బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా మృతి వెనుక నిజాలు..!

Shefali Jariwala Death Cause: అందంగా ఉండాలని.. వయస్సు తగ్గించుకోవాలని చేసిన ప్రయత్నం ప్రాణాలు తీసింది. కాంటా లగా గీతంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటి, మోడల్ షెఫాలీ జరివాలా మృతి వెనుక అందంపై ఆరటమే కనిపిస్తోంది. ముంబై పోలీసులు ఆమె మృతికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే విచారణలో ఆమె యాంటీ-ఏజింగ్ మాత్రలు వాడినట్లు వెల్లడైంది. ఈ యాంటీ-ఏజింగ్ మందులే ఆమె మృతికి కారణమయ్యాయా? యాంటీ-ఏజింగ్ మందులు ఎందుకు ప్రమాదకరం? అందం కోసం మందులు వాడితే అంతేనా..? గతంలో సినిమా తారలు అందం కోసం చేసిన ప్రయత్నాలు ప్రాణాల మీదకు ఎలా తీసుకొచ్చాయి? వయస్సు తగ్గించే మందులు నిజంగా పనిచేస్తాయా, లేక కేవలం ప్రచారమేనా?

షెఫాలీ జరివాలా.. కాంటా లగా గీతంతో పేరు తెచ్చుకున్న ఈమె, జూన్ 27 రాత్రి ముంబైలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె భర్త పరాగ్ త్యాగీ, కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ఓ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆమె ఆసుపత్రికి చేరే సమయానికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, షెఫాలీ హార్ట్ అటాక్ తో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు షెఫాలీ ప్రాణాలు తీసినట్టు భావిస్తున్నారు. చనిపోయిన రోజు ఆమె ఇంట్లో జరిగిన పూజ కారణంగా ఉపవాసం ఉన్నారు. అయినప్పటికీ, మధ్యాహ్నం ఆమె యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు, రాత్రి సాధారణ మాత్రలు వేసుకున్నారు. రాత్రికి ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఒళ్లు వణికి, రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోయి, స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు మరణించారు.

ముంబై పోలీసులు షెఫాలీ జరివాలా మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఆమె నివాసంలో సోదాలు చేసి, యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలను స్వాధీనం చేసుకుంది. ఆమె భర్త పరాగ్ త్యాగీ, కుటుంబ సభ్యులు, ఇంటి సిబ్బంది, వైద్యులతో సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని.. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. షెఫాలీ గత ఆరు సంవత్సరాలుగా యాంటీ-ఏజింగ్ చికిత్సలో భాగంగా విటమిన్ సి, గ్లూటాథయోన్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిసింది. జూన్ 27న ఉపవాసంలో ఉన్నప్పటికీ, ఆమె మధ్యాహ్నం యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్, రాత్రి సాధారణ మాత్రలు తీసుకున్నారు. ఈ మందులు, ఉపవాసం కలిసి రక్తపోటు తగ్గడానికి, గుండె పోటుకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నాయి. Shefali Jariwala Death Cause.

యాంటీ-ఏజింగ్ మందులు, ముఖ్యంగా గ్లూటాథయోన్, విటమిన్ సి వంటి ఇంజెక్షన్లు చర్మ సౌందర్యం, డిటాక్సిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు. అయితే గ్లూటాథయోన్ గుండెపై ప్రత్యక్ష ప్రభావం చూపదని, ఇది కేవలం కాస్మెటిక్ చికిత్సల కోసం ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఈ మందులు వికటించి అప్పుడప్పుడు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు రక్తపోటును మార్చడం, గుండె లయను అస్తవ్యస్తం చేయడం, హార్ట్ అటాక్ కు దారితీయడం జరుగుతుంది. ఎక్కువ మందుల వాడకం గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. షెఫాలీ విషయంలో, ఆమె ఉపవాసంలో ఉండి, యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్, ఇతర మాత్రలు తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా తగ్గి ఉండవచ్చని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. పెప్టైడ్ ఆధారిత యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు దీర్ఘకాలంగా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని అంటున్నారు. ఇవి గుండె లయ, రక్తపోటు, జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఖాళీ కడుపుతో మందులు తీసుకోవడం, అనుమతించదగిన మోతాదును మించడం, నియంత్రణ లేని వాడకం వల్ల ప్రమాదం పెరుగుతుంది. కొందరు వైద్యులు ఈ చికిత్సలు సాధారణంగా సురక్షితమని చెప్పినప్పటికీ, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, ఇతర మందులతో కలిపి వాడటం వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి.

సినిమా తారలు అందం, యవ్వనం కాపాడుకోవడానికి తీసుకున్న చికిత్సల వల్ల ప్రమాదాలను ఎదుర్కొన్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. 2017లో, బాలీవుడ్ నటి రీనా దత్ కాస్మెటిక్ సర్జరీ తర్వాత కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆమె శరీరంలో కొవ్వును తగ్గించేందుకు సర్జరీ చేయించుకున్నారు, కానీ అనస్తీషియా సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయారు. 2009లో పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ అతిగా పెయిన్ రిలీఫ్ మందులు, యాంటీ-ఏజింగ్ డ్రగ్స్ వాడకం వల్ల ఓవర్‌డోస్‌తో మరణించారు. భారతదేశంలో, సినిమా తారలు తరచూ ఒత్తిడితో కూడిన జీవనశైలి, అధిక మందుల వాడకం, నియంత్రణ లేని కాస్మెటిక్ చికిత్సల వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే అందం కోసం తీసుకునే చర్యల విషయంలో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు షెఫాలీ కూడా ఫిట్‌నెస్ కోసం అధిక మోతాదులో ప్రోటీన్ సప్లిమెంట్లు, స్టెరాయిడ్స్ వాడినట్లు చెబుతున్నారు.

యాంటీ-ఏజింగ్ మందులు చర్మం యౌవనంగా కనిపించేలా, సౌందర్యాన్ని మెరుగుపరిచేలా ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. గ్లూటాథయోన్, విటమిన్ సి వంటి ఇంజెక్షన్లు చర్మాన్ని డిటాక్సిఫికేషన్ చేయడం, మృధువుగా వంటి వాటి కోసం ఉపయోగిస్తారు. అయితే, ఈ మందులు శాస్త్రీయంగా వయస్సును తగ్గిస్తాయని ఆధారాలు లేవు. వైద్య నిపుణుల ప్రకారం, ఈ చికిత్సలు కాస్మెటిక్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడతాయి, శరీర జీవక్రియను లేదా వృద్ధాప్య ప్రక్రియను మార్చలేవు. గ్లూటాథయోన్ వంటి డ్రగ్స్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి, కానీ వీటి దీర్ఘకాలంగా వాడితే మంచిదా కాదా అనే అంశంపై క్లారిటీ లేదు. కొన్ని పెప్టైడ్ ఆధారిత యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు మెటబాలిక్, గుండె లయను ప్రభావితం చేస్తాయని అంటారు. మార్కెట్‌లో యాంటీ-ఏజింగ్ ఉత్పత్తులపై బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. కానీ చాలా వరకు ఈ యాడ్స్ చూస్తే అతిశయోక్తిగా అనిపిస్తుంది. కొన్ని కంపెనీలు వయస్సు తిరిగి రావడం, ఎప్పటికీ యవ్వనంగా ఉండటం వంటి వాగ్దానాలు చేస్తాయి, కానీ ఇవి శాస్త్రీయంగా నిరూపితం కావు. యాంటీ-ఏజింగ్ మందులు కొంతవరకు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి, కానీ వయస్సును తగ్గించడం కేవలం ప్రచారమే అని చెప్పవచ్చు.సమతుల ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం వంటివి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయని నిపుణులు చూస్తున్నారు. దీనికి తోడు యోగా చేయడ వల్ల కూడా ముఖంలో తేజస్సు కనిపిస్తుందని చెబుతున్నారు.

Also Read: https://www.mega9tv.com/national/the-pioneer-of-economic-reforms-former-prime-minister-p-v-narasimha-rao-birth-anniversary-today/