సాంకేతిక సమస్యా..? పైలట్ తప్పిదామా..?

ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ దర్యాప్తులో కీలక విషయం ఒకటి బయటపడింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిని ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ చెప్పిన సమాచారంతో దర్యాప్తు అధికారులు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. అది ఏంటి..? ఈ ప్రమాదంపై దర్యాప్తులో అది ఎందుకు కీలకం కానుంది..? మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ఒక టర్న్ తీసుకునే అవకాశం ఉంది..? అయితే తమ విమానాలు మంచిగానే ఉన్నాయని చెబుతోన్న బోయింగ్ కు పెద్ద సమస్య రాబోతోందా..?

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం 825 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందపడి, మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ ఏరియాలో కూలింది. ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయాణికులు, గ్రౌండ్‌లో ఉన్న కొందరు మెడికల్ స్టూడెంట్స్‌తో పాటు చాలామంది చనిపోయారు. అయితే ప్రయాణికుల్లో ఒక్కరే ఒకరు బతికారు. అతడే రమేష్ విశ్వాస్. ప్రమాదంపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు బృందాలు.. రమేష్ ను ప్రశ్నిస్తే కొన్ని కీలక అంశాలు బయటపట్టాయి. ప్రమాదానికి ముందు రమేష్ బూమ్ అనే శబ్దం విన్నానని చెప్పాడు. ఈ శబ్దమే విమానంలో ఏదో పెద్ద సమస్యకు కారణమైందని భావిస్తున్నారు.

ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. ఎక్కువ దూరం ప్రయాణించడానికి.. ఇంధనం ఆదా చేయడానికి ఈ విమానంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఈ విమానంలో సాధారణ విమానాల్లో ఉండే హైడ్రాలిక్, న్యూమాటిక్ సిస్టమ్స్‌కు బదులు ఎక్కువగా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. దీని వల్ల విమానం తేలికగా, ఇంధనం తక్కువగా ఖర్చయ్యేలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్‌పైనే అనుమానాలు వస్తున్నాయి. నిపుణులు చెబుతున్నది ఏంటంటే, విమానంలోని VFSG అనే ఒక ముఖ్యమైన ఎలక్ట్రికల్ పరికరం పాడై ఉండొచ్చు. VFSG అంటే ఇంజన్‌ను స్టార్ట్ చేసే, విద్యుత్‌ను సరఫరా చేసే ఒక జనరేటర్. ఇది పనిచేయకపోతే, విమాన ఇంజన్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయి, పైలట్లు కంట్రోల్ కోల్పోయే అవకాశం ఉంది.

మృత్యుంజయుడు రమేష్ చెబుతున్న బూమ్ శబ్దం ఎందుకు వచ్చిందని నిపుణులు ఆలోచిస్తున్నారు. ఈ శబ్దం VFSG పాడైనప్పుడు లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు వచ్చే శబ్దం కావచ్చని అనుమానిస్తున్నారు. సాధారణంగా బోయింగ్ 787 లాంటి ఆధునిక విమానాలు ఒక ఇంజన్ పనిచేయకపోయినా క్రాష్ కాకూడదు. ఎందుకంటే రెండో ఇంజన్ ఉంటుంది. కానీ ఈ విమానంలో రెండు ఇంజన్లూ ఒకేసారి ఆగిపోయాయా అనే సందేహం వస్తోంది. గతంలో రెండు ఇంజన్లూ ఆగిపోయి.. ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా తక్కువ. అవి కూడా పక్షులు ఢీకొనడం, ఇంధనంలో సమస్యలు, పైలట్లు తప్పుగా ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల జరిగినవే. తాజా ప్రమాదంలో పక్షులు ఢీకొన్నట్టు ఆధారాలు ఎక్కడా లేవు. మరి ఇంధనంలో సమస్యా, లేక పైలట్ల తప్పా అని ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.

ఈ విమానంలో పైలట్లు చాలా అనుభవం ఉన్నవాళ్లు. కెప్టెన్ సుమీత్ సబర్వాల్‌కు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో 9,000 గంటలకు పైగా ఫ్లైయింగ్ అనుభవం ఉంది. కానీ కొందరు నిపుణులు మాత్రం పైలట్లు తప్పుగా ఒక ఇంజన్‌ను ఆఫ్ చేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బూమ్ శబ్దం వచ్చినప్పుడు ఒక ఇంజన్ ఆగిపోయి ఉండొచ్చు, కానీ విమానం ఎందుకు అంత వేగంగా కిందపడింది? పైలట్లు బహుశా సరైన ఇంజన్‌ను కాకుండా, తప్పుగా మరో ఇంజన్‌ను ఆఫ్ చేశారేమో అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అయితే, ఇది కేవలం అనుమానం మాత్రమే. విమానంలో ఫ్లాప్స్ అంటే విమానం ఎగరడానికి సహాయపడే రెక్కల భాగాలు, విమానం చక్రాలతో సమస్య ఉండొచ్చని కూడా కొందరు చెబుతున్నారు. కానీ ఈ స్విచ్‌లు కాక్‌పిట్‌లో దూరంగా ఉంటాయి కాబట్టి, పైలట్లు తప్పు చేసే అవకాశం తక్కువని మరికొందరు అంటున్నారు.

ఈ దుర్ఘటనకు ముందు ఈ విమానంలో సమస్యలు ఉన్నాయని ఒక ప్రయాణికుడు చెప్పాడు. అకాశ్ వత్సా అనే వ్యక్తి, ప్రమాదానికి రెండు గంటల ముందు ఈ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చానని, అప్పుడు ఎయిర్ కండిషనింగ్ పనిచేయలేదని, సీట్ల బటన్లు, ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు కూడా సరిగా లేవని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ సమస్యలు చిన్నవిగా కనిపించినా, విమానంలో ఎలక్ట్రికల్ సిస్టమ్‌తో పెద్ద లోపం ఉందేమోనని తెలియజేస్తాయి. ఈ విమానం గతంలో ఢిల్లీ నుంచి పారిస్, టోక్యో, మెల్‌బోర్న్ లాంటి అంతర్జాతీయ రూట్లలో ఎలాంటి సమస్య లేకుండా ఎగిరింది. కానీ ఈసారి ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ దుర్ఘటన తర్వాత భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దేశంలోని అన్ని బోయింగ్ 787 విమానాలను తనిఖీ చేయమని ఆదేశించింది. ఎయిర్ ఇండియాకు 33 బోయింగ్ 787లు ఉన్నాయి, వీటిలో కొన్ని విమానాల తనిఖీ పూర్తయింది. ఇంజన్ ఇంధన వ్యవస్థ, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్, టేకాఫ్ సెట్టింగ్స్ లాంటి కీలక భాగాలను జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. ఈ తనిఖీల వల్ల కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చని ఎయిర్ ఇండియా చెప్పింది. ఈ క్రాష్ తర్వాత బోయింగ్ కంపెనీపై ఒత్తిడి పెరిగింది. బోయింగ్ సీఈవో కెల్లీ ఆర్ట్‌బర్గ్ పారిస్ ఎయిర్ షో ట్రిప్‌ను క్యాన్సిల్ చేసి, ఈ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. బోయింగ్ షేర్లు 7.72% పడిపోయాయి.

ఈ క్రాష్ బోయింగ్‌పై గతంలో వచ్చిన ఆరోపణలను మళ్లీ తెరపైకి తెచ్చింది. 2010-2017 మధ్య బోయింగ్‌లో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేసిన జాన్ బార్నెట్ డ్రీమ్‌లైనర్ తయారీలో సేఫ్టీ స్టాండర్డ్స్ తగ్గాయని, విమానాల్లో లోపాలను పట్టించుకోకుండా ఉత్పత్తి చేశారని ఆరోపించారు. ముఖ్యంగా కీలక వైరింగ్ దగ్గర ఐరన్ పార్ట్స్ ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. 2024లో బార్నెట్ మరణం వివాదాస్పదమైంది. తాజా ప్రమాదం తర్వాత బోయింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌పై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి.