
TVK CM Candidate Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరో దళపతి విజయ్ ఫార్టీ తమిళగ వెట్రి కళగం-టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఆయన పేరునే ప్రకటించింది. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే-బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలకు పుల్‌స్టాప్ పడింది. అయితే టీవీకే సింగిల్‌గా ఎన్నికల బరిలో దిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయా? డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, టీవీకే వీడిగా పోటీ చేస్తే? ఏ వర్గాలు ఎవరికి మద్దతిస్తాయి? ఒకవేళ హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎవరు ఎవరితో కలుస్తారు?
తమిళ సినీ స్టార్ దళపతి విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం- టీవీకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నైలో జరిగిన టీవీకే కార్యవర్గ సమావేశంలో, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. డీఎంకే, బీజేపీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు అని విజయ్ స్పష్టం చేశారు. టీవీకే ఒక స్వతంత్ర రాజకీయ మార్గాన్ని అనుసరిస్తూ, రాష్ట్రంలో రెండు కోట్ల మంది సభ్యులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో ఒక భారీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రామీణ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీని ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు అధికార పక్షంపై విమర్శల విషయంలోనూ విజయ్ ఏ మాత్రం తగ్డం లేదు. స్థానిక సంస్థలపై ప్రశ్నిస్తూ.. సీఎం స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టు కారణంగా స్థానికులు స్థలాలను కోల్పోతున్నారని, స్టాలిన్ వారిని కలవకపోవడం సిగ్గుచేటని అన్నారు. వాళ్లూ మన ప్రజలే, స్టాలిన్ వాళ్లను కలవకపోతే, తాను వాళ్లను సెక్రటేరియట్‌కు తీసుకొస్తా అని విజయ్ సవాల్ విసిరారు. ఇలాంటి ప్రజా ఉద్యమాల ద్వారా అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు.
విజయ్‌కు సినీ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువతలో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్యాన్ బేస్ ఓట్లుగా మారితే, టీవీకే గణనీయమైన ప్రభావం చూపగలదని విశ్లేషకులు అంటున్నారు. టీవీకేకు 34.55% ఓటు షేర్, 95-105 సీట్లు రావచ్చని, విజయ్ సీఎం అభ్యర్థిగా 39.4% మంది మద్దతు ఇస్తున్నారని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. అయితే, ఈ సర్వేలు ఖచ్చితమైనవి కావని, రాజకీయంగా టీవీకే ఇంకా బలమైన సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి రాజకీయ దిగ్గజాలతో పోటీ చేయడం టీవీకేకు పెద్ద సవాల్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా, 2026 కోసం గ్రాస్‌రూట్ స్థాయిలో పనిచేయడంపై టీవీకే దృష్టి పెట్టింది. విజయ్ ఇమేజ్, డీఎంకే, బీజేపీలపై విమర్శలు బలంగా ఉన్నప్పటికీ, రాజకీయ అనుభవం లేకపోవడం, సంస్థాగత బలం తక్కువగా ఉండటం టీవీకేకు పెద్ద సవాల్. TVK CM Candidate Vijay.
తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, టీవీకే, నామ్ తమిళర్ కచ్చి వంటి పార్టీలు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. డీఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది, ద్రావిడ పార్టీగా గుర్తింపు, సామాజిక న్యాయ విధానాలతో బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉంది. అటు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ద్రావిడ ఓట్లతో పాటు హిందూ జాతీయవాద ఓట్లను ఆకర్షించే అవకాశం ఉంది. టీవీకే మాత్రం యువత, సినీ అభిమానులు, డీఎంకే, అన్నాడీఎంకేలపై విసిగిన ఓటర్లను టార్గెట్ చేస్తోంది. టీవీకేకు 34.55%, డీఎంకేకు 30.20%, అన్నాడీఎంకేకు 27.85% ఓటు షేర్ రావచ్చని కొన్ని సర్వేల అంచనా. ముఖ్యంగా డీఎంకే, ఎన్‌టీకే ఓట్లను టీవీకే ఎక్కువగా చీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ద్రావిడ, తమిళ గుర్తింపుపై ఆధారపడతాయి. ఎన్‌టీకే 8% ఓటు షేర్‌తో గణనీయమైన ప్రభావం చూపగలదు. గ్రామీణ ప్రాంతాల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు బలమైన ఓటు బ్యాంక్ ఉండగా, పట్టణ యువతలో టీవీకే పట్టు సాధించవచ్చు. అయితే, ఓట్ల చీలిక వల్ల ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చు.
ఏ వర్గాలు ఎవరికి ఓటు వేస్తాయి?
తమిళనాడు రాజకీయాల్లో కులం, ప్రాంతం, భాషా గుర్తింపు కీలక పాత్ర పోషిస్తాయి. డీఎంకే ద్రావిడ గుర్తింపు, సామాజిక న్యాయ విధానాలతో దళితులు, బీసీలు, మైనారిటీలలో బలమైన మద్దతు కలిగి ఉంది. అన్నాడీఎంకే థేవర్, వన్నియార్ వంటి మధ్యస్థ కులాల్లో బలంగా ఉంది, బీజేపీతో కలిసి హిందూ జాతీయవాద ఓట్లను కూడా ఆకర్షిస్తోంది. టీవీకే మాత్రం కుల, మత గుర్తింపులకు అతీతంగా యువత, పట్టణ మధ్యతరగతి, విజయ్ అభిమానులను ఆకర్షిస్తోంది. విజయ్ ఇటీవల శివగంగై కస్టడీ మరణంపై డీఎంకేను విమర్శించడం, హిందీ, సంస్కృత భాషల విధానంపై బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ద్వారా తమిళ గుర్తింపును లేవనెత్తుతున్నారు. ఇది యువ ఓటర్లలో, ముఖ్యంగా ద్రావిడ గుర్తింపును కోరుకునే వారిలో ఆదరణ పెంచుతోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో డీఎంకే, అన్నాడీఎంకేల సంస్థాగత బలం ముందు టీవీకే ఇంకా బలపడాల్సి ఉంది. ఎన్‌టీకే వంటి చిన్న పార్టీలు కూడా తమిళ జాతీయవాద ఓట్లను చీల్చే అవకాశం ఉంది, ఇది టీవీకేకు నష్టం కలిగించవచ్చు.
హాంగ్ అసెంబ్లీ వస్తే ఎవరు ఎవరితో కలుస్తారు?
ఒకవేళ 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హాంగ్ సిట్యుయేషన్ ఏర్పడితే, రాజకీయ డైనమిక్స్ ఆసక్తికరంగా మారతాయి. టీవీకే విజయ్ స్పష్టంగా డీఎంకే, బీజేపీలతో పొత్తు ఉండదని చెప్పారు, కాబట్టి వారు స్వతంత్రంగా ఉండే అవకాశం ఎక్కువ. అయితే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో కూడా టీవీకే దూరంగా ఉంటుందని విజయ్ చెప్పారు. హాంగ్ ఏర్పాడితే టీవీకే కీలక పాత్ర పోషించవచ్చు, డీఎంకే, అన్నాడీఎంకే మధ్య గతంలో పొత్తులు చాలా అరుదు, కాబట్టి వారు చిన్న పార్టీల మద్దతు కోసం పోటీ పడవచ్చు. అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ఉంటే, డీఎంకే కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూటమిని బలోపేతం చేసుకోవచ్చు. టీవీకే సింగిల్‌గా గెలిచే అవకాశం తక్కువైనప్పటికీ, ఓట్ల చీలిక ద్వారా కీలక స్థానంలో నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది.