
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్పును గెలుచుకుంది. ఈ ఆనందంతో దేశమంతా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు. కానీ…విజయోత్సాహం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పెనువిషాదాన్ని మిగిల్చింది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు, 50 కిపైగా గాయపడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.తమ బిడ్డలను కోల్పోయిన వారి ఆర్తనాదాలతో స్టేడియంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఈ గందరగోళానికి దారి తీసిన కారణాలేంటి? తప్పు ఎవరిది? లేనిపోని వదంతులు సృష్టించిందెవరు? ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఏం చెబుతోంది? కర్ణాటక ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్ .
అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గెలిచి..టైటిల్ కొట్టింది ఆర్సీబీ టీమ్. ఎన్నో పరాభవాలు చూశాక..18 ఏళ్ల నిరీక్షణ అనంతరం తమ ఫేవరేట్ టీమ్ టైటిల్ కొట్టడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇక అదే జోష్‌లో ట్రోఫీని నెత్తిన పెట్టుకుని ఫస్ట్ టైమ్ బెంగళూరుకు వచ్చింది ఆర్సీబీ టీమ్. ఈ టీమ్ కి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ అభిమాన క్రికెటర్లను దగ్గరి నుంచి చూడాలని, విజయాన్ని పంచుకోవాలని అభిమానులు లక్షలాదిగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు.వాస్తవానికి స్టేడియం కెపాసిటీ 35వేల మంది మాత్రమే. కానీ బుధవారం సాయంత్రం దాదాపు 3 లక్షలకు పైగా జనం తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఊహించని విధంగా అభిమానులు తరలిరావడంతో వారిని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
చిన్నస్వామి స్టేడియంలో మొత్తం 21 స్టాండ్‌లు, 13 గేట్లు ఉన్నాయి. ఇందులో 9, 10వ నంబరు గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ ముందుగానే రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి ఫ్యాన్స్ కు ఎంట్రీ కల్పించారు. ఇక్కడున్న 7వ నంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే వ్యూ కన్పిస్తుంది. ఈ మెయిన్ ఎంట్రెన్స్ నుంచే ఆర్సీబీ టీమ్ గ్రౌండ్ లోకి ప్రవేశిస్తుంది . దీంతో అభిమానులంతా ఈ 7వ నెంబర్ గేట్ వద్దకు పోటెత్తారు.అయితే పాస్ లు ఉన్నవారికి మాత్రమే లోపలికి వేళ్లే ఛాన్స్ ఉంది. కానీ చాలా మంది పాస్ లు లేకుండానే అక్కడికి వచ్చేశారు. అదే టైమ్ లో 7వ నెంబర్ గేట్ దగ్గర ఫ్రీ పాస్ లు ఇస్తున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో ఫ్రీ టికెట్స్ కోసం ఆ గేటు దగ్గరకు పరుగులు తీశారు. టికెట్లు ఇస్తున్నారనే కంగారులో ఒకరిని ఒకరు తోసుకోవడం, బ్యారికేడ్లు ఎక్కి ముందుకు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
వేడుకల నిర్వహణలో స్పష్టమైన ప్రణాళిక కొరవడిందని బీసీసీఐ, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వంటి ఉన్నతాధికారులు కూడా అంగీకరించారు. అభిమానుల తాకిడిని అంచనా వేయడంలో, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులు మోహరించినప్పటికీ, ఒక్కసారిగా తరలివచ్చిన భారీగా జనసందోహాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అభిమానులు గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి కంట్రోల్ తప్పిందని ఈ క్రమంలో స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని, ఇది తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. ఇక తమ వద్ద పాస్‌లు ఉన్నప్పటికీ.. తమను లోపలికి రానియ్యకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ముందుగా ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ను విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ఆర్సీబీ టీమ్ నిన్న ఉదయం ప్రకటించింది. అయితే భారీ జన సందోహం, ట్రాఫిక్ సమస్యల కారణంగా పోలీసులు ఈ ర్యాలీకి పర్మీషన్ ఇవ్వలేదు. దీంతో ఆర్సీబీ టీమ్ ఈ పరేడ్ ను రద్దు చేసింది. స్టేడియంలో కేవలం సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నిన్న ఉదయం ప్రకటించారు. కానీ, మధ్యాహ్నం పరేడ్ నిర్వహిస్తామని, అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ మరో ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
పరేడ్ ఉంటుందో, లేదో తెలియక ఎక్కువమంది నేరుగా స్టేడియం లోపలికి వెళ్లేందుకే ఆసక్తి చూపించారు.తమ అభిమాన ఆటగాళ్లను, ట్రోఫీని చూసేందుకు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తొక్కిసలాటకు ఇది కూడా కారణమే. అభిమానులు స్టేడయం గేట్లను బద్దలు కొట్టి, చెట్లు, బస్సులపైకి ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక తొక్కిసలాటలో గాయపడిన వారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి వైద్య అందించడంలోనూ ఆలస్యం చోటు చేసుకుంది. ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్‌లు సకాలంలో హాస్పిటల్స్ కు చేరుకోలేకపోయాయి.
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఐపీఎల్ విజయోత్సవంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.తొక్కిసలాలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.