంగళూరులోని విక్టరీ సినిమా థియేటర్‌ను కొందరు ముట్టడించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో 1991 యాంటీ-తమిళ రైట్స్‌ను పునరావృతం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఎం. మహేష్ రెడ్డి సుప్రీం కోర్టులో వాదించారు.
అటు రాజకీయ నాయకులు కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది, కమల్‌కు దాని గురించి తెలియదు అని విమర్శించారు. BJP నేత BY విజయేంద్ర కమల్ వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. కన్నడ, సంస్కృతి మంత్రి శివరాజ్ తంగడగి, కమల్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను నిషేధించాలని KFCCకి లేఖ రాశారు. ఈ రాజకీయ ఒత్తిడి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. కొందరు రాజకీయ నాయకులు ఈ అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శలు వచ్చాయి. ఈ వివాదం కన్నడ-తమిళ భాషల మధ్య ఉద్రిక్తతను పెంచిందని, రాజకీయంగా సున్నితమైన ఈ అంశం సినిమా రిలీజ్‌ను ఆపడానికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు.
కమల్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడానికి పోలీసు రక్షణ కావాలని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జూన్ 3న జస్టిస్ ఎం. నాగప్రసన్న విచారణలో కమల్‌ను తప్పుబట్టారు. కమల్ ను హిస్టారియన్‌వా, భాషా నిపుణుడా..? ఏ ఆధారంతో కన్నడం తమిళం నుంచి పుట్టిందన్నావు? అని ప్రశ్నించారు. ఒక సారీ చెప్తే సమస్య తీరిపోతుందని.. పబ్లిక్ ఫిగర్ జనం మనోభావాలను గాయపరచకూడదని అని కోర్టు అన్నది. 1950లో సి. రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్య చేసి క్షమాపణ చెప్పారని ఉదాహరణ ఇచ్చింది. కానీ కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో, సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. బెంగళూరు నివాసి ఎం. మహేష్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. CBFC ఆమోదం పొందిన సినిమాను కర్ణాటకలో నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది స్వేచ్ఛా వ్యక్తీకరణ, వృత్తి స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘిస్తుందని వాదించారు. సినిమాకు CBFC సర్టిఫికేట్ ఉంటే, దాన్ని ఆపడం కుదరదని.. . జనానికి వ్యతిరేకత ఉందనే పేరుతో సినిమాను నిషేధించకూడదని సుప్రీం కోర్టు అంది. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.