
పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది.. అది విషమే కక్తుతుంది. ఇప్పుడు టర్కీ కూడా అదే విధంగా ప్రవర్తించిందని అంటున్నారు. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో మనదేశానికి వ్యతిరేకంగా టర్కీ కుట్రలు పన్నింది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా టర్కీపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు టర్కీ భారత్ కు చేసిన ద్రోహం ఏంటి..? భారత్ పై ఎందుకు టర్కీకి అంత అసూయ..? ఇప్పుడు భారత్ టర్కీపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటోంది..? టర్కీతో పాటు పాకిస్థాన్ కు తోడైన మరో పాము అజర్‌బైజాన్ పరిస్థితి ఏంటి..?
భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో, టర్కీ పాకిస్థాన్‌కు సైనిక, రాజకీయ మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌కు తీరని నమ్మకద్రోహం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత, టర్కీ పాకిస్థాన్‌కు డ్రోన్లు, ఆయుధాలను సరఫరా చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలని తేలింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లను భారత సైనిక, పౌర మౌలిక సదుపాయాలపై దాడులకు ఉపయోగించారని తేలింది. టర్కీ డోన్లు భారత సరిహద్దుల్లో కూలిపోయి కనిపించాయి. వీటి ఆధారంగా టర్కీ పాకిస్థాన్ కు సహాయం చేసిందని.. భారతకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిందని క్లియర్ గా అర్థమవుతోంది. మొదటి నుంచి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్ కు వ్యతిరేకమే. కాశ్మీర్ అంశంలో భారత్‌ను ఖండిస్తూ పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు ఎర్డోగాన్. పహల్గామ్ ఉగ్రదాడిని చైనాతో సహా ప్రపంచ దేశాలు ఖండిస్తే టర్కీ మాత్రం పాకిస్థాన్ కు వంతపాడింది. ఉగ్రవాదుల టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడితే.. పాకిస్థాన్ పౌరులు చనిపోయారని టర్కీ చెప్పుకొచ్చింది. భారత్ పై ఇంత కుళ్లు పెట్టుకున్న టర్కీకి భారత్ ఎలాంటి అపకారం చేయలేదు.. పైగా ఎంతో సహాయం చేసింది.
టర్కీ భూకంపం సమయంలో భారత్ ఆపరేషన్ దోస్త్ ద్వారా సహాయ సామగ్రి, రిలీఫ్ బృందాలను పంపింది. NDRF,వైద్య బృందాలను పంపి.. సమాయం చేసింది. అలాగే C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా డాగ్ స్క్వాడ్, వైద్య సామగ్రి, డ్రిల్లింగ్ మెషీన్లు, ఇతర అవసరమైన పరికరాలను టర్కీలోని అడానా విమానాశ్రయానికి చేర్చారు. 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ బృందం టర్కీలో 30 పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. శస్త్రచికిత్స, అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలు అందించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గరుడ ఏరోస్పేస్ కు చెందిన డ్రోనీ డ్రోన్లు, ఔషధాలు, ఆహార సామగ్రిని రవాణా చేయడానికి కిసాన్ డ్రోన్లు భారత్ పంపింది. కోట్ల రూపాయల సహాయం చేసింది. అయినా టర్కీ తన ఒంకర బుద్ధిని చూపించింది. టర్కీ ఈ సహాయాన్ని పట్టించుకోకుండా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తోంది. టర్కీ సైనిక విమానాలు, యుద్ధ నౌక కరాచీకి వెళ్లడం, భారత సరిహద్దుల్లో దాడులకు ఉపయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి వచ్చినవని తేలడంతో భారతీయులు మండిపోతున్నారు. టర్కీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. దీనికి తోడు అజర్‌బైజాన్ సైతం పాకిస్థాన్ కు సహాయపడి భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తించింది.
టర్కీ, అజర్ బైజాన్ లు ప్రధానంగా టూరిజంపై ఆధారాపడుతున్నాయి. భారత్ నుంచి ఎంతో మంది ఆ రెండు దేశాలకు వెళ్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో చాలా మంది టర్కీ, అజర్ బైజాన్ వెళ్లడానికి ఇష్టపడం లేదు. ముఖ్యంగా టర్కీ చేసిన నమ్మకద్రోహంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్‌లోని పెద్ద ట్రావెల్ పోర్టల్‌లలో ఒకటైన మేక్‌మైట్రిప్ టర్కీ, అజర్‌బైజాన్‌కు వెళ్లే భారత్ టూరిస్టులు వెళ్లకుండా తమ పోర్టల్ లో మార్పులు చేసింది. దీని ద్వారా టర్కీ టూరిస్టుల బుకింగ్స్ 60 శాతం పడిపోయాయి. ఇప్పుటికే బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకున్నారు. సుమారు ఈ పదిరోజుల్లోనే 250 శాతం బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీనికి తోడు భారత్‌లో #BoycottTurkey, #BoycottAzerbaijan, #BoycottTurkeyAzerbaijan అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది తాము, తమ స్నేహితులు, బంధువులు దేశభక్తితో టర్కీ, అజర్‌బైజాన్ టికెట్లను రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు. కొందరు టర్కీ బదులు గ్రీస్, ఆర్మేనియాకు వెళ్తున్నట్టు చెబుతున్నారు. టర్కీకి టూర్లు మానుకోవాలని సూచించిన మొదటి సంస్థ తమదేననిన ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి తెలిపారు. తమ టర్కీ టికెట్లలో 22%, అజర్‌బైజాన్‌కు 33% రద్దయ్యాయన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు. దీని ద్వారా టర్కీకి భారతీయ పర్యాటకం చాలా తగ్గొచ్చని అభిప్రాయపడుతున్నారు. భారత్ లోని అన్ని టూరిజం సంఘాలు సైన్యంతో గట్టిగా నిలబడతాయని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం కమిటీ చైర్మన్ సుభాష్ గోయల్ తెలిపారు.
రాబోయే రోజుల్లో రెండు దేశాలకు పర్యాటకం 50-60% తగ్గవచ్చని కమిటీ అంచనా వేస్తున్నారు. అలాగే టర్కీ, అజర్‌బైజాన్‌లకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే భారత్ టూరిజం సంఘాల చర్యలతో టర్కీ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. టర్కీ టూరిజం శాఖ నుంచి వచ్చినట్లు చెప్పబడిన ఒక లేఖ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. దానిలో భారతీయ పర్యాటకులు తమ యాత్రలను రద్దు చేసుకోవద్దని, భారతీయులకు ఎలాంటి భద్రతా సమస్యలు లేవని హామీ ఇచ్చింది. అయితే ఇది అధికారికంగా ధృవీకరణ కాలేదు. అటు టర్కీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తీర్మానం చేసింది. ఉత్తరప్రదేశ్, పూణేలోని వ్యాపారులు ఎక్కువగా టర్కీ ఆపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. వీరు తమ షాపుల్లో టర్కీ యాపిల్స్ ను ప్రదర్శించడం మానేశారు. ఉదయపూర్ వ్యాపారులు టర్కీ మార్బుల్ వాడకాన్ని నిలిపివేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కీ గ్రౌండ్-హ్యాండ్లింగ్ కంపెనీ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది.
టర్కీ పర్యాటకంతో పాటు తయారీ, వ్యవసాయం, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2024 డేటా ప్రకారం, టర్కీ ఆర్థిక వృద్ధి 3.1%గా ఉంది. ఇందులో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. తయారీ రంగం, ఎగుమతులు, ఇంధన రంగం ద్వారా టర్కీకి ఆదాయం వస్తోన్నా.. అధిక ద్రవ్యోల్బణం, టర్కిష్ లిరా విలువ తగ్గుదల వంటి సవాళ్ల వల్ల ఆ దేశం పర్యాటక ఆదాయంపైనే ఎక్కువ ఆధారపడేలా చేస్తోంది. ఇది ఆ దేశ జీడీపీకి చాలా సహకారం అందిస్తోంది. 2024లో, టర్కీ పర్యాటకం రంగం నుంచి 61.1 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది, ఇది 2023తో పోలిస్తే 8.3% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఆదాయం దేశ జీడీపీలో సుమారు 7.3%గా ఉంది. హిస్టారికల్ సైట్స్, సాంస్కృతిక, హలాల్, మెడికల్ టూరిజానికి టర్కీ ప్రసిద్ధి చెందాయి. 2021లో మెడికల్ టూరిజం 1.05 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ఇప్పుడు భారత్ నిర్ణయంతో ఈ ఆదాయానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ ఏడాది వేల సంఖ్యలో భారతీయులు టర్కీకి వెళ్తున్నారు. 2023లో 2.74 లక్షల మంది భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించారు. భారతీయ పర్యాటకులు, దిగుమతుల ద్వారా టర్కీకి సంవత్సరానికి 2.89 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని అంచనా. 023లో భారత్-టర్కీ ద్వైపాక్షిక వాణిజ్యం $10.43 బిలియన్‌గా ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు $6.65 బిలియన్, దిగుమతులు $3.78 బిలియన్‌గా ఉన్నాయి. భారతీయ పర్యాటకులు వల్ల టర్కీ హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక వ్యాపారాలు ఎంతో లాభపడుతున్నాయి. అయితే వీటికి ఇప్పుడు నష్టం వస్తుందని టర్కీ భయపడుతోంది.