
భారత్ కు ప్రపంచంలో ప్రధాన శత్రువు ఎవరు..? అందరూ పాకిస్థాన్ అనుకుంటారు.. కాని అది తప్పు అంటోంది అమెరికా నిఘా విభాగం విడుదల చేసిన వరల్డ్‌వైడ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదిక. భారత్ కు ప్రధాన శత్రువు చైనా అంట. అది ఎలా ? ఎందుకు చైనా భారత్ కు ప్రమాదకారి..? చైనాతో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి..? పాకిస్థాన్ విషయంలో ఎలాంటి శత్రుత్వం ఉంది..? వరల్డ్‌వైడ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదికలో ఇంక ఏం చెప్పారు..?
సరిహద్దు దేశాలతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండే శత్రుదేశాలతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే శత్రువు ఎవరు తెలిసినప్పుడు .. దానికి తగ్గా జాగ్రత్తలు తీసుకోవాలి.. శత్రుదేశం ఏం చేస్తోంది.. మనపై ఎలాంటి కుట్రలు పన్నుతోంది. తెలుసుకుని తిప్పికొట్టే వ్యూహాన్ని అమలు పర్చాలి. తాజాగా అమెరికా నిఘా సంస్థలు వార్షికంగా విడుదల చేసే వరల్డ్‌వైడ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదిక చైనా సైనిక, అణ్వాయుధ సామర్థ్యాలు, రక్షణ వ్యూహాలు, ప్రాంతీయ విధానాల్లో కీలక విషయాలను బయటపెడుతున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్, రహస్య సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. పెంటగాన్ వెబ్ సెట్ లై ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉంచారు. 2025 అన్నూవల్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదిక, చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి వచ్చే థ్రెట్స్ ను వివరిస్తుంది.
2023లో, యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నివేదిక ప్రకారం, చైనా వద్ద 600 కంటే ఎక్కువ ఆపరేషనల్ అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇది 2022లో 500 దాటి పెరిగింది. 2030 నాటికి ఈ సంఖ్య 1,000కి పైగా చేరుకుంటుందని, 2035 నాటికి 1,500కు చేరుకునే అవకాశం ఉందని పెంటగాన్ అంచనా వేస్తోంది. చైనా తన అణ్వాయుధ స్టాక్‌పైల్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో 300 కొత్త ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరీన్‌లు, అధునాతన డెలివరీ సిస్టమ్‌లు ఉన్నాయి. 2023లో, చైనా యొక్క అధికారిక రక్షణ బడ్జెట్ సుమారు 225 బిలియన్ డాలర్లుగా నివేదించబడింది. ఇది 2022 కంటే 7.2% ఎక్కువ. అయితే, నిజమైన ఖర్చు 300 బిలియన్ డాలర్లకు పైగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే చైనా తన రక్షణ ఖర్చులను పారదర్శకంగా చూపించడం లేదు. 2024లో ఈ బడ్జెట్ మరింత పెరిగి, సుమారు 7.5 శాతం దాటింది. చైనాలో బడ్జెట్ లో ఎక్కువ శాతం అణ్వాయుధ విస్తరణ, నావికాదళ ఆధునీకరణ, వైమానిక దళంలో ఐదవ తరం ఫైటర్ జెట్‌లు, స్పేస్ టెక్నాలజీలలో పెట్టుబడులకు ఉపయోగిస్తోంది. 2023లో చైనా 67 అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించి.. 200 కంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది సైనిక నిఘా, సమాచార సేకరణ సామర్థ్యాలను చైనా పెంచుకుంటోంది.
అటు చైనా తైవాన్‌పై సైనిక, దౌత్యపరమైన, ఆర్థిక ఒత్తిడిని పెంచింది. 2023లో, తైవాన్ స్ట్రెయిట్ చుట్టూ చైనా నావికాదళం తన ఉనికిని విస్తరించింది. జాయింట్ స్వోర్డ్-2024 వంటి సైనిక విన్యాసాలను నిర్వహించింది. తైవాన్‌ను తన భూభాగంగా భావించే చైనా, 2027 నాటికి తైవాన్‌ను ఆక్రమించే సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని అమెరికా నిఘా నివేదిక చెబుతోంది. ఫిలిప్పీన్స్‌పై, దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ దీవులు, స్కార్‌బరో షోల్ వంటి వివాదాస్పద ప్రాంతాలలో చైనా తన కోస్ట్ గార్డ్, నావికాదళ ఓడలను ఉపయోగించి ఒత్తిడి చేస్తోంది. 2023లో, ఫిలిప్పీన్స్ ఓడలపై చైనా కోస్ట్ గార్డ్ వాటర్ కానన్‌లను ప్రయోగించింది. ఇవి అంతర్జాతీయంగా విమర్శలకు కారణమైంది. ప్రాంతీయ ఆధిపత్యాన్ని పెంచడం.. అమెరికా మిత్రదేశాలను బలహీనపరచడం లక్ష్యంగా చైనా చర్యలు ఉన్నాయి. దీనిలో భాగంగానే భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, లడాక్ లో చైనా చర్యలను జాగ్రత్తగా గమనించాలని హెచ్చరిస్తున్నారు.
2025 అన్నూవల్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదికలో, చైనాను భారత్‌కు ప్రధాన శత్రువుగా స్పష్టంగా పేర్కొనలేదు, కానీ చైనా సైనిక విస్తరణ, భారత్-చైనా సరిహద్దు వివాదాలు భారత్‌కు ఎప్పటికైనా సమస్యే అని చెబుతోంది. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత, చైనా LAC వెంబడి 50 వేల మందికి పైగా సైనికులను మోహరించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ లో సైనిక, ఆర్థిక ప్రభావాన్ని పెంచడం కూడా భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయితే, నివేదికలు భారత్‌కు చైనాను ప్రధాన శత్రువు గా కాకుండా, ఒక ప్రధాన సైనిక, భౌగోళిక రాజకీయ పోటీదారుగా చెబుతున్నాయి. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే..
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పరిస్థితులు థ్రెట్ అసెస్‌మెంట్ నివేదికలో కీలకంగా ప్రస్తావించబడ్డాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత దాని సైనిక సామర్థ్యాలను పరిమితం చేస్తున్నప్పటికీ, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా అందించే ఆర్థిక, సైనిక మద్దతు భారత్‌కు సవాలుగా ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యం, దాని బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌ను భారత్‌కు కాస్తే ఇబ్బందే. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగే పరిణామాలు చాలా తక్కువగా ఉందని, కానీ ఉగ్రవాద దాడులు, సరిహద్దు దాడులు ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దీనికి తగ్గటే ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగి.. సరిహద్దుల్లో దాడుల వరకు వెళ్లింది.
చైనా, పాకిస్థాన్ ను ఎదుర్కోవడానికి భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచాలని అమెరికా నిఘా నివేదిక చెబుతోంది. భారత్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని , బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌ను బలోపేతం చేయాలి. ఐదవ తరం ఫైటర్ జెట్‌లు , డ్రోన్‌లు, సైబర్ దాడులను ఎదర్కొనే విషయాల్లో పెట్టుబడులు పెంచాలి. చైనా నావికాదళ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి, భారత్ తన నావికాదళాన్ని ఆధునీకరించాలి. LAC వెంబడి రోడ్లు, విమానాశ్రయాలు, సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. చైనాతో సరిహద్దు చర్చలను కొనసాగిస్తూనే, సైనిక సన్నద్ధతను కొనసాగించాలి.
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో క్వాడ్ ద్వారా సహకారాన్ని బలోపేతం చేయాలి. ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దక్షిణ చైనా సముద్రంలో చైనా ఒత్తిడిని ఎదుర్కొనే దేశాలతో సైనిక సహకారాన్ని పెంచాలి. చైనా సైబర్ దాడులను ఎదుర్కోవడానికి, భారత్ తన సైబర్ డిఫెన్స్, ఆఫెన్సివ్ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. LoC వెంబడి ఉగ్రవాద దాడులను అరికట్టడానికి భారత్ తన నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయాలి. పాకిస్తాన్‌లోని ఆర్థిక అస్థిరతను ఉపయోగించి, దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలి. ఈ చర్యల ద్వారా సరిహద్దులోని శత్రువులను కట్టడి చేయవచ్చని నివేదిక చెబుతోంది.