
అసలు కాంగ్రెస్ కు ఏమైంది..? స్వతంత్ర్య తెచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ చేతిని సీనియర్లు ఎందుకు వీడుతున్నారు..? శశిథరూర్, చిదంబర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు రాహుల్ కు దూరం కావడానికి కారణం ఏంటి..? హస్తం పార్టీ వరుస ఓటములే దీనికి కారణమా..? ఇక కాంగ్రెస్ పని అయిపోయిందా..? ఇది తెలిసే సీనియర్లు సర్దుకుంటున్నారా..? దీనిని బీజేపీ అవకాశంగా తీసుకుంటోందా..? శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలో పట్టుకోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు..? దీనికి శశిథరూర్ తోడు కాబోతున్నారా..?
కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజకీయ ధురందరుడు శశి థరూర్ హస్తం పార్టీని వీడుతున్నారా? ఆయనతో పాటు మరికొందరు గాంధీలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ మధ్య దూరం పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కొంత కాలంగా థరూర్ తన సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కేరళలో సీపీఎం ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం, కేరళ ప్రభుత్వాన్ని విమర్శించే కాంగ్రెస్ నేతలతో భిన్నంగా వ్యవహరించడం వంటివి హస్తం అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. 2022లో మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటి నుంచి థరూర్‌ను పార్టీ కొంత ఒంటరిగా చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, థరూర్ ఇంకా ఈ విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే శశి థరూర్ బీజేపీకి దగ్గరవుతున్నారనే మాటలు కొంత నిజమైనవేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోదీ విదేశాంగ విధానాన్ని థరూర్ ప్రశంసించడం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సెల్ఫీ దిగడం వంటి సంఘటనలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. మే 2025లో కేరళలోని ఓ ఓడరేవు ప్రారంభోత్సవంలో మోదీ, థరూర్ ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా మోదీ, ఈ రోజు శశి థరూర్ ఇక్కడ ఉన్నారు. ఈ ఫొటో కొందరికి నిద్ర లేని రాత్రులు మిగులుస్తుంది అని వ్యంగ్యంగా అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తిని పెంచాయి. కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో దూరం పెట్టడం వల్లే శశిథరూర్ బీజేపీకి దగ్గరవుతున్నారని కొందరు అంటున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో ఒకదానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, కాంగ్రెస్ సూచించిన నలుగురు ఎంపీల జాబితాలో థరూర్ పేరు లేకపోయినా, కేంద్రం ఆయననే ఎంచుకోవడం రాజకీయంగా సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. థరూర్ ఈ బాధ్యతను స్వీకరించడం, పార్టీ అనుమతి లేకుండా కేంద్ర బృందంలో చేరడం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ వ్యవహారం థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలను మరింత పెంచింది. శశి థరూర్‌తో పాటు కాంగ్రెస్‌లోని మరికొందరు సీనియర్ నేతలు కూడా పార్టీకి దూరమవుతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం కొందరు నేతలను పక్కనపెట్టడం, అంతర్గత కలహాలు, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ వైఫల్యాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్ వంటి నేతలు పార్టీని వీడిన తీరు ఇప్పుడు థరూర్ విషయంలోనూ కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఇండియా కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలహీనపడితే, కూటమిలోని ఇతర పార్టీల మధ్య సమన్వయం తగ్గి, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా నిలబడే అవకాశం సన్నగిల్లుతుంది.
అటు శశిథరూర్ తో పాటు మరో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా ఇటీవల ఇండియా కూటమి భవిష్యత్తుపై వ్యక్తం చేసిన అసంతృప్తి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిదంబరం, ఇండియా కూటమి బలంగా ఉందని మృత్యుంజయ్ సింగ్ యాదవ్ అన్నారని… తనకు అంత నమ్మకం లేదని… ఇది బలహీనంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంలో అసంతృప్తిని రేకెత్తించాయి. ఎందుకంటే ఇండియా కూటమి నాయకత్వ బాధ్యత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద ఉంది. చిదంబరం ఈ విమర్శలు కేవలం కూటమిపైనే కాక, కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యాన్ని కూడా పరోక్షంగా సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చిదంబరం ఇండియా కూటమిపై వ్యక్తం చేసిన అసంతృప్తి వెనుక కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది, కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, లెఫ్ట్ పార్టీల మధ్య సమన్వయం లోపించడం. రాబోయే ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఈ పార్టీలు ఒకదానికొకటి పోటీపడనున్నాయి. దీంతో కూటమి సమావేశాలు ఆగిపోయాయని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. రెండవది, కాంగ్రెస్ నాయకత్వంపై ఆయనకున్న అసంతృప్తి. గత ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీలో అంతర్గత కలహాలు, సీనియర్ నేతలను పక్కనపెట్టడం వంటి అంశాలు చిదంబరం అసంతృప్తికి కారణమని భావిస్తున్నారు. 2024లో మణిపూర్ సంక్షోభంపై చిదంబరం చేసిన ట్వీట్‌ను మణిపూర్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించి, పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం ఈ విభేదాలను స్పష్టం చేస్తుంది.
శశి థరూర్ బీజేపీ వైపు దగ్గరవుతున్నారనే చర్చల తర్వాత, చిదంబరం వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. చిదంబరం వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరింత బయటపెట్టాయి. శశి థరూర్‌తో సహా సీనియర్ నేతల అసంతృప్తి, పార్టీలో యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వకపోవడం, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లోపాలు వంటివి కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నాయి. ఇండియా కూటమిలో సమన్వయం లేకపోవడం, కాంగ్రెస్ బలహీనత వల్ల 2029 ఎన్నికల్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా నిలబడే అవకాశం తగ్గుతుందని చిదంబరం స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ నేతలు బిహార్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూటమి ఇంకా బలంగా ఉందని వాదిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కేరళలో పట్టుకోల్పోతోందని.. అక్కడ బీజేపీ బలపడుతోందని అంటున్నారు.
కేరళ రాజకీయాల్లో బీజేపీ గత కొన్నేళ్లుగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఎప్పటి నుంచో కేరళ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న రాష్ట్రం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, బీజేపీ తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్‌ను ఎంపీగా పోటీ చేయించింది. అయితే శశి థరూర్‌తో పోటీలో ఆయన ఓడిపోయాడు. అయినప్పటికీ, బీజేపీ ఓటు షేర్ గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా హిందూ సమాజంలో సామాజిక, సాంస్కృతిక సమస్యలను లేవనెత్తడం ద్వారా బీజేపీ కేరళలో సంఘ్ పరివార్ సంస్థల ద్వారా గ్రాస్‌రూట్ స్థాయిలో కార్యకలాపాలను బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ సీపోర్ట్ ప్రాజెక్ట్ లాంటి అభివృద్ధి పనులను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటూ, స్థానికంగా మద్దతు సంపాదించే ప్రయత్నం చేస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎప్పటి నుంచో బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. కానీ ఇటీవలి కొన్ని సంఘటనలు రాజకీయ సమీకరణల్లో మార్పును తెలియజేస్తున్నాయి. సీపోర్ట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధాని మోదీతో కలిసి హాజరవ్వడం, ఈ కార్యక్రమంలో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరేలా మోదీ వ్యాఖ్యలు చేయడం మార్పులను తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో, మోదీ సీపీఎం, కాంగ్రెస్‌లను ఒకే వేదికపై ఉన్నందుకు చాలామంది నిద్ర కోల్పోతారు అని వ్యాఖ్యానించారు, ఇది LDF, UDFల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని ఉద్దేశించినది. సీపీఎం కొన్ని సందర్భాల్లో బీజేపీతో రాజకీయ సహకారం కోసం చూస్తోందని.. ముఖ్యంగా కాంగ్రెస్‌తో పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ఇది జరుగుతోందని కొందరు విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ కేరళలో బలహీనపడుతోందని అంటున్నారు. కేరళలో కాంగ్రెస్ బలహీనతకు పలు కారణాలు ఉన్నాయి. మొదట, పార్టీ అంతర్గత విభేదాలు, నాయకత్వ సమస్యలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. శశి థరూర్ వంటి సీనియర్ నాయకులు పార్టీ అధిష్ఠానంతో విభేదిస్తూ, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీ ఐక్యతను దెబ్బతీస్తోంది. రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్ వంటి నాయకులు థరూర్‌ను కట్టడి చేయాలని భావిస్తున్నారు, కానీ థరూర్ పై చర్యలు తీసుకుంటే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండవది, కాంగ్రెస్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో భాగంగా సీపీఎంతో పోటీలో ఉంది. కానీ అంతర్గత సమన్వయ లోపం వల్ల ఓటు బ్యాంకు చీలిపోతోంది. మూడవది, బీజేపీ హిందూ ఓట్లను ఆకర్షించడం, అభివృద్ధి పనులను ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును కొంతమేర కోల్పోతోంది. వచ్చే ఏడాది జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు థరూర్‌పై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం. థరూర్‌ను పార్టీ నుంచి తొలగిస్తే, బీజేపీకి రాజకీయంగా ఆయుధం ఇచ్చినట్లవుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే, థరూర్ స్వతంత్ర రాజకీయ గుర్తింపు, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న పేరు బీజేపీకి ఉపయోగపడొచ్చు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకపోతే, ఇండియా కూటమి బలం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కేరళతో పాటు దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. ఒకవేళ శశిథరూర్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే… బీజేపీ ఆయనను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు.