తిరువనంతపురంలోనే యూకే F-35B ఫైటర్ జెట్..!

UK F-35B fighter jet: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వారాల క్రితం అత్యవసరంగా ల్యాండ్ అయిన యూకేకు చెందిన కోట్ల విలువ చేసే అత్యాధునిక F-35B ఫైటర్ జెట్ ఇంకా అక్కడే ఉంది. సాంకేతిక సమస్యలు ఈ జెట్ ఎగరలేకపోతోంది. మొదట ఈ జెట్‌ను హ్యాంగర్‌కు తరలించడానికి యూకే అంగీకరించలేదు, కానీ ఇప్పుడు మరమ్మతుల కోసం హ్యాంగర్‌కు తీసుకెళ్లేందుకు ఒప్పందం కుదిరింది. మరోవైపు ఆకతాయిలు ఈ ఫైటర్ జెట్ ను అమ్ముతామంటూ OLXలో పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ జెట్ తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు ఎలా చేరుకుంది? హ్యాంగర్‌కు తరలించడానికి యూకే ఎందుకు భయపడుతోంది? F-35B సాంకేతికత భారత్ కు చిక్కితే ఏమవుతుంది?

కోట్ల విలువు చేసే ఫైటర్ జెట్.. అంతకంటే దాని టెక్నాలజీ ఇంకా విలువైనది. అలాంటి ఫైటర్ జెట్ అత్యవసరం భారత్ లో ల్యాండ్ అయ్యింది. యూకే రాయల్ నేవీకి చెందిన ఈ F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ను తిరిగి తీసుకువెళ్లడం కష్టంగా మారింది. మరోవైపు దీని టెక్నాలజీని ఎక్కడ భారత్ రీఇంజనీరింగ్ చేస్తుందోననే భయం యూకేలో ఉంది. అందుకే యూకేకు నిద్రపట్టడం లేదు. చివరికి దీనిని ఎయిర్ పోర్ట్ రన్ వే పైనుంచి హ్యాంగర్ కు తీసుకువెళ్లడానికి కూడా మొదట అనుమతించలేదు. రెండు వారాల నుంచి ఈ కోట్ల విలువు చేసే జెట్.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ రన్ వే పైనే ఉంది. దానికి గట్టి భద్రత కల్పించారు. చివరికి దానికి హ్యాంగర్ కు తరలించేందుకు యూకే అనుమతి ఇచ్చింది. UK F-35B fighter jet.

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వారల క్రితం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది ఈ ఫైటర్ జెట్. ఇటీవల యూకే రాయల్ నేవీ , భారత నౌకాదళంతో సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. అయితే, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఇంధనం తక్కువగా ఉండటం కారణంగా ఈ జెట్ తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ను తిరిగి చేరుకోలేకపోయింది. చివరికి తిరువనంతపురం విమానాశ్రయం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ తర్వాత, రాయల్ నేవీకి చెందిన హెలికాప్టర్ టెక్నీషియన్లతో విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, ల్యాండింగ్ తర్వాత జెట్‌లో హైడ్రాలిక్ సమస్య తలెత్తింది, దీని వల్ల ఇది తిరిగి ఎగరలేకపోయింది.

F-35B ఫైటర్ జెట్‌ను తిరువనంతపురం విమానాశ్రయంలోని హ్యాంగర్‌కు తరలించడానికి యూకే మొదట అంగీకరించలేదు. F-35B అత్యంత అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్, దీనిలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని భారత్ ఎక్కడ కాజేస్తుందోనని యూకే రాయల్ నేవీ జాగ్రత్తలు తీసుకుంది. ఈ జెట్‌ను బయట బహిరంగంగా రన్‌వేలోనే ఉంచడం ద్వారా, దాని రహస్యాలు బయట పడవని యూకే భావించింది. ఈ జెట్‌ను ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్, రిపేర్ హ్యాంగర్‌కు తరలించడం వల్ల ఇతరులు దీనిని పరిశీలించే అవకాశం ఉందని యూకే ఆందోళన చెందింది. అందువల్ల జెట్‌ను బహిరంగంగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతలో ఉంచారు. అయితే, ఎండకు ఎండి వర్షానికి తడవడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో చివరకు హ్యాంగర్‌కు తరలించడానికి యూకే అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు, యూకే ఇంజనీర్లు రన్‌వేలోనే రిపేర్లు చేయడానికి ప్రయత్నించారు, కానీ హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించలేకపోయారు. ఈ కారణంగా, ప్రత్యేక టో వాహనాలు, 40 మంది ఇంజనీర్ల బృందాన్ని యూకే నుంచి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు.

F-35B లైటనింగ్ II అనేది అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఫైటర్ జెట్‌లలో ఒకటి. షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. దీని వల్ల చిన్న రన్‌వేలు, ఎయిర్ క్రాఫ్ర్ క్యారియర్ షిప్ ల నుంచి ఎగరడం, నిలువుగా ల్యాండ్ చేయడం సాధ్యమవుతుంది. అలాగే దీని స్టెల్త్ సాంకేతికత రాడార్‌లలో కనిపించకుండా చేస్తుంది, ఇది శత్రు రాడార్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిలో అధునాతన సెన్సార్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు ఉన్నాయి, ఇవి శత్రు లక్ష్యాలను గుర్తించడం, ఖచ్చితమైన దాడులు చేయడంలో సహాయపడతాయి. దీని ధర 110 మిలియన్ డాలర్లు, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్‌లలో ఒకటి. 2015 నుంచి అమెరికా వైమానిక దళంలో ఇది సేవలందిస్తోంది.

భారత్‌లో ప్రస్తుతం F-35B లాంటి ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు. F-35B షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం, అధునాతన స్టెల్త్ సాంకేతికతలు భారత వైమానిక దళం వద్ద ఉన్న విమానాలకు లేవు. భారత్‌లో ప్రస్తుతం సుఖోయ్ Su-30 MKI, రఫేల్, మిగ్-29, జాగ్వార్ వంటి నాలుగవ తరం, 4.5 తరం ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఈ విమానాలు అధునాతనమైనవే అయినప్పటికీ, F-35B స్టెల్త్, ఇతర లేటెస్ట్ సామర్థ్యాలు వీటికి లేవు. భారత్ తన సొంత ఐదవ తరం ఫైటర్ జెట్‌ను తయారు చేసే ప్రయత్నంలో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్, ఇది 2030 నాటికి సేవలోకి రానుంది. అమ్కాలో స్టెల్త్ సాంకేతికత, అధునాతన సెన్సార్లు ఉంటాయి, కానీ షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం ఉండదు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉంది, 2028 నాటికి మొదటి ప్రోటోటైప్ ఎగరనుంది. భారత నౌకాదళం ఇన్స్ విక్రాంత్, విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకల కోసం షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం గల విమానాలు కావాలని ఆసక్తి చూపుతోంది, కానీ ప్రస్తుతం అలాంటి విమానాలు లేవు. అందుకే యూకే F-35Bపై కన్నేసి ఉంచింది. ఒక వేళ భారత్ దీని టెక్నాలజీ సాధిస్తే.. 5వ తరం ఫైటర్ జెట్లు తయారు చేయడం మరింత సులభం అవుతుంది. అది అమెరికాకు, యూకేకు ఏ మాత్రం ఇష్టం లేదు.

Also Read: https://www.mega9tv.com/national/spacexs-crew-dragon-spacecraft-lands-400-kilometers-from-earth-after-28-hours-of-travel/