
ఈ ఏడాది ఎండలు లేవు.. కాని వర్షాలు మాత్రం ముంచేశా ఉన్నాయి. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాలేదు. నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఎంటర్ అయ్యాయి. అప్పుడే భారీ వర్షాలు, వరదలు.. ముఖ్యం ముంబై, బెంగళూరు భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యాయి. దీనికి కారణం ఏంటి..? ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలపై వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది..? ఇలాంటి వాతావరణం ఎందుకు ఏర్పడుతోంది..? ఈ ఏడాది దేశంలో వర్షపాతం ఎలా నమోదు కాబోతోంది..? వాతావరణ శాఖ ఏం హెచ్చరిస్తోంది..?
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ఆగమనంతో పాటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ముంబై, పూణే, బెంగళూరు, తిరువనంతపురం వంటి నగరాలు తీవ్ర వర్షపాతంతో అతలాకుతలమవుతున్నాయి. ముంబైలో 102 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ నివేదికలు సూచిస్తున్నాయి. మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబై, పూణే, కొల్హాపూర్, రత్నగిరి, సింధుదుర్గ్ వంటి ప్రాంతాల్లో మే 20 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో రోడ్లు జలమయమై, ట్రాఫిక్ స్తంభించింది, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూణేలో భారీ వర్షం కారణంగా 15 చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్‌లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర సీఎం అధికారులను అప్రమత్తం చేసి, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా దక్షిణ ముంబైపై వానల ప్రభావం తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఇండియా సహా పలు ఎయిర్‌లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇక కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 295 మి.మి. గా నమోదైంది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 279.4 మి.మిగా నమోదైంది. కానీ, ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది. ఈ సారి మహారాష్ట్రలో పది రోజుల ముందుగానే.. నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. సాధారణంగా జూన్ 5 నుంచి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. 1990 తర్వాత సీజన్ కంటే ఇంత ముందుగా ముంబయిలో వర్షాలు పడటం ఇదే తొలిసారి.
అలాగే కర్ణాటకలో తీరప్రాంతం, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు నీటితో నిండిపోయి, ట్రాఫిక్ జామ్‌లు సాధారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, పాఠశాలలు, కార్యాలయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. బెంగళూరులోని మార్కెట్ యార్డులలో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ ను పలకరించాయి. ఈ క్రమంలో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కేరళలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ అయింది. తిరువనంతపురం, కొట్టాయం, కొచ్చి, త్రిస్సూర్ వంటి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా త్రిస్సూర్ లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు IMD నివేదించింది. ఈ వర్షాలు వ్యవసాయానికి సానుకూలమైనప్పటికీ, లోతట్టు ప్రాంతాల్లో వరదలు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కేరళలో రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం మరాఠ్వాడ, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లలో అల్పపీడనం వాయుగుండంతో కలిసి ఉపరితల ఆవర్తనాన్ని ఏర్పరుస్తోంది. ఇది దక్షిణం వైపు 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్, నజఫ్‌గఢ్, లోధి రోడ్, ఢిల్లీ యూనివర్శిటీ వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశాల్లో భారీ వర్షాలకు ఫ్లాస్ ఫ్లడ్స్ సంభవించాయి. కార్లు కొట్టుకుపోయాయి.
గత రెండు సంవత్సరాలుగా, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్రత ఎక్కువైంది. 1980 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా ఫ్లాష్ ఫ్లడ్స్ నమోద్వగా.. 2,20,000 మందికి పైగా చనిపోయారు. 2023 జులైలో ఢిల్లీ ,2005లో ముంబై , 2015, 2023లో చెన్నై,2022లో బెంగళూరు వంటి నగరాలు ఫ్లాష్ ఫ్లడ్స్‌తో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2023లో హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల కారణంగా 330 మంది చనిపోయారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా అరేబియా సముద్రంలో గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే 1.2-1.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదైంది. ఇది ఆట్మాస్ఫియరిక్ రివర్స్ ఏర్పడటానికి దారితీసింది. ఇవి భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. ఇంటర్‌గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రకారం, దక్షిణాసియాలో మాన్సూన్ వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ, ఇతర వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం, 2025 సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే 105% ఉంటుందని IMD అంచనా వేసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ. దీనిబట్టి ఈ ఏడాది భారత్ దేశంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వరదలు కూడా తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉంది.