కర్ణాటక సీఎం మారబోతున్నారా..?

Karnataka DCM DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ త్వరలో సీఎం అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రెండు మూడు నెలల్లో శివకుమార్ సీఎం పదవి చేపడతారని అంటున్నారు. ఈ వార్తలు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు సీఎం మార్పుపై ఎలాంటి వార్తలు వస్తున్నాయి? ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, ఇతర నేతలు ఈ వార్తలపై ఎలా స్పందిస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

కర్ణాటకలో సీఎం మార్పు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీకే శివకుమార్ అనురుడు అయిన ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి. రెండు మూడు నెలల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారని చెప్పారు ఇక్బాల్ హుస్సేన్. ఈ మాటలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఇక్బాల్ శివకుమార్‌కు సన్నిహితుడు కావడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. గతంలో, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య పోటీ ఉందని చర్చ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యను సీఎంగా, శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా నియమించింది. కొందరు నేతలు రెండున్నర సంవత్సరాల తర్వాత సీఎం పదవిని షేర్ చేసుకుంటారని ఒక ఒప్పందం ఉందని అన్నారు. ఈ ఒప్పందం ఆధారంగానే ఇప్పుడు శివకుమార్ సీఎం అవుతారని చర్చలు జరుగుతున్నాయి. శివకుమార్‌కు మద్దతుగా మరో ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగా కూడా మాట్లాడారు. డిసెంబర్ తర్వాత శివకుమార్ సీఎం అయితే తనకు సంతోషమేనని చెప్పారు. Karnataka DCM DK Shivakumar.

డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 135 సీట్లు గెలిచి, బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది. శివకుమార్ ఎన్నికల వ్యూహం, ప్రచారం, కార్యకర్తలను సమన్వయం చేయడంలో చాలా కష్టపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించారు. ఆయన బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను ఒక్కటిగా చేసి, ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తిని ఓట్లుగా మార్చారు. బ్యాక్‌వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ వర్గాలను ఆకర్షించే వ్యూహాలు రూపొందించారు. ఎన్నికల సమయంలో 40 శాతం కమీషన్ అనే నినాదంతో బీజేపీని ఎన్నికల్లో ఓడేలా చేశారు. శివకుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు ప్రకటించి, ప్రజల్లో ఆదారణ పొందింది. ఈ గ్యారంటీలు ఎన్నికల్లో విజయానికి పెద్ద కారణమయ్యాయి.

డీకే శివకుమార్ కర్ణాటకలోని కనకపురలో 1962లో జన్మించారు. ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గం కర్ణాటకలో రాజకీయంగా, సామాజికంగా బలమైన ప్రభావం కలిగి ఉంది. శివకుమార్ తండ్రి డి.కె. కెంపేగౌడ కూడా రాజకీయ నాయకుడు. శివకుమార్ 1985లో రాజకీయాల్లోకి వచ్చి, కనకపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన బెంగళూరు రూరల్, సత్తెనూర్ నియోజకవర్గాల నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన 2020 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. శివకుమార్ వివాదాస్పద నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఆయనపై ఆర్థిక అవకతవకల కేసు నమోదు చేసింది. అయినా, ఆయన పార్టీలో తన పట్టు కోల్పోలేదు. శివకుమార్ వొక్కలిగ సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు కలిగి ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో వొక్కలిగులు రాజకీయంగా కీలక శక్తిగా ఉన్నారు. డీకే శివకుమార్ రాజకీయ వ్యూహాలు, సంస్థాగత నైపుణ్యం కాంగ్రెస్‌ను బలోపేతం చేశాయి. శివకుమార్ కు బెంగళూరులో వ్యాపార, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక బలం, రాజకీయ ప్రభావం ఆయనను కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన సీఎం అయితే, వొక్కలిగ సామాజిక వర్గం మద్దతు కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య శివకుమార్ సీఎం అవుతారనే వార్తలను తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు లేవని, అంతా సాఫీగా ఉందని చెప్పారు. మంత్రి రాజన్న సెప్టెంబర్ తర్వాత రాజకీయ మార్పులు జరుగుతాయని చెప్పినప్పుడు కూడా సిద్ధరామయ్య ఆ మాటలను తేలిగ్గా తీసుకున్నారు. రాజన్నా ఏం అన్నారో తనకు తెలియదు, ఆయనతో మాట్లాడాలి అని శివకుమార్ కూడా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగరాజ్ యాదవ్ ఈ వార్తలపై సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యే. హైకమాండ్ ఏం నిర్ణయిస్తుందో ఎవరికీ తెలియదు. శివకుమార్ చాలా కృషి చేశారు, కానీ సిద్ధరామయ్య కూడా చాలా చేశారు అని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఈ చర్చలను పక్కనపెట్టాలని హైకమాండ్ ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే, శివకుమార్ మద్దతుదారులైన ఇక్బాల్ హుస్సేన్, బసవరాజ్ శివగంగా లాంటి నేతలు ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడుతున్నారు. 200 శాతం శివకుమార్ సీఎం అవుతారు అని ఇక్బాల్ హుస్సేన్ గట్టిగా చెబుతున్నారు. మరోవైపు, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సీఎం మార్పు గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.

Also Read: https://www.mega9tv.com/national/the-truth-behind-the-death-of-bollywood-actress-shefali-jariwala/